Home » ఖాకీల కార్లు చెక్ చేయరా?

ఖాకీల కార్లు చెక్ చేయరా?

– పోలీసు వాహనాలు తనిఖీకి అతీతమా?
– పోలీసు కార్లను తనిఖీ చేయకూడదని ఈసీ ఆదేశించిందా?
– తెలంగాణలో పోలీసుల వాహనాల్లోనే డబ్బు తరలించిన నాటి కేసీఆర్ సర్కార్
– ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖాకీల కార్లలోనే డబ్బు తరలింపు
– ఫోన్‌ట్యాపింగ్ కేసులో బయటపడ్డ నిజాలు
– ఏపీలోనూ కేసీఆర్ ‘కారు’ పాలిసీనే ఫాలో చేస్తున్నారా?
– విశాఖలో పోలీసుల వాహనాల్లో డబ్బు తరలింపు ఆరోపణలు
– పోలీసు వాహనాలు తనిఖీ చేయని కేంద్ర బలగాలు
– ఐపిఎస్‌ల బదిలీపైనే దృష్టి సారించిన ఎన్డీయే కూటమి
– సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీలపై దృష్టి పెట్టని కూటమి
– కోడ్‌కు ముందే వైసీపీ వ్యూహాత్మక బదిలీలు
– పోలీసు వాహనాలనూ తనిఖీ చేయాలంటున్న పౌరసమాజం
( మార్తి సుబ్రహ్మణ్యం)

డబ్బు తరలిస్తున్నారన్న అనుమానంతో రాష్ట్ర పోలీసులు ప్రజల కార్లు తనిఖీ చేస్తున్నారు. మంచిదే. మరి అధికారపార్టీ కోసం డబ్బు తరలించే పోలీసు వాహనాలను తనిఖీ చేసేదెవరు? సామాన్యుల కార్లను తనిఖీ చేసే కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల వాహనాలను ఎందుకు తనిఖీ చేయరు? వారు తనిఖీలకు అతీతమా?.. ఇవీ పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్నలు.

ఎన్నికల్లో డబ్బు ప్రభావం కీలకం. రాజకీయ పార్టీలు వాటిని వివిధ రూపాల్లో క్షేత్రస్థాయికి చేరుస్తుంటాయి. దానికి మార్గాలు అనేకం. కొన్ని పార్టీలు సిమెంట్ కంపెనీలు, పెద్ద పెద్ద షోరూములు, బంగారు షాపులలో ముందస్తుగానే డంపు చేస్తుంటాయి. మరికొన్ని తెలివైన పార్టీలు మీడియా కార్యాలయాలు, ముద్రణాలయాల్లో దాచిపెట్టి అవసరమైనప్పుడు వాటిని పేపర్ వెహికిల్స్ ద్వారా తరలిస్తుంటాయి. ఇది బహిరంగ రహస్యమే.

సహజంగా అధికార పార్టీకి చెందిన వారి వాహనాలను, రాష్ట్ర పోలీసులు తనిఖీ చేయరు. దానితో అభ్యర్ధులకు నెలరోజుల ముందే పంపిణీ అయిపోతుంటుంది. దానిని ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయికి చేర్చడమే కీలకం. అందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన పోలీసులను సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీలుగా నియమించుకుంటాయి. ఎన్నికల్లో వీరిదే ప్రధాన పాత్ర. ప్రధానంగా

ఇలాంటి క్షేత్రస్థాయి నిజాలు తెలిసిన వారు బహు తక్కువ. ఇక్కడకు ఎస్‌ఐలుగా పోస్టింగు తెచ్చుకునేవారు నూటికి 70 శాతం ఎమ్మెల్యేలకు, వీర విధేయులుగా ఉంటారు. ఎన్నికల సమయంలో వీరంతా అధికార పార్టీకి, తమ రుణం తీర్చుకుంటారన్నది బహిరంగ రహస్యమే.

పట్టణాలు-నగరాల్లో మీడియా దృష్టితోపాటు, ప్రజాచైతన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ డబ్బు పంపిణీ కొద్దిగా కష్టమైన ప్రక్రియ. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ఎస్‌ఐల సహకారంతో అధికార పార్టీ లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటే రూరల్‌లో ఎస్‌ఐలే రారాజులు కాబట్టి. అటు కేంద్ర బలగాలు కూడా ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీల కార్లు తనిఖీ చేయరు. ఫలితంగా అధికారంలో ఉండే పార్టీకి, డబ్బు పంపిణీ పెద్ద కష్టం కాదు. ఎటొచ్చీ ఇబ్బందల్లా ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులకే.

గత నెలలో తాడేపల్లిలోని పార్టీ వార్ రూం నుంచే అభ్యర్ధులకు డబ్బులు పంపిణీ జరిగిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో గుప్పుమంది. పోలీసు వాహనాల సాయంతోనే అభ్యర్ధులు వాటిని తమ వెంట తీసుకువెళ్లారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కేసీఆర్ జమానాలో సరిగ్గా ఇదే జరిగింది. పలు ఉప ఎన్నికల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల వాహనాల్లోనే, బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు డబ్బులు చేరవేశారట. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. పోలీసు వాహనాల ద్వారానే డబ్బు పంపిణీ శ్రమదానం చేసిన నిజం, ఇటీవలి ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడింది. స్వయంగా ఆ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న డీఎస్పీ, మాజీ డీసీపీ, పలువురు సీఐలు, కానిస్టేబుళ్లే పోలీసు విచారణలో ఈ నిజాలన్నీ కక్కేశారట.

సరే ఉప ఎన్నికలంటే కేంద్ర బలగాలు ఉండకపోవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికలకయితే కేంద్ర భద్రతా దళాలు మోహరిస్తాయి కదా? ప్రతి వాహనాన్నీ జల్లెడ పట్టి వదులుతాయి కదా? అయినా సరే బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు డబ్బులు వెళ్లాయంటే.. దానికి కారణమైన పోలీసు వాహనాలను, తనిఖీ చేయకపోవడం వల్లనే కదా? అన్నది పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్న.

అదే కేంద్ర బలగాలు పోలీసు వాహనాలను కూడా తనిఖీ చేసి ఉంటే, వందలకోట్లు పట్టుబడి ఉండేవి కదా? అసలు పోలీసు వాహనాలు తనిఖీ చేయకూడదన్న నిబంధన, ఎన్నికల సంఘం ఏమైనా విధించిందా? ఎన్నికల సమయంలో మంత్రుల వాహనాలు తనిఖీ చేసే కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు వాహనాలు ఎందుకు తనిఖీ చేయరన్నది బుద్ధి జీవుల ప్రశ్న.
కాగా తాజాగా విశాఖ జిల్లాలో.. స్వయంగా పోలీసు వాహనాల ద్వారానే డబ్బు పంపిణీ జరుగుతోందని, ఎన్డీయే కూటమి చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. అంటే వైసీపీ సర్కారు కూడా, కేసీఆర్ ‘కారు పాలిసీనే’ పాటిస్తోందా అన్న సందేహాలకు, తాజా పరిణామాలు కారణమవుతున్నాయి.

పోలీసు వాహనాల్లో రాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి, డబ్బులు పంపిణీ చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఇది మీడియాలో వెలుగుచూసినా డీజీపీ గానీ, విశాఖ పోలీసులు గానీ ఖండించకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలో, ఒక పోలీసు అధికారి కూడా అధికారపార్టీకి ఇలాంటి శ్రమదానమే చేస్తున్నార ని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. సదరు అధికారి రాత్రి వేళ్లల్లో సివిల్ డ్రస్సు వేసుకుని, అధికార పార్టీ వారితో తిరుగుతున్నారన్నది కూటమి ఆరోపణ. ఆయనపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఈసీకి ఫిర్యాదు చేయడం ప్రస్తావనార్హం. ఇలాంటి అధికారులు దాదాపు ప్రతి రూరల్ నియోజక వర్గాల్లోనూ, శ్రమదానం చేస్తున్నారని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. ఎస్పీ, డీజీపీ స్థాయి అధికారులను బదిలీ చేయాలన్న తమ కూటమి డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లా ఎస్పీని మారిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని, అసలు క్షేత్రస్థాయిలో అధికారపార్టీకి పనిచేసే సీఐ, ఎస్‌ఐలపై దృష్టి సారించకుండా.. ఎంతసేపూ ఐపిఎస్‌లను మార్చాలని డిమాండ్ చేయడమే వింతగా ఉందంటున్నారు.

‘ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు-ఇన్చార్జిలు తమకు కావలసిన వారిని సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీలుగా తెచ్చుకున్నారు. నూటికి 80 శాతం వారి ద్వారానే అన్ని పనులూ అవుతున్నాయి. కోడ్ అమలులోకి వస్తే సహజంగా పోలీసులు పెద్దగా రిస్కు తీసుకోరు. అలాంటిది ఇంకా గ్రామాల్లో ఎన్డీయే కూటమి పార్టీ నేతలపై పోలీసు వేధింపులు కొనసాగతున్నాయంటే.. ఐపిఎస్ ఆఫీసర్లు గొప్పనా? ఎస్‌ఐలు గొప్పనా? ఈ సూక్ష్మం తెలియని మా కూటమి నేతలు, ఎంతసేపటికి ఎస్పీలు, కమిషనర్లు, ఐజీలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు మార్చాల్సింది అధికారపార్టీకి అనుకూలంగా ఉండే సీఐ, ఎస్‌ఐలను మాత్రమే’నని గుంటూరు జిల్లాకు చెందిన ఓ జనసేన నేత వ్యాఖ్యానించారు.

Leave a Reply