– టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్
వైసీపీ పాలనలో హిందువుల ప్రతిష్ట దిగజార్చుతున్నారు. ఒకవైపు దేవాలయాలు ధ్వంసం చేస్తూ మరోవైపు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. శ్రీశైలం ప్రసాదంలో ఎముక పడిన ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకు చర్యలు లేవు. గతంలో టీటీడీలో ఎన్నో అపరాధాలు జరిగాయి.
ఇప్పుడు శ్రీశైలం ప్రసాదంలో ఎముక పడింది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా దేవాదాయశాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రముఖ దేవాలయాల్లో అణ్యమత ప్రచారం జరుగుతున్నా చర్యలు తీసుకోకుండా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. సలహాదారులకు క్రమం తప్పకుండా జీతాల రూపంలో వందల కోట్లు దోచిపెడుతున్న ప్రభుత్వం.. దేవాలయాల నిర్వహణకు, అర్చకుల వేతనాలకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయాల ప్రతిష్ట దిగజార్చేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
పాలనా వ్యవహారాల్లో వైసీపీ నేతల జోక్యం వలనే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీలో టికెట్లు, టెండర్లలో జరిగిన అక్రమాల వెనక వైసీపీ నేతల ప్రమేయం లేదా? విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో మూడు సింహాలు పోయి మూడేళ్లయినా నిందితులను పట్టుకోకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా? మహా కుంభాభిషేకాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేయలేదా?
అన్యమతస్థుడిని టీటీడీ ఛైర్మన్ గా పెట్టి భక్తుల మనోభావాలు దెబ్బతీయలేదా? విజయవాడ అమ్మవారి చీరలు మాయం వెనక వైసీపీ నేతల ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకోకపోవడం నిజం కాదా? దేవాలయాల నిధులను స్వప్రయోజనాలకు వాడుకుంటుంది వైసీపీ నేతలు కాదా? హిందువులు అంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకు అంత చిన్నచూపు. శ్రీశైలం ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.