Suryaa.co.in

Editorial

బాబు, లోకేష్‌కు తెలియకుండానే శశిధర్ నియామకం?

– ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రి, ఓ కీలక మంత్రి ఓఎస్డీ, ఓ మాజీ ఐజీ ప్రమేయం?
– అనంతపురం జెఎన్టీయు క్యాంటిన్ కాంట్రాక్టర్ లాబీయింగ్?
– సీఎంఓ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం?

( మార్తి సుబ్రహ్మణ్యం)

కూటమిలో ప్రభుత్వపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ కలిసి కసరత్తు చేసిన తర్వాతనే జరుగుతాయన్నది బహిరంగమే. ఇటీవలి కాలంలో భవిష్యత్తు నేతగా ఎదుగుతున్న లోకేష్.. పార్టీ-ప్రభుత్వంపై ఎక్కువ దృష్టి పెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటిది వారిద్దరికీ తెలియకుండానే కీలక నిర్ణయాలు తెరచాటున జరుగుతున్నాయా? చివరకు అవి సోషల్‌మీడియాలో వెలుగుచూసిన తర్వాతనే, ఆ నిర్ణయాలు వారికి తెలుస్తున్నాయా? అంటే.. వారి వద్ద పనిచేసే అధికారులు-సన్నిహితంగా వ్యవహరించే ప్రైవేట్ వ్యక్తులు, వారిపేరును దుర్వినియోగ ం చేస్తున్నారా? తాజాగా ఏపీపీఎస్సీ సభ్యుడు శశిధర్ నియామకం కూడా, అదే దారిలో జరిగిందా?.. ఇదీ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్.

వివాదంగా మారిన ఏపీపీఎస్సీ సభ్యుడు శిశధర్ నియామకంపై ‘మంచి ప్రభుత్వం’ తీసుకున్న నిర్ణయంపై, టీడీపీ వర్గాల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతోంది. సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహం ఇంకా చల్లారినట్లు లేదు. జగన్ సర్కారులో కీలకపాత్ర పోషించిన హేమచంద్రారెడ్డికి సన్నిహితుడిగా పేరున్న శశిధర్.. నాటి సీఎం జగన్‌తో ఉన్న ఫొటోలు బయటకువచ్చాయి. ఒక సందర్భంలో జగన్‌ను కొనియాడిన సాక్షి క్లిప్పింగులు కూడా వెలుగులోకి రావడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అయితే అప్పటికే శశిధర్ పేరిట జీఓ రావడం, వచ్చిన వెంటనే ఆయన విధుల్లో చేరడం చకాచకా జరిగిపోయింది. ఇక విధుల్లో చేరిన తర్వాత, రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఆయనను తొలగించటం అసాధ్యం.

అయితే శశిధర్ నియామకంపై సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్న పోస్టులను పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సీఎంఓ కీలక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నా దృష్టికి ఆ వివరాలు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించగా.. కీలక మంత్రి ఆఫీసు నుంచి వచ్చినందున, క్లియర్ చేశామని వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాగా..శశిధర్ నియామకంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత కీలకమంత్రికి తె లిసే, ఈ నియామకం జరిగిందన్న ప్రచారం పై నుంచి కింది స్థాయివరకూ జరిగింది. అయితే.. నిజానికి ఆ మంత్రికి తెలియకుండానే, ఆయన పేషీలో పనిచేసే ఓ ఇద్దరు ఓఎస్డీలు, ఒక పీఆర్వోతోపాటు.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఆయన బంధువు- రాష్ట్రంలో పోలీసు అధికారుల నియామకాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఈ నియామకం వెనక ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విచిత్రంగా.. ఈ నియామకం కోసం అనంతపురం జెఎన్టీయు క్యాంటీన్ కాంట్రాక్టర్ ఒకరు చక్రం తిప్పి, భారీ స్థాయిలో లాబీయింగ్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కీలకమైన ఏపీపీఎస్సీ నియామకాలు సైతం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌కు సైతం తెలియకుండా నిర్ణయాలు జరుగుతుండటంపైనే పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా కీలకమంత్రి పేషీలో పనిచేస్తున్న ముగ్గురు అన్ని వ్యవహారాల్లోనూ, చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో పార్టీ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల పార్టీ-ప్రభుత్వానికి అప్రతిష్ఠ వస్తోందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ ముగ్గురినీ నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని అగ్రనేతలు సైతం సూచిస్తున్నారు.

LEAVE A RESPONSE