Suryaa.co.in

Andhra Pradesh

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన

-మోడీ వస్తాడు.. చెబుతాడు.. చప్పట్లు కొడతారు.. వెళతారు..
-దేశ ప్రజలంతా రాహుల్ రాక కోసం ఎదురు చూస్తున్నారు
-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎపీకి ప్రత్యేక హోదా
-ఏపీ విషయంలో బిజెపి, వైసిపి కలిసే డ్రామాలు ఆడుతున్నాయి
-జగన్ చేస్తున్న అకృత్యాలు బిజెపి కి తెలియవా… మరి ఎలా ప్రోత్సహిస్తున్నారు?
-బీజేపీ, వైసీపీల కపట నాటకాలు ఎంతకాలం.. సాగనంపేందుకు ప్రజలు సిద్దం
-ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్

విజయవాడ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం గా సాగిందని, సహకరించిన, పాల్గొన్న ప్రజలందరికీ ఎపిసిసి పక్షాన ఎపీసీసీ అధ్యక్షులు డా.సాకే శైలజనాథ్ ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందని, రాహుల్ గాంధీ ని కలిసిన ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు చెప్పుకున్నారని వివరించారు. ఎపీకి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు, స్టీల్ ఫ్లాంట్‌ విషయం లో స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బిజెపి రూపంలో ముప్పు వాటిల్లుతుందని, ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఉపాధి అవకాశాలు లేవన్న శైలజనాధ్… అంబానీ, అదానీలు మాత్రమే ఆదాయం పెంచుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారని, ప్రజలు అందరూ రాహుల్ గాంధీ ని‌ బలపరచేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేసారు. కొన్ని చోట్ల పోలీసులు యాత్ర పట్ల దారుణంగా వ్యవహరించారని, చట్ట బద్దంగా విధులు నిర్వర్తించక పోతే పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మోడీ ఎపికి వచ్చే లోపు స్పష్టమైన వాగ్దానాలతో రావాలని, లేకుంటే సభలను బాయ్ కాట్ చేయాలని వైసీపీకి శైలజనాథ్ సవాల్ విసిరారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని‌ చెప్పాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని హామీ తెచ్చుకోవాలని, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, ఏకైక రాజధాని అమరావతి అని చెప్పించాలని జగన్ రెడ్డికి సూచించారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఈ హామీలను అమలు చేస్తారని, మాట ఇస్తే జగన్ లాగా మడమ తిప్పడం తమ అధినేతకు చేతకాదని ఎద్దేవా చేశారు. బిజెపి, వైసిపి నాయకులు డ్రామాలు ఆపి.. ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, బిజెపి, వైసిపి కలిసే డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. జగన్ చేస్తున్న అకృత్యాలు బిజెపి కి తెలిసే జరుగుతున్నాయని, నేటికీ బిజెపి ని అడుగుతూనే ఉన్నాం అని జగన్ అంటున్నారంటే అది ఇంకా ప్రజలు నమ్మాలా అని నిలదీశారు. మూడేళ్లుగా దారిలోనే ఉంటే… ఎపికి హామీల అమలు ఎప్పుడు చేరతాయో చెప్పాలని, రెండు పార్టీ లు కలిసి ఎంత కాలం మోసం చేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ వస్తాడు.. చెబుతాడు.. చప్పట్లు కొడతారు.. వెళతారు.. ఎప్పడూ ఇదే జరుగుతుందని, ఇప్పుడు అయినా ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అంతా కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజలు కూడా అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని కోరారు. ఈనెల ఎనిమిదిన ఎపిసిసి విస్తృత స్థాయి సమావేశం విజయవాడ లో జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఆరోజు ప్రకటిస్తామని సాకే శైలజనాథ్ వివరించారు.

LEAVE A RESPONSE