Home » వైఎస్‌ ‘వార్’ సత్వం!

వైఎస్‌ ‘వార్’ సత్వం!

– వైఎస్‌పై ‘వారసత్వ’ యుద్ధం
– కుటుంబసభ్యుల మధ్య రాజకీయ కుంపటి
– జగనన్న వైఎస్ వారసుడు కాదంటున్న చెల్లి షర్మిల
– షర్మిలను తండ్రి వారసురాలు కాదన్న జగనన్న
– షర్మిల కట్టుకున్న చీరపైనా జగనన్న వింత వ్యాఖ్యలు
– అసలు షర్మిల వైఎస్‌కే పుట్టలేదంటూ వైసీపీ సోషల్‌మీడియా దుష్ప్రచారం
– సొంత మీడియాలోనే షర్మిల,సునీతపై వ్యతిరేక కథనాలు
-వైసీపీ- కాంగ్రెస్ ప్రచారంలో వైఎస్ ఫొటోలు
– కొనసాగుతున్న పులివెందుల పంచాయతీ
– ఇంతకూ వైఎస్ ఎవరివాడు?
– షర్మిలవైపే వైఎస్ అభిమానులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా తండ్రి ఆస్తులపై వారసుల కొట్లాటలు చూస్తుంటాం. ఫలానా ఆస్తి నాది. అది నాకే రాయాలని కుటుంబసభ్యులు వాదులాడుకుంటారు. ఫలానా పవర్‌ప్రాజెక్టు నాకివ్వాలనో.. ఫలానో మీడియా సంస్థల్లో నాకూ వాటాలు కావాలనో.. లేదా తండ్రి సంపాదించిన వందల ఎకరాల్లో, తనకూ వాటా ఇవ్వాలనో పంచాయతీ పెడుతుంటారు. కానీ ‘పులివెందుల పంచాయతీ’ అందుకు కొద్దిగా భిన్నం.

తనకు తండ్రి ఆస్తులు పంచకుండా, అప్పుమాత్రమే ఇచ్చిన జగనన్నపై విరుచుకుపడుతున్న చెల్లి షర్మిల.. ఇప్పుడు తండ్రి వైఎస్‌కు తానే నిజమైన వారసురాలినని వాదిస్తున్నారు. వైఎస్ ఆశయాలకు తూట్లు పెట్టి, ఆయన వ్యతిరేకించిన బీజేపీతో జతకట్టిన జగనన్న, తండ్రి వారసుడెలా అవుతారన్నది ఆమె ప్రశ్న.

మరి జగనన్న ఊరుకుంటారా? ఆయన కూడా.. నా చెల్లి తండ్రి వైఎస్‌కు ఎలా వారసురాలవుతుంది? పసుపుచీర కట్టుకుని, తండ్రి రాజకీయ ప్రత్యర్ధులను కలిసిన చెల్లి తన తండ్రికి ఎలా వారసురాలవుతుందని జనం సాక్షిగానే నిలదీశారు. అయితే అటు అన్న పార్టీ వైసీపీ.. ఇటు చెల్లి పార్టీ కాంగ్రెస్ రెండూ తండ్రి వైఎస్ ఫొటోతోనే ప్రచారం చేస్తున్నారు. మరి వైఎస్ ఎవరివాడు? ఇదీ ఇప్పుడు ఆయన అభిమానుల గందరగోళం.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను తన ఇమేజ్‌తో రాష్ట్రం వరకూ ప్రాంతీయ పార్టీగా మార్చి, దానిని శాసించి- శ్వాసించిన యోద్ధ వైఎస్ రాజశేఖర్‌రె డ్డి వారసత్వంపై, ఇప్పుడు పులివెందుల కేంద్రంగా పంచాయతీ మొదలయింది. ఈ యుద్ధంలో వైఎస్ కొడుడు, ఏపీ సీఎం జగన్-ఆయన భార్య భారతీరెడ్డి, మేనత్త విమలారెడ్డి, మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి, ఎంపి అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి అంతా ఒకవైపున్నారు.

వైఎస్ కూతురు షర్మిలారెడ్డి, ఆమె భర్త అనిల్‌కుమార్, వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు డాక్టర్ సునీత ఒకవైపు నిలిచారు. ఇందులో తల్లి విజయమ్మ ఒకసారి కొడుకు జగన్‌వైపు.. ఇ,కోసారి కూతురు షర్మిల వైపు నిలుస్తుంటారు. ప్రస్తుతం ఆమెది అమెరికా నుంచి పులివెందుల యుద్ధాన్ని చూసే ప్రేక్షకపాత్ర. ఇదీ సింపుల్‌గా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న రాజకీయ యుద్ధం.

బహుశా వైఎస్ కలలో కూడా ఊహించి ఉండరు. తన కుటుంబం రాజకీయంగా ఛిన్నాభిన్నం అవుతుందని.. తన వారసత్వం కోసం అన్నాచెల్లెళ్లు ఎదురు నిలబడి యుద్ధం చేసుకుంటారని! ఇప్పుడు లక్షలాదిమంది వైఎస్ అభిమానులను బాధించే అంశం కూడా ఇదే. తండ్రి రాజకీయ వారసత్వం కోసం, జగన్-షర్మిల ఆగర్భశత్రువుల్లా కొట్లాడుకోవడం వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ పులివెందుల పంచాయతీలో, అంతిమంగా ఆయన అభిమానులు.. వైఎస్ ఆశయ సాధనకు పనిచేస్తున్న కూతురు షర్మిలవైపే నిలవడం విశేషం.

వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన సంపాదించిన ఆస్తులను పంచలేదన్నది ఒక కథనం. కాదు ఇద్దరికీ సమానంగా పంచారన్నది మరో కథనం. దానిని జగన్ తన సోదరి షర్మిలకు ఇవ్వలేదని ఇంకో కథనం. ఇందులో నిజమెంతో, రాజన్న ఆత్మ అయిన కేవీపీకి తప్ప ఎవరికీ తెలియదు. కానీ జగన్ తన సోదరికి 86 కోట్లు అప్పుఇచ్చారని మాత్రం షర్మిల ఎన్నికల అఫిడవిట్ చెబుతోంది. అంటే చెల్లికి అన్న ఆస్తులు పంచలేదు కానీ అప్పులు మాత్రం ఇచ్చారని మహిళలకు సులభంగా అర్ధమయ్యే అంశం.

వైఎస్ హెలికాప్టర్ ఘటనలో మృతి చెందేముందు వర కూ పచ్చి కాంగ్రెస్ వాది. బీజేపీ వ్యతిరేకి. ఇందిరమ్మ కుటుంబానికి వీరవిధేయుడు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలన్నది వైఎస్ జీవితకాలపు కోరిక. వైఎస్ అప్పట్లో కాంగ్రెస్‌కు తరగని నిధిలా ఉండేవారు. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సే కాంగ్రెస్‌ను ఆర్ధికంగా ఆదుకునేవారు. ఆరకంగా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయ్యారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఆయన ప్రాంతీయ పార్టీగా మార్చేశారు.

కాంగ్రెస్‌ను ఆ స్థాయిలో శాసించిన వైఎస్ మృతితో, ఆయన కుటుంబం రెండు ముక్కలవడం అభిమానులను తీవ్రంగా బాధించింది. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న జగన్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. ఈ తొమ్మిదేళ్లలో జగన్-షర్మిల కలిసే ఉన్నారు. కానీ షర్మిల పీసీసీ చీఫ్ అయిన తర్వాత పులివెందుల కథ మారింది.

వైఎస్ చివరివరకూ ఉన్న కాంగ్రెస్‌కు అధ్యక్షురాలయిన బిడ్డ షర్మిలను, వైఎస్ అభిమానులు మెచ్చుకున్నారు. తండ్రి ఆశయాలను కొనసాగించడమే దానికి కారణం. కానీ వైఎస్ వ్యతిరేకించిన బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న జగన్‌ను, వైఎస్ అభిమానులు వ్యతిరేకించారు. తొలుత వైఎస్ ఫొటోతో తన రాజకీయ ఉనికి నిలబెట్టుకున్న జగన్.. సీఎం అయిన తర్వాత క్రమంగా, ఆయన ఫొటోను పక్కనబెట్టడాన్ని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చివరకు చెల్లి షర్మిల కూడా అదే విమర్శించారు.

ఈ ఎన్నికల్లో షర్మిల కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తుండగా, జగన్ సోదరుడు అవినాష్‌రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల లేవనెత్తిన వైఎస్ వారసత్వ అంశం వైఎస్ కుటుంబంలో అగ్గిరాజేసింది. అంతకుముందు.. వైసీపీ సోషల్‌మీడియా సైన్యం.. ‘షర్మిల అసలు వైఎస్‌కు పుట్టలేద’ంటూ చేసిన వ్యక్తిత్వ హననానికి ఆమె మనసు గాయపడింది. దానితో అసలు జగనన్న, తన తండ్రి వైఎస్ వారసుడు కాదని ధ్వజమెత్తారు.

‘‘రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న తండ్రి కోరిన పార్టీలో నేనుంటే, రాహుల్‌ను వ్యతిరేకిస్తున్న బీజేపీతో జగనన్న అంటకాగుతున్నారు. మరి వైఎస్ వారసులు ఎవరు’’ అంటూ సెంటిమంట్‌ను పండిస్తున్నారు. ఇది సహజంగానే వైఎస్‌ను అభిమానించే వారి హృదయాలను తాకింది.

దానికి తగినట్లే.. వైఎస్‌తో చివరివరకూ ఉన్న వారిలో, 98 శాతం నాయకులు జగన్ వెంట లేకపోవడం కూడా చర్చనీయాంశమయింది. పైగా సభలో విజయమ్మ, వైఎస్‌ను తిట్టిన బొత్స, కన్నబాబు లాంటివారికి మంత్రి పదవి ఇవ్వడం వైఎస్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ‘తండ్రిని తిట్టిన వారికి, తండ్రి పేరు చార్జిషీట్‌లో పెట్టించిన వారికి పదవులిచ్చిన నువ్వు, వైఎస్ వారసుడివి ఎలా అవుతావ’న్న షర్మిల ప్రశ్నకు, ఇప్పటిదాకా జగన్ నుంచి జవాబు లేదు.

తండ్రి మృతికి రియలన్స్ అంబానీ కారకుడని ఆరోపించిన నువ్వు, అదే అంబానీ కంపెనీకి చెందిన పరిమళ నత్వానీకి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చావ’న్న ప్రశ్నకు, జగనన్న నుంచి మౌనమే సమాధానం. వైఎస్ అభిమానులు, షర్మిల వైపు ఉండటానికి ఇలాంటి అంశాలే కారణంగా కనిపిస్తోంది.

వివేకా హత్యను ముందు గుండెపోటు అని.. తర్వాత గొడ్డలి పోటని.. అది చంద్రబాబు చేయించిన ‘నారాసుర రక్తచరిత్ర’ అన్న దుష్ప్రచారం.. వివేకా హత్యపై కోర్టులో కేసువేసిన జగన్, దానిని ఉపసంహరించుకోవడం.. ఆ తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన సొంత మీడియాలో వివేకా కుటుంబంపై రాసిన వ్యతిరేక కథనాలు.. చిన్నాన్నను చంపిన అవినాష్‌రెడ్డికి, జగనన్న దన్నుగా ఉన్నారంటూ షర్మిల-డాక్టర్ సునీత ప్రారంభించిన న్యాయపోరాట ఘట్టాలు కూడా.. వైఎస్ అభిమానులు, జగన్‌కు దూరమయ్యేందుకు కారణమన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

దానితో ఇప్పుడు వైఎస్ అభిమానులు, ఆయనను పార్టీలకు అతీతంగా ప్రేమించేవారంతా.. షర్మిల ఉన్న కాంగ్రెస్‌ను ప్రేమిస్తున్న స్ధితి. షర్మిల మాత్రమే వైఎస్ వారసురాలని భావిస్తున్న వాస్తవ పరిస్థితి. ఏతావాతా వైఎస్ అసలు వారసురాలు జగన్ కాదు. షర్మిల మాత్రమేనన్నది వైఎస్ అభిమానుల నిశ్చితాభిప్రాయం. ఇదే నిజమైతే ఈ ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా గెలవడంతోపాటు, కాంగ్రెస్‌కు కనీసం 5 నుంచి 7 శాతం ఓట్లు వస్తాయని, అవి వైసీపీ ఓటు బ్యాంకు దెబ్బతీసేవేనన్నది విశ్లేషకుల అంచనా.

Leave a Reply