– ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
– కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి
కుప్పం: ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకే అంకితమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించారని, ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్తున్నానని భువనేశ్వరి చెప్పారు.
కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు , వినికిడి లోపం ఉన్నవారికి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ….ఎన్టీఆర్ స్పూర్తితో ట్రస్ట్ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ట్రస్ సభ్యులు, వాలంటీర్ల సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము.
ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సేవలను మరింత విస్తరిస్తాం:
హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రక్తదాన శిబిరాలు ప్రారంభించాము. వీటి ద్వారా 8.4 లక్షలమంది లబ్ధి పొందారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 226 మంది చిన్నారులకు ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యం అందించాము. అలాగే ట్రస్ట్ తరపున మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా 20 లక్షల 92 వేల మంది లబ్ధి పొందారు. మెడికల్ క్యాంప్స్ నిర్వహణకు రూ. 22.43 కోట్ల ఖర్చు చేశాము. ఎన్టీఆర్ సంజీవని క్లీనిక్స్ ద్వారా 2 లక్షల 15 వేల 601 మంది లబ్ధి పొందారు. ఉచిత మొబైల్ క్లీనిక్స్ వల్ల 86 వేల మందికి వైద్యం అందించాము.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య:
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలంగాణ గండిపేటలో స్కూలు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నడుపుతున్నాము. దాని ద్వారా వచ్చిన లాభంతో ఆంధ్రప్రదేశ్ లోని చల్లపల్లిలో స్కూలు నడుపుతున్నాము. ఈ స్కూల్ ద్వారా పేద పిల్లలకు, టీడీపీ కార్యకర్తల కుటుంబాల బిడ్డలకు ఉచితంగా విద్య అందిస్తున్నాము. ప్రతి ఏడాది 300 మంది విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నాము. స్కాలర్ షిప్స్ ద్వారా 4,250 మంది లబ్ధి పొందారు. ఇందుకోసం రూ. 3.44 కోట్లు ఖర్చు చేశాము. 20 వేల మందికి పైగా అనాథ పిల్లలు ఇక్కడ చదువుకుని ఐటీ సహా అనేక రంగాల్లో స్థిరపడ్డారు.
విద్యార్థినులకు ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ కింద రూ. 2 కోట్ల 73 వేలు వెచ్చించాము. 150 మందికి ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందిస్తున్నాము. రూపాయి తీసుకోకుండా శిక్షణ అందిస్తున్న ఫ్యాకల్టీకి మనస్పూర్తిగా మాతో చేయి కలిపిన ఫ్యాకల్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ట్రస్ట్ తరపున కుప్పంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభించాము. 163 మంది మహిళలకు టైలరింగ్ లో 163 మందికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చాము. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున న్యూట్రి ఫుల్ యాప్ తెచ్చాము. విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాల కంటే ముందే స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇప్పటి వరకూ 21 లక్షల మందికి ఆపన్నహస్తం అందించాము.