Suryaa.co.in

National

యూపీలో అమూల్‌ చిచ్చు

– మోడీని నిలదీస్తాం..భూపరిహారం ఇవ్వకుండా శంకుస్థాపనలా..!
– యూపీ రైతుల ఆగ్రహం
– పైసల్లేక బిడ్డల పెండ్లిండ్లు కావట్లే: అన్నదాతల కుటుంబాలు

ఎక్కడికైనా దేశప్రధాని వస్తుంటే.. ఆనందపడతారు. కానీ, యూపీలోని ఓ చోట మాత్రం రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూపరిహారం ఇవ్వకుండా అమూల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేస్తారా..!? అంటూ నిలదీస్తున్నారు. ఓవైపు స్టేట్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఐడీఏ) రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చిందని అంటుంటే.. భూపరిహారం కింద పైసలు రాక తమ కూతుర్లకు పెండ్లిండ్లు చేయలేని దుస్థితిలో ఉన్నామని రైతు కుటుంబాలు వాపోతున్నాయి.

పచ్చని పంట పొలాలన్నీ పరిశ్రమలకు, ప్రాజెక్టుల కింద ప్రభుత్వాలు బలవంతంగా గుంజుకుంటు న్నాయి. అయితే, తీసుకున్న ఆ భూములకు మాత్రం పరిహారం ఇవ్వకపోవటం గమనార్హం. అది కూడా 23న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుకే ఇలాంటి పరిస్థితి ఎదురవటంపై రైతు సంఘాలు నిలదీస్తున్నాయి. మరోవైపు ఆగ్రో పార్క్‌ భూములకు పరిహారం కోసం మహిళలు ధర్నాకు దిగటంతో అటు అధికారులు, ఇటు పోలీసులు రంగంలోకి దిగి సద్దుమణిగేలా చేయటానికి నానా యత్నాలు చేస్తున్నారు.
అమూల్‌ డెయిరీ ప్లాంట్‌ భూముల కోసమే..

బనారస్‌లోని కరియాన్వ్‌లో అమూల్‌ డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ రానున్నారు. అయితే అమూల్‌ ప్లాంట్‌ కోసం భూమి సేకరణ జరిగిన చాలా మంది రైతులకు ఇంకా పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చామని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సీఐడీఏ) పేర్కొంటున్న వేళ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. భూపరిహారం అందకపోవడంతో పలువురు రైతుల కుమార్తెలకు పెండ్లిండ్లు చేయటానికి పైసల్లేక నానా అవస్థలు పడుతున్నారు.

ఎక్కడంటే..
బనారస్‌ నుంచి 30 కి.మీ.ల దూరంలో జౌన్‌పూర్‌ సరిహద్దులో ఉన్న ఆగ్రో పార్క్‌లో అమూల్‌ డైరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2000లో ఈ ప్లాట్‌ కోసం భూమిని సేకరించారు. అయితే తర్వాత పరిహారం విషయంలో చిక్కుముడి పడింది. అమూల్‌ ప్లాంట్‌, ఇతర సంస్థల కోసం ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూమిని సేకరించిన రైతులలో కరియాన్వ్‌, బిందా, ట్రంపెట్‌, భుస్‌ లీ, కేహర్‌, ఫుల్‌పురి, థారి, కుసాన్‌ , డీఘీ ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఉన్నారు. భూమికి పరిహారం చాలా తక్కువగా ఉండడంతో వంద మందికి పైగా రైతులు జిల్లా, సెషన్స్‌ కోర్టులో ల్యాండ్‌ రెఫరెన్స్‌ (ఎల్‌ఏఆర్‌) దాఖలు చేశారు. రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, పెరిగిన ధరల ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీఏను కోర్టు ఆదేశించింది. ఇందుకు అథారిటీ సిద్ధంగా లేకపోవడంతో వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది.

అలహాబాద్‌ హైకోర్టు రైతులకనుకూలంగా 2018 ఏప్రిల్‌ 16న తీర్పు వెలువరిస్తూ ఒక్కో డిస్మిల్‌కు రూ.5100, రూ.4760 చొప్పున రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ రైతుల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలుమార్లు అధికారులు, రైతుల మధ్య తోపులాటలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పరిహారం ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. నష్టపరిహారం సొమ్ము తమ ఖాతాల్లో పడేదాకా భూమిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.మరోవైపు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లోశక్తి) జిల్లా అధ్యక్షుడు ధనంజరు సింగ్‌తో సహా పలువురు రైతులను గూండా చట్టం కింద అరెస్టు చేశారు. అయినా రైతుల వెనక్కి తగ్గలేదు.

కాగా, రైతులకు ఎక్కువ నష్టపరిహారం చెల్లించనందుకు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సిడా) సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో నష్టపరిహారంపై రైతులు పోరాటం చేయలేరనీ, వారి ఉద్యమం విఫలమవటం ఖాయమని సిడా అధికారులు భావించారు. అయినా రైతులు పట్టు వీడలేదు. చివరకు విజయం సాధించారు. 4 ఆగస్టు 2021న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, పెరిగిన ధరల ప్రకారం రైతులకు పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ధనంజరు సింగ్‌ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా సాగిన పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే వారణాసి జిల్లా యంత్రాంగంకు హద్దుల్లేకుండా పోయింది. భూపరిహారం సొమ్ము ఖాతాలోకి రాకముందే బనారస్‌ కలెక్టర్‌ కౌశల్‌రాజ్‌ శర్మ భారీగా పోలీసులు మోహరించారు. బలవంతంగా కారియాన్వ్‌ చేరుకున్నారు. మా సమక్షంలోనే రైతుల పొలాల్లో వేసిన వరిపంట మొత్తాన్ని జేసీబీతో తొక్కి మా భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారు.

పంట నష్టపరిహారం చెల్లించకుండా దున్నడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఇద్దరు సహచరులైన నిహాలా పాల్‌ , సంజరు రాజ్‌భర్‌లను అరెస్టు చేశారు. ఈ సంఘటన 21 ఆగస్టు 2021 న జరిగిందని రైతు నేతలు తెలిపారు.గత మూడు నెలలుగా కారియాన్వ్‌లోని ఆగ్రో పార్క్‌లో పోలీసుల పర్యవేక్షణలో రైతుల భూముల హద్దులు నిర్వహిస్తున్నారు. అమూల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే స్థలంలో జాన్‌ పూర్‌ నుంచి మట్టిని తీసుకొచ్చి భూమిని నింపుతున్నారు. 16 డిసెంబర్‌ 2021 వరకు ఆగ్రో పార్ట్‌లో పీఏసీ సిబ్బ ందిని నియమించారు. డిసెంబర్‌ 14 రాత్రి.. ఆవాలపంట ఉన్న భూముల్లో అధికారులు దున్నటంతో..రైతులు రగిలిపోయారు. ప్రధాని మోడీకి శంకుస్థాపన చేయాల్సిన భూమిలోనిదే కావటంతో.. వరి, ఆవాల పంటను తొక్కిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎన్నో ఆటుపోట్లు..
అమూల్‌ డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న భూమిలో నష్టపోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం కోసం చాలా కాలం నుంచి పోరాడుతున్నామని రైతు నాయకులు తెలిపారు. ఎలాంటి కారణమూ లేకుండా రైతు నాయకుడు ధనుంజరును అరెస్టు చేశాక.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఫుల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఘెరావ్‌ చేశారు. అతన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పూల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నినాదాలు చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో రాజారాం అనే రైతు పాదాల ఎముకలు విరిగిపోయాయి. రామానంద్‌, లల్తా పాల్‌ , పలువురు మహిళలను పోలీసులు తీవ్రంగా కొట్టారు. అరడజను మంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. చివరికి వైద్య పరీక్షలకు కూడా పోలీసులు అనుమతించడం లేదని రైతులు ఆరోపించారు.

రైతులకు న్యాయం జరగలేదు
ఇక్కడి కలెక్టర్‌ కౌశల్‌రాజ్‌ శర్మ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా భూసేకరణ విభాగం అధికారులు పరిహారం పంపిణీలో తూట్లు పొడుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పరిహారం చెల్లించకపోవడంతో ధనంజరు సింగ్‌ కుమార్తె జాగృతి సింగ్‌ వివాహం ఆగిపోనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అంతే కాకుండా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అతని సోదరుడు భిఖి యాదవ్‌ కుమార్తెల పెళ్లి కూడా జరగలేదు. నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న పలువురు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. గత దశాబ్ద కాలంగా పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు.

ధనుంజయ సింగ్‌,పోలీసు అధికారుల మధ్య ఆగని వివాదం

స్వాతంత్య్ర పోరాటంలో 26 మంది రణబాకురే అమరులైన భూమిపై భూపరిహారం కోసం పోరాటం జరుగుతున్న చోటే కారియాన్వ్‌ గ్రామం. రైతు నాయకుడు ధనంజరుసింగ్‌ మాట్లాడుతూ.. ‘మా తాత దివంగత వంశరాజ్‌ సింగ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం అణచివేసింది. ఆ తర్వాత దేశాన్ని విముక్తి చేయడంలో ఆయన వీరమరణం పొందాడు. మొదట మా కున్వా దేశాన్ని, ఇప్పుడు రైతులను విముక్తి చేయా లని పోరాడుతూనే ఉన్నా. న్యాయం కోసం పోరాటంలో మాకున్న ఆస్తి కరిగిపోయింది. రెండు సార్లు జైలుకెళ్లా. మాపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా, గూండా చట్టం కింద అరెస్టు చేశారు.

మా గోస ప్రధానికి తెలియజేయాలనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. నకిలీ కేసుల విషయంలో పోలీసులపై చర్య తీసుకోవటంతోపాటు, పరిహారం ఇవ్వాలనీ ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ఉన్నతాధికారులందరికీ ట్విట్టర్‌ ద్వారా ధనంజరు సింగ్‌ లిఖితపూర్వక ఫిర్యాదు పంపారు. అయినా ఇంతవరకూ ఎలాంటి సమాధానమూ రాలేదని ధనంజరు తెలిపారు.ప్రధాని మోడీ శిలాఫలక సన్నాహాల్లో నిమగమైన పరిపాలనా అధికారులకు రైతుల సమస్యలు వినడానికి సమయం లేదు. నష్టపరిహారం విషయమై మీడియా అక్కడి జిల్లా భూసేకరణ అధికారి మీనాక్షి పాండేతో మాట్లాడినప్పుడు.. ”ఇటీవల నేను ఈ పదవిలో బాధ్యతలు స్వీకరించాను. కచ్చితమైన పరిస్థితిని తెలుసుకున్న తర్వాత.. సమాధానం చెప్పగలను” అని తెలిపారు.

కోఆపరేటివ్‌ పాల సొసైటీ ఉన్నా
ఉత్తరప్రదేశ్‌లోని సహకార సంఘం పాలను ఉత్పత్తి చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంతంలోని అమూల్‌ నుంచి పరాగ్‌ గట్టి పోటీని ఎదుర్కోవడమే కాకుండా, బీహార్‌లో ‘సుధ’ బ్రాండ్‌ పేరుతో పాలను విక్రయించే పాల సహకార సంఘం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ డెయిరీ సంస్థ అయిన పరాగ్‌ను అధిగమించింది. దీన్ని నెమ్మదిగా ప్రయివేటుపరం చేసేదిశగా.. గుజరాత్‌లోని అమూల్‌ను ఇక్కడ నెలకొల్పబోతుండటంతో పాల సొసైటీలు ఆక్షేపిస్తున్నాయి. ప్రధాని తలుచుకుంటే ఏమైనా చేయగలరనీ, అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో భూపరిహారం కోసం పోరాడుతున్న రైతులు, ప్రయివేట్‌ చేతుల్లోకి వెళ్లే పాల సొసైటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

అమూల్‌ ప్లాంట్‌ సామర్థ్యం 5 లక్షల లీటర్లు
ఐదు లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసే అమూల్‌ డెయిరీ ప్లాంట్‌కు డిసెంబర్‌ 23న కార్కియాన్‌ ఆగ్రో పార్క్‌లో శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ ప్రాజెక్టు 15 నుంచి 18 నెలల్లో సిద్ధం కాబోతోంది. అమూల్‌ పశువైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌వి పటేల్‌ మాట్లాడుతూ.. దాదాపు 32 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అమూల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో పూర్వాంచల్‌కు చెందిన ఐదు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందనీ.. అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ ప్లాంట్‌తో బనారస్‌లో యువతకు ఉపాధి కల్పించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అమూల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్నారు. కంపెనీ పాల ఉత్పత్తిదారులకు తన డివిడెండ్‌లో కొంత భాగాన్ని కూడా చివరిలో బోనస్‌గా చెల్లించనున్నట్టు ఆయన వివరించారు.

రాత్రి వేళ మోడీ సభా వేదికపై ధగధగలు
శంకుస్థాపన పనులు రాత్రివేళ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు అమూల్‌ ప్లాంట్‌తోపాటు ఆగ్రో పార్క్‌ కోసం భూములు సేకరించిన రైతుల్లో కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం అందింది. కలెక్టరు ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా భూసేకరణ విభాగం (ఎస్‌ఎల్‌ఓ)లో విపరీతమైన అవినీతి జరుగుతోంది. దీని కారణంగా రైతులందరి ఖాతాలకు పరిహారం ఇంకా చేరలేదని కారియాన్వ్‌ గ్రామ రైతుల న్యాయవాది విజరు కుమార్‌ సింగ్‌ చెప్పారు. ఆగ్రో పార్క్‌కు అనుకూలంగా నిర్ణయం, 250 డిస్మిల్స్‌లోపు భూమి ఉన్న రైతులకు ఒక్కో డిస్మిల్‌కు రూ.5100 చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశం ఉంది. అంతే కాదు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించినా..ఒక్క అడుగూ ముందుకేయలేదు.

అంతేకాదు 90 మంది రైతులకు పరిహారంగా కోర్టుకు పంపాలని ఎస్‌ఎల్‌ఓ కార్యాలయం ధ్రువీకరించింది. కానీ సగం మొత్తం మాత్రమే రైతుల ఖాతాలకు చేరింది. ఇంద్ర బహదూర్‌, దొరగా, పంచు, దున్వేంద్ర రారు, వీరేంద్ర ప్రతాప్‌ సహా కాదు. నష్టపరిహారం కోసం కలెక్టరేట్‌ గేట్లపై రోజూ ఎంతోమంది రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నా.. నష్టపరిహారం చెల్లించే విషయంలో మాత్రం కానీ..కనీసం రైతుల మాట వినేందుకు కానీ అధికారులెవరూ సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

LEAVE A RESPONSE