– రాజ్యాంగం గురించి అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్ గాంధీ
– అంబేద్కర్ ని ఎన్నికల్లో ఓడించి, అనేక రకాలుగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ 2025 డైరీని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: భారతరత్న కర్పూరీ ఠాకూర్ గారు సోషలిస్టు నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం ఉద్యమించారు. శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానుభావుడు కర్పూరీ ఠాకూర్. ఓబీసీ వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా సముచిత స్థానం కోసం నిరంతరం పనిచేస్తూ, విశేషంగా సేవలందించారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కర్పూరీ ఠాకూర్ గారు చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన యావత్ సమాజం జననాయక్ గా పిలిచేలా గుర్తింపుతెచ్చుకున్నారు. విద్యార్థి దశ నుంచే క్విట్ ఇండియా ఉద్యమంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, 25 నెలల పాటు జైలు జీవితం గడిపిన స్వాతంత్ర్య సమరయోధుడు కర్పూరీ ఠాకూర్ గారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన సొంత గ్రామంలో స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే బడుగు, బలహీన వర్గాలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని వారి అభ్యున్నతి కోసం పనిచేశారు.
దేశానికి అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కర్పూరీ ఠాకూర్ ప్రథముడు. మాతృ భాషను పరిరక్షించుకునేలా హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారు. 1952లో బిహార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజా సోషలిస్టు పార్టీ, జాయింట్ సోషలిస్టు పార్టీల్లో విశేషంగా పనిచేసిన మహనీయుడు. 1962లో ఇందిరా గాంధీ హయాంలో అనేక ప్రజాఉద్యమాలు చేశారు. 1970, 1977లో రెండుసార్లు బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
గత సంవత్సరం కర్పూరీ ఠాకూర్ గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నాం. నాడు ఇందిరాగాంధీ గారి నియంతృత్వ పాలనకు, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా జనసంఘ్ సోషల్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్ నారాయణ్ గారి నేతృత్వంలో కలిసి గళమెత్తాయి. నాడు జైలులోనే వివిధ పార్టీలన్నీ చర్చలు జరిపి జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబంగా వ్యవహరించేవారు. భారతరత్న వంటి అవార్డులు ఆ పార్టీవారికే ఇచ్చుకున్నారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఆచార్య కృపలానీ గారు, అటల్ బిహారీ వాజ్ పేయి గారు, జార్జ్ ఫెర్నాండెజ్ గారు, లాల్ కృష్ణ అధ్వానీ గారు లాంటి అనేక మంది నాయకులను జైలులో పెట్టారు. నాడు దేశంలో ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా జనతా పార్టీ ద్వారా ఒక నిశ్శబ్ధ విప్లవం వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీ ఇందిరాగాంధీ గారిని ఓడించడం జరిగింది.
నాటి ఉద్యమాల్లో కర్పూరీ ఠాకూరీ గారి పాత్ర మరువలేనిది. కులాలు, మతాలకు అతీతంగా దేశ సేవ కోసం పనిచేశారు. గతంలో రాజకీయ పార్టీల కనుసైగల్లో పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి అవార్డులు వచ్చేవి. నేడు నిస్వార్థంగా దేశం కోసం, సామాజిక పరివర్తన, చైతన్యం కోసం పనిచేస్తున్న మహానుభావులకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చి గౌరవించుకుంటున్నాం.
ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్పూరీ ఠాకూర్ గారి శతజయంతి సందర్భంగా.. వారి సేవలను స్మరించుకుంటూ భారతరత్న ఇచ్చి గౌరవించి, నివాళులర్పించారు. 1970 లో మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొచ్చారు. అదేవిధంగా బిహార్ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా కర్పూరీ ఠాకూర్ గారు పరిపాలన అందించారు. 1970లోనే మొట్టమొదటిసారి బిహార్ రాష్ట్రంలో మధ్యపాన నిషేధం తీసుకొచ్చారు.
దేశంలో నెహ్రూ కుటుంబం తప్ప మరెవ్వరూ పరిపాలన చేయలేరు. మరెవరికీ ఆ హక్కు లేదని కాంగ్రెస్ భావించేది. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించి, అనేక రకాలుగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసింది. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రభుత్వాలను కూల్చివేసి, పత్రికా స్వేచ్ఛను హరించివేసింది. రాజ్యాంగం గురించి అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కులేదు.
రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి రాహుల్ గాంధీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. దేశంలోని 140 కోట్లమంది ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వానికి సర్టిఫికెట్ ఇచ్చారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉందని, రాజ్యాంగం రద్దవుతుందంటూ విమర్శలు చేస్తున్నది. సూర్యచంద్రులు ఉన్నంతవరకు రాజ్యాంగం రద్దు కాదని స్పష్టం చేస్తున్నాం.
దేశానికి మొదటి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటువేసి మద్దతు తెలిపినప్పటికీ ఆయనను పక్కనబెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని మదర్ ఆఫ్ డెమొక్రసీ అంటూ ప్రపంచానికి చాటిచెప్పారు. కాంగ్రెస్ తర్వాత దేశంలో అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరేంద్ర మోదీ . కర్పూరీ ఠాకూర్, బాబా సాహెబ్ అంబేద్కర్, అటల్ బిహారీ వాజ్ పేయి, జయప్రకాష్ నారాయణ్, మహాత్మాగాంధీ స్ఫూర్తితో, కుమ్రం భీం, రాంజీ గోండు, అల్లూరీ సీతారామరాజు స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది.
అంతకుముందు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న కర్పూరీ ఠాకూర్ గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.