Suryaa.co.in

Telangana

వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక?

– పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలి
పెండింగ్ లో ఉన్న టిఏ, ఎస్ఎల్, జిపిఎఫ్ లను వెంటనే విడుదల చేయాలి
– రూల్స్ మార్చుతూ పోలీసు సోదరుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారు. టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గం.

వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారూ?

టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టిఏ ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించింది. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

పెండింగ్ లో ఉన్న టిఏ, ఎస్ఎల్, జిపిఎఫ్ లను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలి. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.

కెసిఆర్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం మండల పోలీసు స్టేషన్ కు 25,000 పట్టణానికి 50,000 హైదరాబాదులో అయితే 75,000 ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేయడం లేదు.

దానివలన పోలీసులు, పోలీస్ స్టేషన్ వెళ్ళే ప్రజలపై భారం పడుతున్నది. ఈ నిధుల విడుదల కోసం సిఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE