Suryaa.co.in

International

మీ కోసమే కదా ఈ డర్టీ వర్క్!

– అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల నాటకం బయటపెట్టిన పాక్ రక్షణమంత్రి
– మీ కోసమే ఉగ్రవాదులకు మద్దతునిచ్చామన్న పాక్ మంత్రి ఖ్వాజా
– తర్వాత పొరపాటయిందంటూ దిద్దుబాటు యత్నం

ఇన్నాళ్లూ అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల కోసం తాము చేస్తున్న ఉగ్రసాయాన్ని పాక్ బయటపెట్టింది. ‘‘మీకోసమే కదా ఈ డర్టీవర్క్ చేసింది’’ అంటూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు.. అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్‌ను అడ్డంగా ఇరికించాయి. ఇన్నాళ్లూ ఆ రెండు దేశాలు పాక్ ఉగ్రవాదులను, తమ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తున్న నిజాలు వెల్లడించి అగ్రరాజ్యాలను ఆత్మరక్షణలో నెట్టేశారు. ఆ వెంటనే ఆయన తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఏదో పొరపాటున ఈ మాటలు వచ్చాయని చెప్పారు.

ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా.. అమెరికా, పశ్చిమ దేశాల కోసం తాము డర్టీ వర్క్ చేశామంటూ బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

అమెరికా, పశ్చిమ దేశాలు, బ్రిటన్ కోసం పాకిస్థాన్ గత మూడు దశాబ్దాలుగా ఈ డర్టీ వర్క్ చేస్తూ వస్తోందని ఆసిఫ్ అన్నారు. ఇది తాము చేసిన పెద్ద తప్పిదం అని, దానివల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయిందని అభిప్రాయపడ్డారు.
సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం , 9/11 దాడుల తర్వాత అమెరికా నేతృత్వంలోని తాలిబన్ వ్యతిరేక యుద్ధంలో.. పశ్చిమ దేశాలతో చేరకుండా ఉండి ఉంటే పాకిస్థాన్ చరిత్ర ఎంతో గొప్పగా ఉండేదని చెప్పారు.

LEAVE A RESPONSE