మతాలను రెచ్చగొడుతున్న వైఎస్ సోదరి విమలారెడ్డి

– మత వైషమ్యాలను రెచ్చగొడుతున్న జగన్ మేనత్త
– వెంకట్రామిరెడ్డి ఉద్యోగనేతనా? వైసీపీ నాయకుడా?
– ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండి
– ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకట రామిరెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు వర్ల రామయ్య ఫిర్యాదు
– ఎన్నికల ప్రచారాలు, రాజకీయ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం చట్ట వ్యతిరేకం

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

యధా రాజా తథా ప్రజా అన్నట్లు అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ రెడ్డి అడ్డ దారిలోనే కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వర్ల రామయ్య జగన్మోహన్ రెడ్డి పార్టీ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నదని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి జగన్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట రామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పార్టీ కోసం ప్రచారం చేయడంలో వెంట్ రామిరెడ్డి బరితెగించి ముందుకు వస్తున్నాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రచారం చేయడానికి వీలు లేదు. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి రాకపోతే ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఉంటాయి, రావాల్సిన రాయితీలు రావని సచివాలయ ఉద్యోగులను భయపెడుతున్నాడు. ఇతను అధ్యకుడు అయినప్పటి నుంచి వెలగబెట్టిందేమి లేదు. సరిగ్గా జీతాలు రాకపోతే ఏ రోజు కూడా నోరు ఎత్తని వ్యక్తి అని విమర్శించారు.

సివిల్ కాండక్ట్ రూల్స్‌కు వ్యతిరేకంగా వెంకట్ రామిరెడ్డి తీరు

ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటూ బహిరంగంగా వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేయడం సివిల్ కాండెక్ట్ రూల్స్‌కు వ్యతిరేకం. కేవలం సచివాలయంలోనే కాకుండా ఊరూరా తిరుగుతూ, గ్రామ సచివాలయాలు సందర్శించి జగన తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ప్రతీ రోజు, ప్రతీ ఒక్క సెక్రటరీ జగన్ రెడ్డి కోసం ఎన్ని ఓట్లు రెడీ చేశారో కూడా నాకు చెప్పాలని నిబంధన పెడుతున్నాడు. జగన్‌కు మద్దతిచ్చి మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగి కోరటం చట్ట వ్యతిరేకం.

ప్రభుత్వ ఉద్యోగిగా పనికి రాని వ్యక్తి వెంకట రామిరెడ్డి. ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అతన్ని తక్షణమే సస్పెండ్ చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కి అచ్చెన్నాయుడు లేఖ రాసిన చర్యలు లేవు. అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాను కలిసి వెంకట రామిరెడ్డి మాట్లాడిన వీడియో తో సహా ఫిర్యాదు చేశాం. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాము. ఇప్పటికైనా మీన మేషాలు లెక్కించకుండా, ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాలని చీఫ్ సెక్రటరీని రామయ్య డిమాండ్ చేశారు.

మత వైషమ్యాలను రెచ్చగొడుతున్న జగన్ మేనత్త

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనత్త విమలా రెడ్డి అనే క్రైస్తవ మత బోధకురాలు ఊరూరా తిరిగి పాస్టర్లతో సమావేశమవుతున్నది. పాస్టర్లకు బహుమతులు, డబ్బులు ఎర చూపి జగన్ రెడ్డికి ఓటు వేయండని కోరుతున్నది. ఇతర మతాల నుంచి క్రైస్తవ మతాన్ని కాపాడు కోవాలంటే జగన్ రెడ్డికి మాత్రమే ఓటు వేయండని ఆమె ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. మతాల మధ్య విధ్వేషాలు లేని మన రాష్ట్రంలో ఆమె పాస్టర్లతో మాట్లాడే మాటలు, రెండు మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయి. మతాలను ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారం చేయడం నేరం. పేపర్ క్లిప్పింగ్‌లు, రుజువులతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఆమెపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన తెలియజేశారు.

ఎన్నికలకు నెల ముందే ఓటర్లకు ఎర

ఎన్నికల సమయంలో కొంతమంది ఓటర్లకు బహుమతులు డబ్బులు ఎర వేయడం చూసాం గాని, జగన్ పార్టీ ఎన్నికలకు ముందే బాహాటంగా బహుమతులు, డబ్బు, ఓటర్లకిచ్చి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. వాలంటీర్లకు, అధికారులకు, సెక్రటేరియట్ ఉద్యోగులకు, ఓటర్లకు బహిరంగంగా బహుమతులు ఇస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత, మంత్రి రోజా, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, తిరుపతి రావు, భాస్కర్ రెడ్డి, వైఎస్ విమలా రెడ్డి మొదలగు వారు ఎక్కడెక్కడ బహిరంగంగా బహుమతులు, డబ్బులు పంచారో, వాటి వివరాలతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

అవకాశం లేకనే ప్రచారానికి దూరంగా డీజీపీ

ఎన్నికల్లో ఎలాగైనా, ఎన్ని అక్రమాలు చేసైనా గెలవాలని వాలంటీర్లకు, అధికారులకు, ఓటర్లకు డబ్బులు, బహుమతులు బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. కుక్కర్లు, మిక్సీలు మొదలైనవి కుప్పలు కుప్పలుగా తెచ్చి పంపిణీ చేస్తుంటే, పోలీసులు వాటిని అరికట్టాల్సింది పోయి, కొన్ని చోట్ల పోలీసులే పంపిణీ చేస్తున్నారు. అవకాశం లేదు కానీ, డీజీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసేవాడు. ఇలా పంపిణీలు చేయడం తప్పని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వర్ల రామయ్య తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రజలే కాపాడుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.

 

Leave a Reply