-చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
-మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వ వైఖరికి మాత్రమే
-సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం సాగిస్తాం
-సిక్కోలు ఉద్యమ స్ఫూర్తితో మొదటి ప్రాంతీయ సదస్సు
-శ్రీకాకుళంలో కదం తొక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
-అన్ని వర్గాల ఉద్యోగులకు అండగా ఏపీ జేఏసీ అమరావతి
-మూడవ దశలో మొదటి ప్రాంతీయ సదస్సు విజయవంతం
-ఇదే స్ఫూర్తితో మిగిలిన జిల్లాలలో సభలు నిర్వహిస్తాం
-ఎల్లప్పుడు ఉద్యోగుల పక్షాన ఏపీజేఏసీ అమరావతి
-ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
శ్రీకాకుళం (అంబేద్కర్ ఆడిటోరియం):- రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ జెఎసి అమరావతి ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మూడవ దశలో ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసింది. మొదటి ప్రాంతీయ సదస్సు సికోలా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాల ఖిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతిపురం జిల్లాల ఉద్యోగులతో స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ కంచరాళ్ళ శ్రీరాములు అధ్యక్షతన మంగళవారం ప్రాంతీయ సదస్సు జరిగింది.
తొలుత శ్రీకాకుళం రెవెన్యూ భవన్ నుండి ఉద్యోగులు భారీగా ర్యాలీ నిర్వహించి ఆడిటోరియానికి చేరుకున్నారు. సభాధ్యక్షులు శ్రీరాములు తొలి పలుకుల అనంతరం ముఖ్య అతిథులు ప్రాంతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతీయ సదస్సుకు ట్రేడ్ యూనియన్ అయిన ఏఐటియుసి సిఐటియు రాష్ట్ర కమిటీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి సదస్సులో పాల్గొన్నాయి. సిఐటియు తరపున తేజేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలుపుతూ వారికి అండగా ఉన్న ఏపీజేఏసీ అమరావతి సంఘానికి ట్రేడ్ యూనియన్ల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఏఐటీయూసీ నాయకులు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిన ఏ ప్రభుత్వాలు మనుగడలో లేక పక్కన ఉన్నాయని రాజ్యాంగపరంగా ఉద్యోగులకు రావలసిన హక్కులను కాలరాయడం ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం అన్నారు. అన్ని వేళల ఉద్యోగ, కార్మికులు, కాంట్రాక్టు ,ఔట్సోర్సింగ్ చేసే ప్రతి ఉద్యమంలో ఏపీజేఏసీ అమరావతి కి వెన్నుదన్నుగా నిలుస్తామని తెలియజేశారు.
ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పక్కన పెట్టి ఉద్యోగ సంఘాల సమన్వయం చెడగొట్టి సమస్యలను పక్కన పెట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు.
జేఏసీ రాష్ట్ర కోశాధికారి మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగుల సమస్యలపై అవగాహనతో ముందుకెళుతున్న ఏకైక సంఘం అమరావతి జేఏసీనని తెలిపారు.గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల… రెగ్యులైజేషన్ విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందన్నారు.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుమన్ మాట్లాడుతూ నేను ఉన్నాను నేను విన్నాను అన్న సీఎం నేటికీ చిరు ఉద్యోగుల సమస్యలపై ఓ ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు . విజయనగరం జిల్లా చైర్మన్ రమణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మొండి వైఖరితో వ్యవహరించడం బాలేదు లేదన్నారు. పార్వతిపురం చైర్మన్ శ్రీరామ మూర్తి మాట్లాడుతూ తొలి సదస్సు స్ఫూర్తితో ఉద్యోగుల్లో చైతన్యం రావాలన్నారు.
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు ఎస్ గోవిందరావు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం రెండు నాలికల ధోరణితో ఉందన్నారు.హెడ్మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అవమానభారంతో ఆత్మ అభిమానాన్ని చంపుకుని పనిచేస్తూ ఇబ్బందులు పడుకున్నారని తెలియజేశారు.
కేజీబీవీ ఉపాధ్యాయులు రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు దేవి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు.రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఇలా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని తెలియజేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు తరఫున జోనల్ సెక్రెñరీ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు తప్ప ఎటువంటి రాయితీలు అందకపోవడం బాధాకరమన్నారు. పార్ట్ టైం ఇన్స్పెక్టర్ల రాష్ట్ర అధ్యక్షురాలు శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్ట్ టైం పేరుతో ప్రభుత్వం నియమించుకుని ఫుల్ టైం గా పని చేయించుకుంటూ కనీస వేతనాన్ని కూడా అమలు పరచకపోవడం బాధాకరమన్నారు.
అనంతరం ప్రాంతీయ సదస్సుని ఉద్దేశించి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన చేయాలన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు శ్రీకాకుళం జిల్లాలో ప్రాంతీయ సదస్సుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లలో ఆర్థికపరమైనటువంటి అంశాలపై నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.
ఈ ప్రభుత్వానికి సహకారం అందించామని సహకారాన్ని సహనాన్ని ప్రభుత్వం చులకనగా చూసి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.ఇప్పటికే ఒక్కొక్క ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష నుండి నాలుగు లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలుపుతూ డిఎ పిఆర్సి అరియర్స్ విషయంలో కాకి లెక్కలు చెబుతూ కాలయాపన చేస్తుందన్నారు. 62 రోజుల నుండి ఉద్యోగులు ఉద్యమం చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోగా ఉద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం ద్వారా సాధించుకున్న పదవ పిఆర్సి రాయితీలను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసి ఉద్యోగుల మనోవేదనకు కారణమైందన్నారు.ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు గౌరవం లేకుండా ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేయాల్సి వస్తుందని తెలుపుతూ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడి విధి నిర్వహణలో ఉద్యోగుల శాంతియుత వాతావరణాన్ని కల్పించాలన్నారు.
ఉద్యమం ఆరంభం మాత్రమేనని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన ఉధృతం చేసే పరిస్థితులు ఉద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయొద్దని హితవు పలికారు.కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని చిరు ఉద్యోగుల పక్షాన ఏపీ జేఏసీ అమరావతి ఎల్లప్పుడు పోరాడుతుందన్నారు.ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి చులకనగా చూడడం మాట్లాడడం పరిపాటి అయిందన్నారు.
ఉద్యమాన్ని నీరుగారిచ్చేందుకు ఉద్యోగులను దారి మళ్ళించేందుకు ప్రభుత్వం ఏసీబీ దాడులంటూ, పాత కేసులంటూ దృష్టి మళ్లిస్తుందన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచన చేసి ఉద్యమంలో కదం తొక్కలే తప్ప వెనుకడుగు వేయకూడదన్నారు.ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచన చేసి సికోల సింహనాదం ద్వారా ప్రేరణ తెచ్చుకుని ఆలోచన చేసి ఏపీజేఏసీ అమరావతి చేస్తున్న ఉద్యమంలో అడుగులో అడుగు వేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి ఏపీ జేఏసీ అమరావతి అండగా ఉంటుందని తెలుపుతూ ఉద్యోగుల పక్షాన పోరాడే ఏకైక సంఘం ఏపీజేఏసీ అమరావతిని తెలియజేశారు.
అనంతరం సమస్యలపై పరిష్కారం కొరకు పలు సంఘాలు చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి 96 సభ్య సంఘాల ప్రతినిధులు శ్రీకాకుళం ,పార్వతీపురం మన్యం, విజయనగరం ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.