బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భూదందాలు పెరిగిపోయాయి. భకజ్జాలు పెరిగిపోయాయి. ధరణి పోర్టల్ ను తీసివేసి భూమాతను తీసుకొస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వంలో.. ఈరోజు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తూ బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూ అక్రమాలు మరింత పెరిగిపోయాయి.
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని భూ అక్రమార్కుల ఆగడాలకు, వేధింపులకు గురైన బాధితులు.. మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితులకు ఎలాంటి భరోసా కల్పించలేదు, రక్షణ కల్పించలేదు. బాధితుల పక్షాన ఘటనా స్థలికి ఈటల రాజేందర్ వెళ్లారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సమయంలో కబ్జాదారుల తాబేదార్లు దురుసుగా ప్రవర్తించారు. దాంతో వారిని నిలువరించారు.
అదేవిధంగా రాష్ట్రంలో భూకబ్జాలకు వ్యతిరేకంగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. పేదల పక్షాన, భూకబ్జాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో కబ్జాలను అరికట్టి, చట్టాన్ని గౌరవించాలి. బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో అనేకమంది పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వం అండతో కబ్జాదారులు, కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు లోన్ తెచ్చుకుని, చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకుని, డాక్యుమెంట్లు ఉండి, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొనుగోలు చేసిన ప్రజల ఇండ్లను కూడా కూల్చివేసి మరీ.. భూకబ్జాదారులు ఆక్రమిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పేద ప్రజలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను కబ్జా చేయడాన్ని సహించం. ఆఖరుకు పోలీసు అధికారులకు సంబంధించిన 2 వేలకు పైగా ప్లాట్లను సైతం రికార్డుల్లో మార్చివేశారంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి భూమాయ జరుగుతుందో అర్థమవుతోంది.
భూ కబ్జాదారుల ఆగడాలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై బీజేపీ చేస్తున్న పోరాటం ఆగదు. ఇప్పటికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కబ్జాలను అరికట్టి, బాధితులకు రక్షణ కల్పించి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమావేశంలో బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.