రామినేని ఫౌండేషన్‌కు వెంకయ్య ప్రశంసలు

వివిధ రంగాల్లో నిష్ణాతులయిన లబ్ధప్రతిష్ఠులకు ఇచ్చే రామినేని ఫౌండేషన్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలిసిందే. దేశంలో ప్రఖ్యాత క్రీడాకారులు, వైద్యులు, శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పాత్రికేయులు, కళాకారులను గుర్తించి వారికి పురస్కారాలు అందిస్తున్న రామినేని ఫౌండేషన్‌కు, దేశంలో ఒక ప్రముఖ స్థానం ఉందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయవాడకు విచ్చేసిన సందర్భంగా… రామినేని ఫౌండేషన్ కన్వీనర్, బీజేపీ రాష్ట్ర కార్యద ర్శి పాతూరి నాగభూషణంతోపాటు ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ కలసి, ఆయనకు తమ ఫౌండేషన్ కార్యక్రమాలు వివరించారు. వాటిని సావధానంగా విని, ఆ కార్యక్రమాల ఫొటోలు చూసిన వెంకయ్యనాయుడు, వారిని అభినందించారు. ఈ కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమని ప్రశంసించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. సమర్ధులను గుర్తించి, వారికి పురస్కారాలు ఇవ్వడం మిగిలిన వారికి స్ఫూర్తిదాయకమవుతుందన్నారు.