– ఏపీలో వైద్య సదుపాయాలు భేష్-కేంద్ర వైద్య శాఖ నివేదికలో వెల్లడి
– చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం-రెండేళ్లలో 23వేల కొత్త యూనిట్లు ఏర్పాటు
– వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపి టాప్
– మధ్యతరగతి ప్రజల కోసం ఎంఐజి లేఅవుట్లు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
:బాబు వెన్నులో జలదరింపు స్పష్టంగా కనిపిస్తోందని. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా పొత్తుల కోసం అప్పుడే ఆరాటాలు మొదలయ్యాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గుంపు కట్టకపోతే 151 సీట్లు గెలిచిన పర్వతాన్ని ఢీ కొట్టలేమని బాబు గ్యాంగ్ కు అర్థమయినట్లుందని, అందుకే వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నాలు మొదలెట్టారని ఏద్దేవా చేసారు.
తుపాకీలో గుండ్లున్న రోజుల్లో గువ్వను కొట్టా, కొంగను వేశా’ అన్న ప్రేలాపనలు తప్ప వర్తమానంలో ఏం చేస్తున్నాడో చంద్రబాబు చెప్పలేకపోతున్నాడని,. ఈ ప్రగల్భాలు చెప్పడానికి బాబుకు ఓపిక ఉన్నా విన్నవారికి రోత పుట్టిస్తున్నాయని అన్నారు. జనం చంద్రబాబును ఎప్పుడో మర్చిపోయారని కుప్పం ప్రజలు ముఖం మీదే కొట్టి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చిందని. వైద్య నిపుణులు, సిబ్బందిని ఏర్పాటు చేసి, 24 గంటలూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలలో మారిన ఈ దృశ్యాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ‘రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2020-21లో వెల్లడించిందని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం
రాష్ట్రంలో వంద శాతం పీహెచ్సీల్లో 24/7 సేవలు, గణనీయంగా పెరిగిన వైద్యుల సంఖ్య, దేశ సగటు కన్నా రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువగా ఉండడం వంటి విషయాలు నివేదికలో వెల్లడయ్యాయని అన్నారు. దేశంలో ఈ ఘనత కేవలం మూడు రాష్ట్రాలకే దక్కిందని అన్నారు.
రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేస్తోందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, న్యాయ వివాదాలు, ఇతర ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలని అధికారులకు స్పష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
చిన్న పరిశ్రమల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో రెండేళ్లలోనే దాదాపు 23 వేల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయని. రూ.7015.48 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 156296 మందికి ఉపాది లభించిందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ సత్ఫలితాలనిస్తోందని, పాత యూనిట్లు ఊపిరి పీల్చుకున్నాయని, కొత్త యూనిట్లు భారీగా ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు.