– పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఢిల్లీ: వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర – నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ముందుచూపుతో, అభివృద్ధి కాంక్షతో అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ అనగానే అభివృద్ధికి సంబంధించి దూరదృష్టితో, ఎంతో ముందుచూపుతో కూడుకున్న రెండు ముఖ్యమైన ప్రకటనలు మదిలో మెదలుతాయన్నారు.
1999లో చంద్రబాబు ప్రకటించిన ‘విజన్ 2020’ ఎన్నో ఫలితాలు ఇవ్వగా, 2024లో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష నాయకులు, శాశ్వత అభివృద్ధి పథకాల రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విజన్ 2047 అని తెలిపారు. ఒక విజనరీగా, ఎంతో దూరదృష్టి కలిగిన నిర్వహణాదక్షుడైన నాయకుడిగా ఆయనకు దేశవ్యాప్త ప్రసిద్ధి పొందారన్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్ 2047 ప్రకటన ద్వారా ‘వికసిత ఆంధ్రప్రదేశ్’ అనే అభ్యుదయ పురోగమన భావనతో ముందుకు వచ్చారని తెలిపారు.
హైదరాబాదులోని పాలనా నీతి పరిశోధనా సంస్థ (పాలసీ రీసెర్చి బాడీ), గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (GFST) సాంకేతిక సంస్థలు ఇందుకు ఆయనకు ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం పూర్వపు 13 జిల్లాల్ని ఒక్కోదాన్నీ ఇంచుమించుగా రెండు జిల్లాలుగా విభజించారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలోకి రాగానే చంద్రబాబునాయుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏ స్థాయిలో అమలౌతున్నాయో మూల్యాంకనం చేయించినప్పుడు, విభిన్నమైన అంశాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
కొన్ని జిల్లాలు మాత్రమే అభివృద్ధి లక్ష్యాల సూచికలను (SDG) అందుకోవటంలో ముందుండగా తక్కిన జిల్లాలన్నీ కనీస సంఖ్య 49శాతం కన్నా తక్కువ సాధించి అభివృద్ధి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయని తెలిపారు.
‘వికశిత ఆంధ్రప్రదేశ్ కోసం వ్యూహాత్మక అభివృద్ధి దృక్పథాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే, జిల్లాల స్థాయిలో అభివృద్ధి కోసం చేపట్టదగిన కొన్ని వ్యూహాల్ని ప్రతిపాదించారని తెలిపారు. అందుకు అవసరమైన కొత్త విధానాలను రూపొందించే విషయంలో శాసనసభ ముఖ్యమంత్రికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావటం అనేది చంద్రబాబునాయుడు ‘భవిష్య దృష్టి ప్రకటన’ సారాంశమన్నారు. అందుకోసం భవిష్యత్తు అవసరాల గురించిన చారిత్రాత్మక గమనాత్మకతను, సమకాలీన ఆవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐదు వ్యూహాలను ఆయన ప్రతిపాదించారని తెలిపారు.
పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ అనేది ఇంతవరకూ అమలవుతున్నదే కానీ ఈ మూడింటికీ అదనంగా ప్రజా భాగస్వామ్యాన్ని కూడా చేరుస్తూ, పీపుల్ నాలుగో “పీ”ని కూడా చేర్చి, “ప్రజలు, పబ్లిక్ (ప్రభుత్వ వ్యవస్థ) ప్రైవేట్ వ్యవస్థల పొందు” అంటూ ఒక చతుర్విధ ‘ప’కార ప్రణాళిక (P4 మోడల్)ని ఆయన ప్రకటించారని వివరించారు.
విదేశాలలో గణనీయమైన సంఖ్యలో జీవిస్తున్న ఆంధ్రులు దాదాపు 1.8 కోట్లమంది ఉన్నారని, మొత్తం భారతీయులు 10 కోట్లమంది వరకూ విదేశాల్లో ఉన్నారని అంచనా ఉందని, ఆంధ్రప్రదేశ్ కోసం వారందించే సహకారాన్ని ఆదర్శవంతంగా ఉపయోగించు కోవాలనేది ఐదవ వ్యూహమని వివరించారు.
విదేశీ ఆంధ్రులు తిరిగి స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా చూడాలనేది ఈ వ్యూహంలో ప్రధానమైన అంశమని తెలిపారు. విదేశీ భారతీయులు ఈ P4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలని భావించారని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.