– రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు. రెడ్‌బుక్ రాజ్యాంగం
– చంద్రబాబు, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
– రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వారి పాలన
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు
తాడేపల్లి: భారత రాజ్యాంగ 75వ ఆమోద దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తితో గత అయిదేళ్లలో జగన్ కొనసాగించిన చక్కటి పరిపాలనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఈ సందర్భంగా వైయస్సార్సీపీ నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, అరాచక పాలనను సాగిస్తోందని వారు ఆక్షేపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ ఈ సందర్భంగా వైయస్సార్సీపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి
దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎందరో మహనీయులు పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తమదైన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు, తమది రెడ్‌బుక్ రాజ్యాంగమేనంటూ ప్రజల ముందు ప్రకటిస్తున్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. నేడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎలా ఉందంటే.. నిజం నిద్రలేచే సరికి, అబద్థం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనే సామెతను తలపిస్తూ.. నిత్యం అబద్దాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని అధికారంలోకి వచ్చింది.
రెడ్‌బుక్ రాజ్యాంగం నిలవదు: మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు
అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించుకున్న భారత రాజ్యాంగం ముందు చంద్రబాబు, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నిలవదు. ప్రజాగ్రహంతో ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం చెత్తలోకి పోవాల్సిందే. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా అందరికీ న్యాయమైన పాలన అందించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన పాలన సాగించారు. ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను సైతం దాసోహం చేసుకునే శక్తులు విజృంభిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగస్ఫూర్తి కాపాడేందుకు వైయస్సార్సీపీ ముందుకు వస్తోంది.
జగన్ పాలనలో పరిఢవిల్లిన రాజ్యాంగస్ఫూర్తి: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
జగన్ పాలనలోనే రాష్ట్రంలో రాజ్యాంగం స్ఫూర్తి పరిఢవిల్లింది. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన అరాచకాలు, అన్యాయాలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం, భావప్రకటన స్వేఛ్చను హరించేలా తప్పుడు కేసుల నమోదు జరుగుతోంది. రాజ్యాంగ స్పూర్తికి కూటమి ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది.
మండల స్థాయిలోని పోలీస్‌స్టేషన్ నుంచి డీజీపీ ఆఫీస్ వరకు వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మళ్ళీ జగన్ పాలన రావాలి. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం.
రాజ్యాంగేతర శక్తులు రాష్ట్రంలో పాలిస్తున్నాయి: రాజశేఖర్, లిడ్‌క్యాప్ మాజీ ఛైర్మన్
రాష్ట్రంలో నేడు రాజ్యాంగేతర శక్తులు పాలిస్తున్నాయి. బడుగు, బలహీనవర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగానికి కూటమి పాలకులు విఘాతం కలిగిస్తున్నారు. అన్ని మత గ్రంధాల కన్నా పవిత్రంగా భారతీయులు భావించే భారత రాజ్యాంగంను పక్కకుపెట్టి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు, లోకేష్‌కే దక్కుతుంది.
ఈ కార్యక్రమంలో మంగళగిరి, పత్తిపాడు, తాడికొండ, నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్‌కుమార్, బాలవజ్రబాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఇన్ఛార్జ్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.