Suryaa.co.in

Telangana

రజతోత్సవ సభ ధూం ధాం చేస్తాం

– బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తాం
– వరంగల్లు కు అవకాశమిచ్చినందుకు పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ శాఖ
– పార్టీ అధినేత తో సమావేశమైన వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు

హైదరాబాద్: బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది.

ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కు సంబందించి, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులంతా కలిసివచ్చి ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ గారి తో సమావేశమయ్యారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామా రావు తో పాటు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మండలి ఎల్వోపి ఎమ్మెల్సీ మధుసూదన చారి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మలోత్ కవిత,మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, చల్ల ధర్మ రెడ్డి, డి.ఎస్. రెడ్యా నాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి,నన్నపునేని నరేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, గండ్ర జ్యోతి నాగ జ్యోతి వంటి వరంగల్ ముఖ్యనేతలతో పాటు
మాజీ ఎంపీ జె. సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ. జీవన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరంగల్ నేతలు మాట్లాడుతూ.. అధినేత ఆదేశాలతో ఉద్యమసమయంలో కూడా అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసినామని అన్నారు. వరంగల్ లో సభా నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని తమ ఆనందం వ్యక్తం చేశారు.

రజతోత్సవ మహా సభ నిర్వహణ కోసం ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని మహా సభకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

ఇందులో 154 ఎకరాలు మహా సభ ప్రాంగణం వుంటుందన్నారు. పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు ఇందులో దాదాపు 50,000 ఎకరా వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది అన్నారు. పార్టీ ఆవిర్భవించి ఇరవై అయిదు ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడం తో కనీ వినీ ఎరుగని రీతిలో మహసభను నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా నేతలు తెలిపారు.

రాష్ట్రం నలు మూలల నుండి పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని తెలిపారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

రజతోత్సవ మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10లక్షల మజ్జిగ ప్యాకెట్లను, 10 లక్షల నీళ్ల బాటిలను సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. అత్యవసర వైద్య సేవలను, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాను అన్నారు

నాటి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తాం — వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ

నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను నిర్వహించుకున్న ఘనత వరంగల్ గడ్డకు ఉన్నదని జిల్లా నేతలు తెలిపారు. ఆనాటి ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను విజయవంతం చేసుకుంటామని వరంగల్ జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్ గడ్డ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్లు అందించిన ఉద్యమ స్ఫూర్తితో తిరిగి పార్టీ పార్టీ కోసం ప్రజల కోసం తమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు.

తెలంగాణ సాధన అనంతర కాలంలో కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన తొలి తెలంగాణ ప్రభుత్వ పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో దేశం లో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధిని సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత నాటి కెసిఆర్ ప్రభుత్వానిదేనిని వరంగల్ జిల్లా తెలిపారు.

తెలంగాణ కైనా వరంగల్ కైనా కేసీఆరే శ్రీరామ రక్ష అనే విషయం మరోసారి నిరూపితమైపోయిందన్నారు. నాడు పదేళ్ల పాలనలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని వారు గుర్తు చేశారు.

రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి, తెలంగాణ నేతన్నలకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాదులో ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు పోటీనిచ్చే రీతిలో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం తమ పార్టీ ప్రభుత్వం హయాంలో వరంగల్లో ప్రారంభం కావడం గొప్ప విషయం అని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపును తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనిని తెలిపారు.

వరంగల్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం దగ్గరనుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.వరంగల్ హనుమకొండ జంట నగరాలను అభివృద్ధిపరుస్తూనే జిల్లాలోని మారుమూల ప్రాంతానికి అభివృద్ధిని విస్తరించిన అంశాలను వారు గుర్తు చేశారు. అభివృద్ధిలో హైదరాబాదు తో పోటీపడి విధంగా వరంగల్లును తీర్చిదిద్దన ఘనత కేసీఆర్ దేనని వారన్నారు.

అంతే కాకుండా..సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల పూర్తి, సమ్మక్క బరాజ్.. నిర్మాణం, హైదరాబాద్ తర్వాత తొలి ద్వితీయ శ్రేణి ఐటి నగరం గా తీర్చిదిద్దటం, కాళోజీ కళా కేంద్ర నిర్మాణం,వరంగల్ కు పోలీస్ కమిషనరేట్ హోదా, ఉమ్మడి జిల్లా ను పాలనా సౌలభ్యం కోసం ఆరు జిల్లా లు గా ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ కోసం చెప్పటిన బృహత్తర పథకానిక్ మిషన్ కాకతీయ గా పేరు, రాజముద్ర లో కాకతీయ కళా తోరణం మొదలైనవి ఉన్నాయన్నారు.

ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా వరంగల్ గడ్డ కు కేసిఆర్ ప్రభుత్వం చేసిన కృషి మరువలేమన్నారు. తిరిగి కెసిఆర్ పాలనను తెలంగాణ ప్రజలకు అందించడం ద్వారా వరంగల్ జిల్లా కేసీఆర్ రుణం తీసుకోబోతుందని స్పష్టం చేశారు కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని గాడితప్పిన తెలంగాణ రైతన్నల సంక్షేమాన్ని అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి వరంగల్ జిల్లా బిడ్డలంగా ముందు వరసలో ఉంటామని ప్రతినబూనారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అధినేతకు బహుమతిగా అందజేస్తామని వరంగల్ జిల్లా పార్టీ ముక్త కంఠంతో ప్రకటించింది.

LEAVE A RESPONSE