Suryaa.co.in

Andhra Pradesh

జిల్లాలో 30లక్షల గోతాలు అందిస్తాం

జిల్లాలో 30లక్షల గోతాలు అందిస్తాం
– తేమ శాతం నిర్ధారించేందుకు ఒకే కంపెనీ మిషన్లు
– క్షేత్రస్థాయిలో అధికార యంత్రాగం అందుబాటులో ఉంటుంది
– అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం :
– రైతుల ముఖాముఖీలో మంత్రి నాదెండ్ల

నెల్లూరు / సంగం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా 30 లక్షల గోతాలను అందిస్తామవి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. సంగంలో రైతులతో ముఖాముఖిగా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం చెప్పినవిధంగా జరగడం లేదన్నారు.

మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని, తేమశాతం పేరుతో ఎక్కువ కిలోల తరుగు తీసుకుంటున్నారని చెప్పారు. గోతాలు అందుబాటులో వుండడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తేమ శాతం నిర్ధారించి, ఆ శాతానికే మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్లిప్పు ఇచ్చిన తరువాత మిల్లర్లను బతిమిలాడే పరిస్థితి లేకుండా చేయాలన్నారు. వ్యవసాయ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయని, గిట్టుబాటు ధర పెంచాలని విజ్ఞప్తి చేశారు.

కౌలు రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి నాదెండ్ల పలు సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు చేపడ్తామన్నారు. తేమ శాతాన్ని నిర్ధారించేందుకు ఒకే కంపెనీ మిషన్లు అందుబాటులో తీసుకొస్తామన్నారు. ప్రతి మండలానికి కూడా ఒక డ్రయర్ అందించేందుకు, ఉపాధి హామీ నిధులతో ప్రభుత్వ భూముల్లో సిమెంట్ కల్లాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 50% సబ్సిడీతో టార్పాలిన్ పట్టలను రైతులు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు మేలు జరిగేలా కౌలు రైతు చట్టంలో మార్పులు చేస్తూ రైతు భరోసా వచ్చేలా నూతన చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి చెప్పారు.

పట్టుదల, నిజాయితీ గల నేత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి : నాదెండ్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004వ సంవత్సరంలో తాను శాసనసభ్యుడిగా వున్నప్పటి నుంచే ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, గారితో మంచి అనుబంధం వుందని, తనను సొంత కుటుంబసభ్యుడిగా చూసుకుంటూ రాజకీయంగా తనను ఆనం కుటుంబం ముందుండి నడిపించిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆత్మకూరు అభివృద్ధికి ఆనం రామనారాయణరెడ్డి పట్టుదలతో, నిజాయితీతో పనిచేస్తున్నారని, వందల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నారని చెప్పారు. కుటుంబ నేపథ్యం వున్నప్పటికీ అంకితభావంతో పనిచేయడంతోనే ఇవన్నీ సాధ్యమని నాదెండ్ల అన్నారు.

గత ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణణాతీతం: ఆనం

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరుతో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు మంచి అనుబంధం వుందన్నారు. 1983లో నాదెండ్ల మనోహర్‌ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో ఆనాటి ఎమ్మెల్యే ఆనం వెంకటరెడ్డి హయాంలో ఆత్మకూరులో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారని, ఇప్పుడు తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా వుండడం, మంత్రిగా నాదెండ్ల మనోహర్‌ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా వుందన్నారు.

సంగం రోడ్డు కం బ్యారేజ్‌ని నిర్మించేందుకు తాను ఆర్థికమంత్రిగా 130కోట్ల రూపాయలను మంజూరు చేస్తే కేవలం సంగం బ్యారేజ్‌ను మాత్రమే పూర్తి చేసి రోడ్డును నిర్మించలేదన్నారు. ఈ రోడ్డును పూర్తి చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి వుందన్నారు. సీఎం తో కూడా ఈ విషయమై చర్చించినట్లు చెప్పారు.

రైతుల ప్రయోజనాలే ఎన్‌డిఎ ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ వేమిరెడ్డి

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిపంట వేశారని, 11మిలియన్‌ టన్నుల ధాన్యం పండే అవకాశం వుందన్నారు. ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు జిల్లాలో వ్యవసాయ గోడౌన్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 78 సహకార సంఘాలు వున్నాయని, వీటి పరిధిలో దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయించుకునేందుకు జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతుకు మంచి గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌, రాష్ట్ర వక్ప్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఆర్డీవో పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డిసివో గుర్రప్ప, ఎన్‌డిసిసి బ్యాంకు సిఇవో శ్రీనివాసరావు, సంగం పిఎసిఎస్‌ చైర్మన్‌ కట్టా సుబ్రహ్మణ్యం, సిఇవో దస్తగిరి అహ్మద్‌, తహశీల్దార్‌ సోమ్లానాయక్‌, సర్పంచ్‌ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE