Suryaa.co.in

Telangana

దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తాం

-ప్రతి పైసా ప్రజలకు పంచుతాం
-ప్రజల సంక్షేమమే మా పరమావధి
-ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది

భారతదేశంలో ఆదర్శవంతమైన పాలన తెలంగాణలో అందిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం రాత్రి చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగా గారికి పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పౌర సన్మానం పొందిన తర్వాత పార్టీ శ్రేణులను ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు.
రాష్ట్ర వనరులు , సంపద, ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమమే పరమావధిగా తమ పాలన ఉంటుందన్నారు. ప్రజల కలలు నిజం చేయడమే లక్ష్యంగా పాలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని వివరించారు. పారిశ్రామికంగా వ్యవసాయం, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి సంపదను సృష్టిస్తామని, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో ఏమి సాధ్యం అవుతుందో చేసి చూపించి విమర్శకుల నోళ్లకు తాళం వేస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు ఇవ్వని దుస్థితిలో గత ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధ్యాహ్నం ఏజెన్సీ కార్మికుల బిల్లులు చెల్లించామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదని వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకులను చర్ణ కోలాతో కొట్టినట్టుగా తొలుత ఎకరం ఉన్న రైతులకు రైతు బంధు వేశామని, రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రైతుబంధు వేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, తప్పిదాలను సరి దిద్దడానికి ఈ ఐదేళ్ల సమయం కూడా తమకు సరిపోయేలా లేదన్నారు. అయినప్పటికీ ప్రతి రోజు సమీక్షలు చేస్తూ ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ప్రజలకు జవాబుదారీగా పాలన అందించేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై బిఆర్ఎస్ విమర్శలు చేయడం విడురంగా ఉందన్నారు.

10 ఏండ్లు అధికారంలో ఉండి ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసిన బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం నెట్టి వేసినప్పటికీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెడుతున్నారన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట లక్ష కోట్ల రూపాయలు, మిషన్ భగీరథ పథకం అమలు పేరిట 50వేల కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రజలకు ఏం ప్రయోజనం చేసిందని ప్రశ్నించారు. పట్టుమని పది రోజులు కాకముందే కాలేశ్వరం కృంగిపోయి పనికిరాకుండా పోయిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరిట గత బిఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా దోపిడీకి పాల్పడిందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైందని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తామని ప్రకటించారు.

యువత మేదస్సు, చదువు సమాజానికి ఉపయోగపడాలని, భవిష్యత్తుకు పునాదులు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగ పరిశ్రమలతో పాటు అనుబంధంగా ఇందిరమ్మ డెయిరీ ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. మధిర నియోజకవర్గం లో ఉన్న స్వయం సహాయక మహిళా సభ్యులు 53 వేల మందిని ఈ డెయిరీలో భాగస్వామ్యం చేయడంతో పాటు వాటాదారులుగా చేస్తామన్నారు.

చింతకాని లో అసంపూర్తిగా మిగిలిపోయిన స్త్రీ శక్తి భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. చింతకాని మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించి, అందులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చింతకాని చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు. చింతకాని వయా మధిర మీదుగా జమలాపురం రోడ్డును టూరిజం సర్క్యూలేట్ గా చేస్తామన్నారు.

పరిశ్రమల ఏర్పాటు కోసం ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూ సేకరణ
జరుగుతున్నదన్నారు. మండల కేంద్రం నుంచి నామావరం వరకు రోడ్డు, మక్కెపల్లి -వల్లాపురం బ్రిడ్జి, అప్రోచ్ రోడ్స్ పూర్తి చేస్తానని, మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని వరాలు కురిపించారు. కాని మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను పూల మాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కారం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

LEAVE A RESPONSE