డీజీపీ సవాంగ్‌కు వర్ల రామయ్య లేఖ
ఏపీలో పెరిగిపోతున్న గ్రడ్స్ రవాణాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
అమరావతి
19-10-21.
మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి దివ్య సముఖమునకు,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నమస్కరించి వ్రాయు బహిరంగ లేఖ.
ఆర్యా,
విషయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా కార్యకలాపాలు – యువత నిర్వీర్యం – రాష్ట్ర ప్రజల ఆందోళన – తక్షణ చర్యలు చేపట్టుట గురించి.
**
మన రాష్ట్రంలో గత కొంతకాలంగా మాదక ద్రవ్యాల సరఫరా, ఆ మాఫియా రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న విధానం, తల్లిదండ్రులంతా తమ బిడ్డలు (యువత) ఈ మాదక ద్రవ్యాల బారినపడి వారి జీవితాలు నాశనం చేసుకుంటారన్న భయాందోళనలు ప్రస్పుటంగా మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద స్వరంతో ఈ డ్రగ్ మాఫియా ఆగడాలపై ఘోషించడం మనం చూస్తూ ఉన్నాం. పెద్దఎత్తున హెరాయిన్ రవాణాకు ముఖ్య కారకుడు విజయవాడ వాసి అన్నట్లుగా పత్రికల్లో ప్రస్పుటంగా ప్రచురించబడింది. జాతీయ, అంతర్జాతీయంగా కూడా విజయవాడ నగరం హెరాయిన్ (డ్రగ్ మాఫియా) సరఫరా లిస్టులో చేరింది. ఇది చాలా భయంకరమైన, భయానకమైన వార్త. రాష్ట్రం యావత్తు ప్రభుత్వం, ప్రజలు కూడా దీనిపై స్పందించాల్సిన అత్యవసర అవసరమున్న సంఘటన ఇది.
కారణాలేమైనా మన రాష్ట్రప్రభుత్వం ఆశించిన రీతిలో, ప్రజలు కోరుతున్న రీతిలో స్పందింలేదన్నది నగ్నసత్యం. ఈ సందర్భంలో, రాష్ట్రంలో డ్రగ్ మాఫియా క్రీనీడలు బహిరంగంగా బహిర్గతమైనపుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన బాధ్యత మా భుజస్కంధాలపై ఉందని గ్రహించే అవగాహన మాకున్నది. ఈ మాదకద్రవ్యాల నేపథ్యం, వాటి కట్టడిపై రాష్ట్రప్రభుత్వ నిర్లిప్త వైఖరి గమనించిన తెలుగుదేశం పార్టీ కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీ ద్వారా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రశ్నలు సమాధానాల కోసం మీ ముందు బహిరంగంగా ఉంచుతూ ఉన్నా. దయచేసి మా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రాష్ట్ర ప్రజల అనుమానాలు పటాపంచలు చేయమని రాష్ట్ర పోలీసుశాఖ అధినేతగా మిమ్ము కోరుతున్నాను.
బహిరంగ ప్రశ్నలు
1). హూ ఈజ్ డాన్ ఆఫ్ డ్రగ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ప్రతిపక్షాలుగా మేము గగ్గోలు పెడుతూ ఉంటే రాష్ట్ర పోలీసుశాఖ అధినేతగా మీరెందుకు స్పందించి దీనిపై సరైన సమాధానం ప్రజలముందు ఉంచలేదు?
2). గుజరాత్ ముంద్రా పోర్టులో దిగుమతి అయిన హెరాయిన్ దిగుమతి సూత్రధారి, ఆషీ ట్రేడింగ్ కంపెనీ అధినేత విజయవాడ వాసియేనా? ఆ కంపెనీ చిరునామా విజయవాడలో ఉందా? ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఎప్పుడు గమనించింది? దీనిపై ఏమి చర్యలు తీసుకుంది?
3). ముంద్రాపోర్టులో హెరాయిన్ స్వాధీన వార్త పత్రికల్లో వచ్చిన వెంటనే మీరెందుకు తగిన విచారణ జరపకుండా, విజయవాడకు, హెరాయిన్ కు సంబంధం లేదని తత్తరపడుతూ తొందరపాటుతో పత్రికా ప్రకటన చేశారు? దీనివెనుక మతలబేంటి?
4). ఆషీ ట్రేడింగ్ కంపెనీ రిజిస్ట్రేషన్, ఆ కంపెనీ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు, జిఎస్ టి చెల్లింపుల పత్రాలపై ఏదైనా విచారణ మీరు జరిపించారా? లేక గాలివాటుగా ఏమీ లేదని సమాధానమిచ్చారా?
5). ఆషీ ట్రేడింగ్ కంపెనీలోని ఆషీ అనే పేరు ఎవరిది? ఎందుకు వచ్చింది? ఎవరి పంపున ఈ పేరు యజమాని (బ్రాహ్మణ కులస్తుడు) ఎందుకు పెట్టుకున్నారో విచారణ జరిపారా?
6). ఆషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ కు గౌరవ కాకినాడ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలపై ఏదైనా విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీశారా?
7). కాకినాడ శాసనసభ్యుల శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి దక్షిణాఫ్రికా కోస్ట్ ఏరియాలోని ఐవరీ కోస్ట్ లో బియ్యం నిల్వలకు సంబంధించి గోడౌన్ లు కడుతున్నారట, నిజమా? ఆ గోడౌన్ లు దేనికొరకో ఈ డ్రగ్ మాఫియా నేపథ్యంలో విచారణ జరిపారా?
8). ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ ను హెరాయిన్ హబ్ గా పిలుస్తారట…మీ దృష్టికి వచ్చిందా? ఎమ్మెల్యే గారి అక్కడ గోడౌన్ల నిర్మాణానికి, హెరాయిన్ హబ్ గా పిలవడబడే ఐవరీ కోస్ట్ ప్రాంతానికి ఏదైనా సంబంధాలున్నాయోమో విచారణ జరిపించారా?
9). కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ముంద్రా పోర్టులో స్వాధీనపర్చుకోబడిన హెరాయిన్ గురించి దర్యాప్తు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA) దర్యాప్తు చేస్తున్న విషయం మీ దృష్టిలో ఉందా? వారు విజయవాడలో తనిఖీలు చేస్తూ కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలు, పేపర్లు స్వాధీన పర్చుకున్నట్లుగా ప్రెస్ నోట్ ఇచ్చారు, మీకు తెలుసా?
10). ఎన్ఐఎ దర్యాప్తులో విజయవాడలో ముఖ్యమైన సాక్ష్యాలు, పేపర్లు దొరికితే ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్ కు, విజయవాడకు సంబంధం లేదని మీరు ఏ సాక్ష్యాలతో చెప్పగలిగారు?
11). పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఆధారాలపై పత్రికల్లో ఈ డ్రగ్ మాఫియా ఆగడాలు కట్టడి చేయండని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారు, తదితర ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే, సాక్ష్యాలు చూపండని వారికి నోటీసులు ఇస్తారా? సాక్ష్యాలు సేకరించే బాధ్యత ఎవరిది డిజిపి గారూ? దర్యాప్తు చేయండని ప్రభుత్వాన్ని కోరితే తిరుగుటపాలో నోటీసులిస్తారా? ఇదెక్కడి పరిపాలనా విధానం డిజిపి గారూ?
12). రాష్ట్రంలో దాదాపు 15వేల ఎకరాల్లో ఉత్తరాంధ్రలో గంజాయి సాగు జరుగుతున్నదని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తుంటే, గంజాయి సాగు లేదని, అది నిజం కాదని, గంజాయి సాగు కట్టడి చేశామని చెప్పవలసిన మీరు…ఈ వార్త తెలియజేసిన వారికి నోటీసులిస్తారా? ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా డిజిపి గారూ? ఫలానా చోట నేరం జరిగింది, చూడండి అని మీకు చెబితే, సాక్ష్యాలు, తదితర వివరాలన్నీ మీకు సమాచారం అందించిన వాడు తెలియజేయాలా? ఇదెక్కడి చోద్యం డిజిపి గారూ?
13). భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదులుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన మీరు ప్రతిపక్షాల నోరునొక్కడానికి నోటీసులివ్వడం విడ్డూరం కదూ డిజిపి గారూ?
14). నిన్న (18-10-21) కూడా చెన్నయ్ లో గంజాయి పట్టుబడిందట, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందట, నిజమేనా డిజిపి గారూ? దీనిద్వారా మన రాష్ట్రంలో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతున్నట్లేనా డిజిపి గారూ?
15). నిన్నగాక మొన్న మన పక్క రాష్ట్రం తెలంగాణా నుంచి నల్గొండ పోలీసులు వచ్చి మన రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను పట్టుకుని, వారు దాడిచేస్తే కాల్పులు జరిపి, తుపాకీ తూటాలు పేల్చి వారిని నిర్భంధించి పక్క రాష్ట్రానికి తరలించుకుపోతే మన రాష్ట్రంలో ఇంకా గంజాయి సాగు లేదంటారా, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆగడాలు లేవంటారా?
16). నిన్న (18-10-21) మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో మా పార్టీ ప్రధాన కార్యాలయంలో మన రాష్ట్రంలో డ్రగ్ మాఫియాపై, నల్లొండ పోలీసుల కాల్పులపై మా నాయకుడు, మాజీ మంత్రి, ప్రముఖ దళిత నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు పాత్రికేయ సమావేశంలో మాట్లాడితే రాత్రి 11.30గంటలకు విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఆగమేఘాలపై పెద్దఎత్తున వచ్చి సాక్ష్యాలు చూపండని హడావిడి చేయడం ప్రతిపక్షాలను బెదిరించడంలో భాగమా డిజిపి గారూ? ఒక్క కానిస్టేబుల్ తో పంపే నోటీసును, అంతమంది పోలీసు అధికారులతో పంపించడం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్లు కాదా? బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం కాదా?
17). మీ ఈ పోకడ ఇలాగే ఉంటే ఏదైనా సమాచారం ఇచ్చేవారు మీ వేధింపులకు భయపడి సమాచారం ఇవ్వడమే మానేస్తారు, వాస్తవాలు తమలో తామే దాచుకుంటారు. మీరు కోరుకునే ఇదేనా డిజిపి గారూ? దర్యాప్తు చేసి నిజానిజాలు, వాస్తవాలు వెలికితీసే బాధ్యత పోలీసులది కాదా? అన్ని సాక్ష్యాలు ఫిర్యాదుదారులే మీ వద్దకు తీసుకురావాలా? ఇదెక్కడి చోద్యం డిజిపి గారూ?
18). పోలీసు బలంతో, అరాచక ప్రభుత్వ అండతో ప్రతిపక్షాల నోళ్లు నొక్కి రాష్ట్రంలో జరిగే ఏ అరాచక వ్యవహారాలపైనా, అవినీతిపైనా, అప్రజాస్వామిక విధానంపైనా, రాచరిక పోకడలపైన, తప్పుడు విధానాలపైన ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తాం, వారిపై ఎదురుదాడి చేస్తాం అనేదేనా మీ ముఖ్య లక్ష్యం డిజిపి గారూ?
దయచేసి నా ఈ ప్రశ్నలకు బహిరంగంగా సమాధానాలు ప్రజల ముందుంచాల్సిందిగా కోరుతున్నాం.
ఇట్లు తమ విధేయుడు,
Sd/-
వర్ల రామయ్య
తెలుగేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
పొలిట్ బ్యూరో సభ్యులు,
అమరావతి.