– వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
విజయవాడ ఘటన దారుణం
విజయవాడలో 14 ఏళ్ల బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒక ప్రజా ప్రతినిధిగా తీవ్రంగా కలచివేసింది. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ గత రెండు నెలలుగా ఆ బాలికను లైంగికంగా వేధించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక, చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం దారుణం, దురదృష్టకరం. బాలిక రాసిన సూసైడ్ నోట్‌ను చదువుతుంటే కన్నీళ్లు ఆగని పరిస్థితి. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వంలో కచ్చితంగా కఠినమైన శిక్షలు పడతాయని భావిస్తున్నాను.
ఇందులో భాగంగానే వినోద్ జైన్‌ను తక్షణమే అరెస్ట్ చేయడమే కాకుండా, అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు కూడా అయ్యాయి. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే తెలుగుదేశం నారీ మణులు ‘నారీ సంకల్ప దీక్ష’ పేరుతో దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షను చూసి ఆంధ్రరాష్ట్రంలో మహిళలు అంతా నవ్వుతున్నారు. ఆ దీక్షలో చంద్రబాబు నాయుడు మహిళలను తెగ ఉద్దరించాడని, జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి మహిళల మీద గౌరవం ఉందంటే ఎంత అబద్ధమో, చంద్రబాబు నాయుడుకు కూడా మహిళలపై గౌరవం ఉందంటే అంతే అబద్ధమని చెబుతున్నాం.
బాబు మాస్టర్ ప్లాన్‌లో భాగమే నారీ సంకల్ప దీక్ష
లోకేష్ పీఏ తన కార్యాలయంలో మహిళలను లైంగికంగా వేధించడటంతో … ఆమె బయటకు వచ్చి పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి తన బాధను వెళ్లగక్కింది. ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్‌లో భాగమే ఈ నారీ సంకల్ప దీక్ష. ఈ దీక్షకు చంద్రబాబు దర్శకత్వం వహిస్తే, లోకేష్ స్క్రీన్ ప్లే వహించారు. చంద్రబాబు హయాంలో టీడీపీ కార్యాలయం దుశ్శాసనులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆ పార్టీ నాయకులకు మహిళలు అంటే గౌరవం, అభిమానం అనేది లేదు. టీడీపీ వాళ్ళకు తెలిసిందల్లా మహిళలను మోసం, దగా చేయడమే.
14 ఏళ్ళ బాబు పాలనలో జరిగిన ఘోరాలు-నేరాలు తెలుసుకుని మాట్లాడండి
-చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఏం జరిగిందనేది, మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు ఏమిటో తెలుగుదేశం మహిళామణులు తెలుసుకుని మాట్లాడితే మంచిది. జగన్ మోహన్ రెడ్డిగారు తన రెండున్నరేళ్ల పాలనలో మహిళలకు ఎంతగా రక్షణ, భద్రత కల్పించారో, వారి అభ్యున్నతికి ఎంత గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారేది తెలుసుకుని మాట్లాడితే మంచిది.
దళిత మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టినప్పుడు దీక్షలు ఎందుకు చేయలేదు?
‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని’ మహిళల పుట్టుకనే చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు, హేళన చేశారు. దాన్నిబట్టే మహిళలు అంటే చంద్రబాబుకు ఎంత చులకనభావమో అర్థం అవుతుంది. బాబు హయాంలో ఎంతోమంది మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నాయకులు చాలామంది ప్రమేయం ఉంది కదా? అప్పుడు ఈ తెలుగుదేశం మహిళామణులంతా ఏమైపోయారు? మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని కొడితే అప్పుడేమయ్యారు వీళ్లంతా? టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అయిదేళ్లు పనిచేసిన వంగలపూడి అనిత… తన పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం జెర్రెపోతులపాలెంలో దళిత మహిళను జుట్టు పట్టుకుని టీడీపీ నేతలు ఈడ్చి కొట్టినప్పుడు…నారీ సంకల్ప దీక్ష చేయాలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాకలో లావణ్య అనే యువతి హత్య చేయబడింది. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులే పదిన్నర లక్షలతో సెటిల్మెంట్ చేశారు. అప్పుడు మీరెందుకు దీక్షలు చేయలేదని అడుగుతున్నాం.
బాబు హయాంలో మద్యం ఏరులై పారింది..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి, ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి కాగానే ఈ రెండున్నరేళ్లలో 43వేల బెల్ట్ షాపులను రద్దు చేశారు. 33శాతం మద్యం షాపులను తొలగించారు. మద్యానికి బానిసలైనవారు, తాము సంపాదించిన డబ్బులు మద్యానికే ఖర్చు పెట్టడంతో పాటు, వారిలో నేర ప్రవృత్తి పెరిగిపోతున్నందున అక్కచెల్లెమ్మల జీవితాలను బాగు చేసేందుకోసం జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని రూపకల్పన చేశారు.
దేశానికే దిశ ఆదర్శం
దిశ చట్టాన్ని జగన్ మోహన్ రెడ్డి రూపకల్పన చేసి, అసెంబ్లీలో ప్రవేశపెడితే మీ టీడీపీ ఎమ్మెల్యేలు సభ బయటకు వచ్చి ఆ పేపర్లను చింపివేశారు. అనితగారు మీ పార్టీ నాయకులకు మహిళల భద్రత పట్ట అంత చిత్తశుద్ధి ఉందని ఆ సంఘటనే రుజువు చేస్తుందని దయచేసి గమనించండి. దిశ చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మీ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లోకానీ, బయటగానీ ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాం. దిశ చట్టం లాంటిది రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఇంతకు ముందు ఎవరూ ప్రవేశపెట్టలేదు. ఆ ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. దేశానికే దిశ చట్టం ఆదర్శంగా నిలిచింది. కేంద్రం వద్ద ఈ చట్టం పెండింగ్‌లో ఉన్నా కూడా అమలు చేయడానికి జగన్ మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా కార్యాచరణ చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడివారిపై వారం రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు అయ్యేలా చర్యలు తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్.
దిశ చట్టం అమలు చేయడానికి, కేసులు సత్వరమే పరిష్కారం కోసం, నిందితులకు సత్వరమే శిక్షపడేందుకు 19మంది పీపీలను నియమించారు. 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో మహిళలకు రక్షణ కల్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఒక మహిళా పోలీస్‌ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. 10 పోక్సో కోర్టులను, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేయడానికి జగనన్న చర్యలు తీసుకుంటున్నారు. అంతగా మహిళల భద్రత, రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడు జగన్ . అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు మాట్లాడటానికి టీడీపీ మహిళలకు నోరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నాను.
సొంత అన్నలా మహిళలకు భద్రత, భరోసా
జగన్ మోహన్ రెడ్డి పాలనలో.. తన సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రత, భరోసాను కలిగి ఉంటారో అలాంటి పరిస్థితిని మహిళలకు ఆయన కల్పించారని చెప్పడానికి, ఓ ప్రజాప్రతినిధిగా గర్విస్తున్నాను. దేశంలో ఎంతోమంది మహిళా ముఖ్యమంత్రులు కూడా పరిపాలన చేశారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేయని మహిళా చట్టాలను జగన్ మోహన్ రెడ్డిగారు ఆంధ్రరాష్ట్రంలో ఏర్పాటు చేశారని, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న ఒక మహిళా ప్రజాప్రతినిధిగా చాలా ధైర్యంగా చెబుతున్నాను.జగన్ మోహన్ రెడ్డి మహిళల కోసం ఇంతగా పాటుపడుతుంటే, తన 14ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏరోజు అయినా ఇటువంటి నిర్ణయాలు చేశారా అని టీడీపీ నాయకులు ప్రశ్నించండి.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో పథకాలు
మహిళల రక్షణ కోసమే కాకుండా, ఎవరిమీద ఆధారపడకుండా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అవి కూడా మహిళల పేరుమీదనే ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాలన్నీ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, చేయకుండా ఎగగొట్టారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే వైయస్సార్ ఆసరా పథకం కింద మహిళలు ఎంత రుణం కట్టాలో వారి ఖాతాల్లో దశలవారీగా జగన్ గారు జమ చేస్తున్నారు. అలాగే వైయస్సార్ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నారు. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలు అగ్రవర్ణాల మహిళలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. మహిళల తాలూకా కష్టాలు తెలుసు కాబట్టే.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలతో పాటు పెట్టని పథకాలను కూడా అమలు చేస్తున్నారు. అంత మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఎక్కడా చూడం.
జగన్ సొంత అన్నలానే కాకుండా, ఒక తండ్రిలా సున్నిత విషయాలు అయిన శానిటరీ న్యాప్కిన్లనూ కూడా చదువుకుంటున్న ఆడపిల్లలకు అందేలా చర్యలు చేపట్టారంటే మహిళల గురించి ముఖ్యమంత్రి ఎంతగా ఆలోచిస్తున్నారనేది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
సెక్సువల్ అఫెండర్స్ ని జియో ట్యాగ్ చేస్తున్నాం
చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాల్లో మహిళలను ఏవిధంగా అవమానించారో చూశాం. అదే జగన్‌గారు మహిళల రక్షణ కోసం ఎంతగా పాటుపడ్డారో చెబుతాను. లైంగిక వేధింపుల విషయంలో టీడీపీ హయాంలో 60 రోజుల్లో దర్యాప్తు చేసినవి కేవలం 14.5శాతం ఉంటే, మా ప్రభుత్వ హయాంలో ఆ శాతం 93.5శాతానికి పెరిగింది.
టీడీపీ మహిళామణులు ఈ విషయాలు చక్కగా తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అడగండి. ఎందుకు నారీ సంకల్ప దీక్ష చేయిస్తున్నారని తెలుగుదేశం మహిళలు నిలదీయండి. గత ప్రభుత్వలో రేప్, మర్డర్ కేసుల విచారణలో దర్యాప్తు సగటున 318రోజులు పడితే.. మా జగనన్న ప్రభుత్వంలో అది 42 రోజులకు తగ్గిందని గర్వంగా చెబుతున్నాం. సామూహిక అత్యాచారాలకు సంబంధించి దర్యాప్తునకు 257 రోజులు పడితే మా ప్రభుత్వంలో ఈ విచారణలో కేవలం 42 రోజుల్లోనే పూర్తవుతోంది. పోక్సో చట్టం కింద కేసుల విచారణను తీసుకుంటే గత టీడీపీ హయాంలో సగటున 175 రోజులు పడితే.. మా ప్రభుత్వ హయాంలో అది 41రోజులకు తగ్గింది.
అలాగే రేప్ కేసుల మీద విచారణ మీ ప్రభుత్వ హయాంలో సగటున 261 రోజులు పడితే ఇప్పుడు 47 రోజులకు తగ్గింది. సెక్సువల్ అఫెండర్స్ ను జియో ట్యాగ్ చేయడం అనేది టీడీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేదు. కానీ దాన్ని జగన్‌గారు ప్రవేశపెట్టి 2,17,647మందికి జియో ట్యాగింగ్ చేసిన పరిస్థితి ఏపీలో ఉంది. అలాగే ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు టీడీపీ ప్రభుత్వంలో లేవు. కానీ జగనన్న ప్రభుత్వంలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతి గ్రామంలో, వార్డుల్లో మహిళా పోలీస్ కార్యకర్తను కూడా ఏర్పాటు చేశారు. మహిళలు నిర్భయంగా తమ బాధలు, కష్టాలు, సమస్యలు చెప్పుకునేలా పోలీస్ స్టేషన్లో రిసెప్షన్లో మహిళా పోలీసులను నియమించారు.
రాజ్యాధికారంలోనూ మహిళలకు 50 శాతం వాటా
ఇన్నిరకాలుగా మహిళల కోసం ఆలోచిస్తూ.. మహిళల రక్షణ, వారి సంక్షేమం కోసం పాటుపడటమే కాకుండా రాజ్యాధికారంలో 50శాతం మహిళలకు పదవులు ఇచ్చారు. అలాగే దళిత మహిళను హోంమంత్రిని చేసిన ముఖ్యమంత్రి జగన్. మరో మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు జగనన్న. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న మహిళలు అంతా జగన్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉండటమే కాకుండా రక్షణగా ఫీల్ అవుతున్నారు. అలాంటి గొప్ప నాయకుడి వద్ద పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. నూటికి నూరుశాతం జగన్‌గారు మహిళా పక్షపాతి ప్రభుత్వం నడుపుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ మహిళానారీమణలు ఎవరు మహిళా పక్షపాతో ఆలోచించండి.