యాసంగిలో ధాన్యం ఎంత వచ్చినా మేమే కొంటాం

– కేంద్రంలో దిక్కుమాలిన‌, ద‌రిద్ర‌పు గొట్టు ప్ర‌భుత్వం
– వ్య‌వ‌సాయ రంగాన్ని కార్పొరేట్ల‌కు అప్ప‌గించాల‌ని కుట్ర
– రూ.500కోట్ల నీటి తీరువా పన్ను రద్దు
– 2023లో అందుబాటులోకి యాదాద్రి, ఎన్టీపీసీ విద్యుత్‌
– తెలంగాణ సీఎం కేసీఆర్‌

యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్వింటాల్‌ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన రైతు సంక్షేమ చ‌ర్య‌ల వ‌ల్ల తెలంగాణ‌లో స‌మృద్ధిగా పంటలు పండాయ‌ని, రైతాంగం సుఖంగా వుంద‌ని అన్నారు. త‌మ చ‌ర్య‌ల వ‌ల్ల ఒక కోటి ఎక‌రాల పంట విస్తీర్ణం పెరిగింద‌ని, అందుకే పంట‌లు బాగా పండాయ‌ని వివ‌రించారు.

అయితే కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం వుంద‌ని, ఇది భార‌త రైతాంగ దుర‌దృష్ట‌మ‌ని విరుచుకుప‌డ్డారు. 13 నెల‌ల పాటు రైతాంగం ఢిల్లీలో ధ‌ర్నాకు దిగాయ‌ని, చివ‌రికి కేంద్రం దిగివ‌చ్చి, ప్ర‌ధాని మోదీ ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశార‌ని గుర్తు చేశారు.

ఇంత దిక్కుమాలిన‌, ద‌రిద్ర‌పు గొట్టు ప్ర‌భుత్వం కేంద్రంలో వుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. ఈ ఘ‌ట్టాల‌న్నింటికీ దేశ ప్ర‌జ‌లే ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల‌ని, అదంతా ఓ చ‌రిత్ర అన్నారు. ఉద్య‌మాలు చేస్తున్న స‌మ‌యంలో రైతుల‌ను మోదీ ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా తూల‌నాడార‌ని, ఉగ్ర‌వాదులుగా అభివ‌ర్ణించార‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

దేశంలోని వ్య‌వ‌సాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ల‌కు అప్ప‌గించాల‌ని ఓ బ‌ల‌మైన కుట్ర కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంద‌ని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్య‌వ‌సాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేస్తోంద‌ని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయానికి అనుబంధం చేస్తామ‌ని బీజేపీ ఎన్నిక‌ల హామీలో పెట్టార‌ని, అయినా దానిని అమ‌లు చేయ‌ర‌ని ఎద్దేవా చేశారు.

వీట‌న్నింటితో పాటు ఎరువుల ధ‌ర‌లు కూడా పెంచార‌ని మండిప‌డ్డారు. తాజా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన బిల్లుల‌ను పాస్ చేయించుకున్నారే త‌ప్పించి, రైతుల‌కు అవ‌స‌ర‌మైన వాటిని మాత్రం ముట్టుకోలేద‌ని మండిప‌డ్డారు.

అనేక దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. అందులో భాగంగా వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా అనేక ఉద్దీపనలు సమకూర్చడం జరిగింది. అందులో ఒక భాగం నీళ్ల సమస్య, ప్రాజెక్టులు కాకపోవడం, కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం. రెండోభాగం ఉన్న కొద్దిపాటి 600 భూగర్భ జలాలు బోర్ల ద్వారా తీసుకునేందుకు అవసరమైన కరెంటు లేక చాలా వ్యవస్థ ఉండి.. వందల సంఖ్యలో రోజు మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోయారు.

ఇలా చాలా బాధకరమైన విషయాలు చూశాం. దానికి పునర్జీవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ తీసుకువచ్చింది. కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర జనవరుల శాఖ నివేదికలో వెల్లడించింది. దేశంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని చెప్పింది. దానికి తోడుగా ఎలక్ట్రిసిటీని చాలా అద్భుతంగా చేసి, నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలు అన్ని రంగాలకు అందించాం.

రాబోయే రోజుల్లో యాదాద్రిలో 4వేల మెగావాట్లు, ఎన్టీపీసీ 1600 మెగావాట్లు, మరో 500మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ 2023లో అందుబాటులోకి రాబోతున్నది. విద్యుత్‌ పంపిణీ విధానంలో ఉన్న అసమతుల విధానాన్ని సమతులం చేసి, కోతలు, లోవోల్టేజీ లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ప్రపంచమే అబ్బురపడేలా మిషన్‌ కాకతీయ పూర్తి చేశాం. యూఎన్‌వో సైతం ప్రశంసించింది. రీ ఇంజినీరింగ్‌ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కాళేశ్వరం రికార్డు సమయంలో కంప్లీట్‌ చేయడంతో దానికి ఫలితాలు అందుతున్నాయి.

దీనికి తోడు మూడు నాలుగు సంవత్సరాలు భగవంతుడి దయతో ప్రకృతి కరుణించడంతో వర్షాపాతం తోడైంది. దానికి తోడుగా కరెంటు అద్భుతంగా అన్ని సీజన్లలో ఏమాత్రం సమస్యలు లేకుండా సరఫరా కావడం ఇన్‌ఫుట్‌ అయ్యింది. వీటికి తోడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు ఇండియాలో కాదు ప్రపంచంలో ఇవ్వరు.

ప్రపంచంలో, భారత్‌లోనే కాదు భూగోళంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా సంవత్సరానికి పది వేలు ఇస్తున్నాం. మధ్యలో దళారులు లేకుండా నేరుగా రైతులకు ఇస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ నీటిని సరఫరా చేయడం, గతంలో ఉన్న రూ.500కోట్ల నీటి తీరువా బకాయిలు రద్దు చేయడంతో పాటు కొత్తగా ఎక్కడా రూపాయి తీసుకోకుండా నీటిని సరఫరా చేస్తున్నాం.

ఇలా పొరుగు రాష్ట్రాలతో ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో ఇవ్వడం లేదు. సర్ఫేస్‌ వాటర్‌ను వితౌట్‌ సెస్‌ సరఫరా చేస్తున్నాం. రైతులు చనిపోతే కారణంతో నిమిత్తం లేకుండా రైతుబీమా కల్పించాం. వీటితో రైతులు అద్భుతంగా పంటలు పండించారు. కరోనా సందర్భంలో చెలరేగిన మరణాలు, భయోత్పాతంతో ఒకే చోటకు రైతులంతా వచ్చి మార్కెట్లలో ఉంటే వైరస్‌ ప్రబలుతుందని.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు చేశాం.

ధాన్యం కొనుగోలు చేసి, మూడు నాలుగు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు జమ చేసింది. దీంతో చాలా సానుకూలమైన పవనం వీచింది. పంటలు పండడం కోసం ఇచ్చే డబ్బులు, కరెంటు, నీళ్లు, ఇతర ప్రోత్సాహకాలు, కల్తీ లేని విత్తనాలు, ఎక్కడికక్కడ కొనుగోళ్లతో రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తున్నది. రెండు పంటల్లో కోటిపైచీలుకుపైగా ఎకరాల్లో విస్తీర్ణం పెరిగి.. పంటలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Leave a Reply