Suryaa.co.in

National

పాస్‌వర్డ్ తగ్గించి.. పాస్ కీ లను వాడండి

– పాస్‌వర్డ్‌ను మార్చుకోండి
– సైబర్ నేరగాళ్లకు చిక్కకండి
– జీ మెయిల్ యూజర్లకు గూగుల్ సలహా

మీరు జీ మెయిల్ వాడుతున్నారా? అయితే అర్జెంటుగా మీ పాస్‌వర్డ్ మార్చుకోండి. అసలు పాస్‌వర్డ్‌పై ఎక్కువ ఆధారపడకండి. వీలున్నంతవరకూ పాస్ కీలను వాడుకోండి. లేకపోతే సైబర్ నేరగాళ్లకు చిక్కడం ఖాయమని గూగుల్ హెచ్చరించింది.

ఇటీవలి కాలంలో పెరిగిన సైబర్ నేరాల దృష్ట్యా, వస్తున్న ఫిర్యాదులను పరిశీలించిన గూగుల్.. జీ మెయిల్ యూజర్లకు ఈ సలహా ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పాస్‌వర్డ్ మార్చేసుకోండి.

ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పాస్‌వర్డ్‌లు, ఎస్ఎంఎస్ ఆధారిత రెండంచెల భద్రతా వ్యవస్థ సురక్షితం కాదని గూగుల్ అభిప్రాయపడింది. వీటిని సైబర్ నేరగాళ్లు సులభంగా ఛేదించే అవకాశాలు పెరిగాయని హెచ్చరించింది. అందుకే, పాస్‌వర్డ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించి, మరింత సురక్షితమైన ‘పాస్‌కీ’ వ్యవస్థను వినియోగించుకోవాలని పేర్కొంది.

ఈ సైబర్ దాడిని గుర్తించిన వెంటనే గూగుల్ అవసరమైన సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ.. వినియోగదారులు వ్యక్తిగత స్థాయిలో అప్రమత్తంగా ఉండటం, సూచించిన భద్రతా ప్రమాణాలను పాటించడం చాలా అవసరమని పేర్కొంది.

పాస్‌కీ అనేది వినియోగదారుడి నిర్దిష్ట ఫోన్, కంప్యూటర్ పరికరంలో ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా పిన్ ద్వారా లాగిన్ అవ్వడానికి అనుమతించే ఒక సురక్షితమైన పద్ధతి. ఇది ఫిషింగ్ దాడుల నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుందని గూగుల్ వివరించింది. ఇటీవల ఒక డెవలపర్ ఇలాంటి నకిలీ ‘లీగల్ నోటీసు’ మెయిల్‌ను అందుకున్నారని, అది గూగుల్ నుంచే వచ్చిందని భ్రమపడ్డారని ఉదహరించింది.

వినియోగదారులను మోసగించేందుకు అత్యంత నమ్మశక్యంగా ఉండే నకిలీ ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్‌ను ఉపయోగిస్తున్నారని, ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాస్‌వర్డ్‌లకు బదులుగా పాస్‌కీలను వినియోగించాలని సిఫార్సు చేసింది.

కృత్రిమ మేధ సహాయంతో, అచ్చం గూగుల్ నుంచే వచ్చినట్లు కనిపించే ఈ-మెయిల్స్, కొన్నిసార్లు ఫోన్ కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. ఈ నకిలీ మెయిల్స్‌లో డీకేఐఎం సిగ్నేచర్ కూడా ఉండటంతో, అవి అధికారిక సందేశాలని వినియోగదారులు సులభంగా నమ్మే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మీ ఖాతా రక్షణ కోసం ఇలా చేయండి
– తక్షణ చర్యగా, మీ జీమెయిల్ పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం మంచిది.
– మీ ఖాతాకు రికవరీ ఫోన్ నంబర్, రికవరీ ఈ-మెయిల్ తప్పనిసరిగా జోడించండి. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోండి.
– అనుమానాస్పదంగా కనిపించే లేదా మీరు ఊహించని లింకులతో వచ్చే ఈ-మెయిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.
– వీలైనంత త్వరగా మీ జీమెయిల్ ఖాతాకు పాస్‌కీని సెటప్ చేసుకోండి.
– ఎస్ఎంఎస్ ఆధారిత వెరిఫికేషన్‌కు బదులుగా, ‘గూగుల్ ప్రాంప్ట్’ (మీ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్ ద్వారా లాగిన్‌ను ఆమోదించడం) ఉపయోగించడం సురక్షితం.

LEAVE A RESPONSE