అశాస్త్రీయ భావజాలం సమాజ పురోగతికి ప్రతిబంధకం

భారత రాజ్యాంగం ఆర్టికల్ 51 ఏ హెచ్ ప్రకారం ప్రజలలో శాస్త్రీయ స్పృహ, శాస్త్రీయ తెంపరితనం, శాస్త్రీయ నిగ్రహాన్ని మరియు విచారణ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. విద్యార్థులలో శాస్త్రీయ స్పృహ నింపవలసిన విశ్వవిద్యాలయాలు అందుకు భిన్నంగా నేడు క్షుద్ర పూజలు, చండి యాగాలు, మహా మృత్యుంజయ యాగాల పేరుతో విశ్వవిద్యాలయ సిబ్బంది నుండి బలవంతంగా సర్క్యులర్ జారీ చేసి డబ్బు వసూలు చేయడం ప్రజలందరూ నిరసించాలి.

సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న మనం ఇంకా మూఢనమ్మకాలను ప్రోది చేస్తున్నామంటే ఎక్కడికి వెళుతున్నామో అర్థంకావడంలేదు. యూనివర్సిటీలల్లో మూఢచారాలు పాటించడం అజ్ఞానం, అవివివేకం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల, ఉద్యోగస్తుల ‘సంక్షేమం’ కోసం అంటూ విశ్వవిద్యాలయ ఉపకులపతి సూచనల మేరకు రిజిస్టర్ గారు “మహా మృత్యుంజయ హోమం” నిర్వహించాలని తలపెట్టడాన్ని సభ్యసమాజం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. విశ్వవిద్యాలయంలో కొద్దిమంది ఉద్యోగులు అకాల మరణానికి గురైనారని చెప్పి దానికి గాను ఇలాంటి హోమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పడం, అందుకు చందాలు వసూలు చేయడం అవివేకం.

సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి శాస్త్రీయ పరిష్కారాలను తెలియజేయవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాల మీద ఉంటుంది. అలాంటి విశ్వవిద్యాలయాల్లో అంధకార భావాలను, మూఢత్వాన్ని ప్రతిబింబించే మత విశ్వాసాలతో కూడుకున్న కార్యక్రమాలు చేయడం విద్యా వ్యవస్థ యొక్క ప్రజాస్వామ్య, లౌకిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకమైనది. విద్య అనేది శాస్త్రీయ, లౌకిక , ప్రజాతంత్ర విలువలతో ఉండాలి. సమస్యలను శాస్త్రీయ దృక్కోణంలో చూచి పరిష్కారాలను కనుగొనాల్సి ఉంది.

అంతేతప్ప మతాలకు సంబంధించిన అజ్ఞానాన్ని, అంధకారాన్ని వ్యాప్తి చేసే విధంగా కార్యక్రమాలు విశ్వవిద్యాలయాలలో నిర్వహించడం పూర్తిగా సమాజాభివృద్ధి క్రమానికి వ్యతిరేకమైనది. కావున తక్షణం విశ్వవిద్యాలయ అధికారులు ఈ హోమాన్ని నిర్వహించే యోచనను విరమించాలని కోరుతున్నాము. బీజేపీ పార్టీ కేంద్ర అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి, వివిధ విశ్వ విద్యాలయాలలో ఈ విధమైన మూఢ నమ్మకాలు, మత కార్యక్రమాలను నిర్వహించడం పెరిగిపోయింది. విశ్వవిద్యాలయాల అధికారులు కూడా అధికార పార్టీల నాయకుల మెప్పు పొందడానికి, వారి అడుగులకు మడుగులొత్తుతూ, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని నాశనం చేయడం విచారకరం.

విశ్వవిద్యాలయాలు ఇలాంటి తప్పుడు విధానాలను మానుకొని శాస్త్రీయ ,లౌకిక , ప్రజాతంత్ర విలువలతో కూడిన విద్యా విధానాన్ని, పద్దతులను అనుసరించే బాధ్యతను నిర్వర్తించాలని ప్రజాసైన్స్ వేదిక డిమాండ్ చేస్తున్నది. శాస్త్రీయ ఆలోచనలతో సమాజ నిర్మాణం జరుగుతుంది. ఉత్తమ పౌర సమాజాన్ని నిర్మించడానికి శాస్త్రీయ ఆలోచనలు కలిగిన డాక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వారు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా యం. సురేష్ బాబు. భావిభారత పౌరులను తీర్చిదిద్దాలని ప్రస్తుతం సమాజంలో మతతత్వ శక్తులు రాజకీయ పార్టీలు వర్గవైషమ్యాలు పెంపొందించే విధంగా దేశంలో రాష్ట్రంలో వ్యవహరిస్తున్నాయన్నారు.

విద్యాసంస్థల్లో విద్యార్థులను మంచి పౌరులుగా, శాస్త్రీయ ఆలోచనలే కలిగి, సామాజిక బాధ్యత, స్పృహ కలిగిన రీతిలో నిర్మాణం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అభ్యుదయ సంఘాలు నిరంతరం ఎదో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇటీవల శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన వాటికి విరుగుడుగా మృత్యుంజయ హోమాలు, క్రతువులు చేయడం శుద్ధ అవివేక చర్య. సర్కులర్ జారీ చేసిన రిజిస్ట్రార్ ను తక్షణం విధుల నుండి తొలగించాలి ఉపకులపతి, రిజిస్ట్రార్ పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలి.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply