– వీహెచ్‌పీ తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మల్ల సత్యం జి
– వైభవంగా వీహెచ్‌పీ షష్టిపూర్తి వేడుకలు ప్రారంభం
– ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం
జోగిపేట: ప్రతి హిందువుకు విశ్వహిందూ పరిషత్ వెన్నుముక లాంటిదని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మల్ల సత్యం జి అన్నారు. వీహెచ్‌పీ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో షష్టిపూర్తి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సత్యం జీ మాట్లాడారు. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబాయి సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని పేర్కొన్నారు.
RSS సెకండ్ చీఫ్ గురూజీ స్థాపించిన తమ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, చరిత్రలో నిలిచిపోయే అయోధ్య వంటి భారీ ఉద్యమాలు చేపట్టి, విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 1964 నుంచి 2024 వరకు ఆరు దశాబ్దాల కాలంలో తమ సంస్థ హిందూ సమాజ హితం కోసం పనిచేస్తూ వస్తోందని వివరించారు. ప్రతి ప్రఖండ స్థాయిలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండుతోందని అయన పేర్కొన్నారు.
వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు….
ఈ సందర్భంగా సత్యం జి మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 1వ తారీకు వరకు వారం రోజులపాటు విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలు కులాలు వర్గాలకు అతీతంగా ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ ను ఆదరించాలని కోరారు. హిందువులంతా సంఘటితం కాకపోతే పెను ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్.. బంగ్లాదేశ్ కాకముందే ప్రతి హిందువు జాగృతం కావాలని ఆయన హెచ్చరించారు.