హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్.. 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. హిందూ జీవన విధానం విశ్వవ్యాప్తం చేయడం కోసం లెక్కకు మించి పోరాటాలు.. ఆందోళన నిర్వహించి విజయం సాధిస్తోంది.
హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం.. లోక కళ్యాణం కోసం సమాజ సేవ చేయడం.. తద్వారా హిందూ ధర్మాన్ని రక్షించడమే లక్ష్యంగా పని చేస్తోంది. హిందువులను జాగృతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది.
ప్రధానంగా “అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఉద్యమం”. చరిత్రత్మకం. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పోరాటం అది. వందల ఏళ్ల క్రితం మహ్మదీయ రాజు బాబర్ దుర్మార్గపు పాలనలో నేల కూలిన అయోధ్య రామ మందిరాన్ని ఇటీవల 21 జనవరి 2024 వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభించడం హైందవ స్వాభిమానానికి సంకేతం.
వేలాదిమంది ప్రాణ త్యాగానికి చిహ్నం. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి హిందువూ పండుగ చేసుకున్న మధుర క్షణాలు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సుమధుర ఘట్టం. పట్టు వీడని విక్రమార్కుల్లా అనేక సవాళ్లు ఎదుర్కొని, న్యాయ పోరాటం చేసి అద్వితీయ విజయం సాధించింది.
భవ్యమైన మందిరం నిర్మించి న భూతో న భవిష్యత్ అనే రీతిలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు గర్వపడేలా పండుగ నిర్వహించింది. మందిర నిర్మాణం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి హిందువూ స్వాభిమానంతో ఒప్పొంగేలా ఆత్మవిశ్వాసం నింపింది.
అనేక రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని హిందువులను సంఘటితంగా చేస్తున్న సంస్థ విశ్వహిందూ పరిషత్. “హిందువునని గర్వించు -హిందువుగా జీవించు” అంటూ ప్రపంచంలోని హిందువులను ఏకం చేస్తోంది. నీతి, నిజాయితీతో జీవించాలని “ధర్మో రక్షతి రక్షితః” అంటూ ముందుకు సాగుతోంది.
ప్రపంచంలోని ప్రతి హిందువుకు అండగా ఉండేందుకు కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ధైర్యంగా నిలబడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే హిందువులందరికీ విశ్వహిందూ పరిషత్ వెన్నెముక లాంటిది. హిందువులు దైవంగా భావించి పూజించే గోమాత రక్షణ విషయంలో వెన్నుచూపని ధర్మపోరాటం సాగిస్తోంది. ముక్కోటి దేవతలకు నిలయంగా భావించి ఆరాధిస్తున్న ఆవుల రక్షణకు ప్రాణాలను సైతం లెక్కచేయక సమర శంఖం పూరిస్తోంది విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగం.
కులాలు.. ప్రాంతాలు.. ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఆసరగా చేసుకుని హిందువులను మతం మారుస్తున్న మాఫియాను అడ్డుకొని హిందూ రక్షణ చేస్తోంది. తెలిసీ తెలియక మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు “సంస్కృతి దీక్ష యజ్ఞం” (ఘర్ వాపసి) నిర్విరామంగా కొనసాగిస్తోంది.
“హైందవ సోదరా సర్వే – న హిందూ పతితో భవేత్! మమ దీక్షా హిందూ రక్షా- మమ మంత్రః సమానతా” హిందువులందరూ సహోదరులే. హిందుత్వంలో అంటరానితనానికి ఆస్కారం లేదు. హిందూ రక్షనే మా దీక్ష .అంటరానితన నిర్మూలనే మా లక్ష్యం అంటూ.. సామాజిక సమరసతకు విశ్వహిందూ పరిషత్ పెద్దపీట వేస్తోంది. అన్ని కులాలు, అన్ని వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకుంటోంది.
ప్రతి వ్యక్తిలో దైవచింతన పెంచేందుకు, హిందువులందరినీ సమీకరించి ఆధ్యాత్మికతను పంచేందుకు సత్సంగ్ నిర్వహిస్తోంది. సత్సంగ్ ఆధారంగా సంఘటిత హిందూ సమాజాన్ని తయారు చేస్తోంది విశ్వహిందూ పరిషత్.
వేలం వేసిన పద్ధతుల్లో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని లవ్ జిహాదుకు పాల్పడుతున్న దుర్మార్గులకు బుద్ధి చెప్పేందుకు బజరంగ్ దళ్ ను తయారుచేసింది.
బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, వైశ్య ,బీసీ, ఎస్సీ, ఎస్టీల అమ్మాయిలను కులాల ఆధారంగా రేటు గట్టి “లవ్ జిహాద్”ను ప్రోత్సహిస్తున్న జిహాదీ గాళ్లకు గుణపాఠం చెప్పేందుకు.. హిందూ యువతీయువకులలో చైతన్యం తీసుకువచ్చేందుకు భజరంగ్ దళ్ కృషి అద్వితీయం. హిందూ యువతులకు భారతీయ విలువలు.. సంస్కృతీ సంప్రదాయం పై అవగాహన పెంచేందుకు, కుటుంబ వ్యవస్థ బలోపేతం కోసం “దుర్గా వాహిని” అనే సంస్థకు పురుడు పోసింది.
పవిత్రమైన మందిరాలు, మఠాలను అపవిత్రం చేసేందుకు కుట్రలు పన్నుతున్న హిందూ విరోధులకు సమాధానం చెబుతోంది. మఠ మందిరాలను సంరక్షిస్తూ..దేవాలయ ప్రాశస్త్యం, పవిత్రను కాపాడుతోంది.
1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ద్వితీయ సర్ సంఘ్ చాలక్ ( సెకండ్ చీఫ్) మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) గారు ముంబై సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ కు పురుడు పోశారు. నాటి ఆ మహత్తర వేడుకకు దేశంలోని అనేకమంది సాధూ సంతులు హాజరై VHP ఆవశ్యకత ప్రతి హిందువుకు అవసరమని తేల్చి చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ (1964-2024) 60 ఏళ్ల షష్టి పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి( VHP ఆవిర్భావ దినోత్సవాన్ని) ఘనంగా నిర్వహిస్తోంది. విశ్వ వ్యాప్తంగా విస్తరించిన విశ్వహిందూ పరిషత్ దాదాపు 60 దేశాలతో పాటు భారత్ లోని గల్లీ..పల్లె.. పట్టణం.. నగరం.. మహానగరాల్లో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహిస్తోంది. గ్రామస్థాయిలో సైతం ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి హిందూ ఐక్యతకు కృషి చేస్తోంది.
రాజకీయ కుట్రల కారణంగా ప్రతినిత్యం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంది. నిర్విరామ పోరాటంలో అలుపు లేని కార్యకర్తల దళం హిందూ లోకానికి శ్రీరామరక్షగా నిలుస్తోంది. ఆధ్యాత్మికత, కట్టు, బొట్టు, వ్యవహారం, పండుగ, నియమనిష్టలు ఆధారంగా హిందూ పద్ధతులను పరిరక్షిస్తోంది.
ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని, నాగరికతను అందించి దారి చూపిన ధర్మం గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని పెకిలించి వేసేందుకు దుష్టశక్తులు కట్టకట్టుకొని తీవ్రమైన దాడులు నిర్వహిస్తున్నాయి. వాటన్నింటినీ తిప్పి కొట్టి హైందవ పునర్ వైభవం కోసం విశేషంగా కృషి చేసేందుకు జాగృతం చేస్తోంది విశ్వహిందూ పరిషత్. లక్షల ఏళ్లు గా వస్తున్న గొప్ప హైందవ పరంపరను దిశ దశలా విస్తరించేందుకు ప్రతి హిందువును సంఘటితం చేసి ధర్మరక్షణకు బద్దులను చేస్తోంది.
ప్రపంచంలోనే అన్ని హిందూ సంస్థలకు విశ్వహిందూ పరిషత్ మార్గదర్శక నిలుస్తోంది. తన మన ధన పూర్వకంగా సర్వం త్యాగం చేసి పనిచేసే కోట్లాదిమంది సైన్యం విశ్వహిందూ పరిషత్ లో సభ్యులుగా ఉండటం విశేషం. వేలాదిమంది కార్యకర్తలు జీవితాన్ని త్యాగం చేసి ధర్మకార్యంలో పూర్తి సమయం వెచ్చింది పనిచేస్తుండటం ఆదర్శనీయం.
కార్యకర్తల కృషి కారణంగా దేశంలో 80 వేలకు పైగా కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి పల్లె, తండా, గ్రామ సీమల్లో సైతం విశ్వహిందూ పరిషత్ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు అహోరాత్రులు శ్రమిస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా మాత, భూమాత, గోమాత , గంగా మాత, పవిత్ర గ్రంథాలు (భగవద్గీత రామాయణం) పరిరక్షణ కోసం తపిస్తూ.. లోక కల్యాణం కోసం పని చేస్తోంది
విశ్వహిందూ పరిషత్.
( విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి (60 ఏళ్ల ) వేడుకల సందర్భంగా ప్రత్యేక వ్యాసం. శ్రీ కృష్ణ జన్మాష్టమి.. అదే రోజు విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం)