Suryaa.co.in

Andhra Pradesh

నిర్మాణరంగాన్ని నిలబెడతాం

– రాష్ట్రాన్ని పునర్‌నిర్మిస్తాం
– అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ
– రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి
– గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు
– టీడీఆర్ బాండ్ల దోషుల్ని శిక్షిస్తాం
– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– గుంటూరులో నరెడ్కో ప్రాపర్జీ షోను ప్రారంభించిన సీఎం

గుంటూరు : ‘బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. ఐదేళ్ల విధ్వంస పాలనలో పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నాం. అందుకే నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమానికి వచ్చా. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని కోరుకుంటున్నాను. నిర్మాణం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు.

ఎటు చూసినా విధ్వంసం…అంధకారమే కనబడింది
‘7 నెలల క్రితం వరకూ నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశాం. అన్ని వ్యవస్థలు పతనమయ్యాయి. నిర్మాణ రంగమైతే గత ఐదేళ్లు అడ్రస్‌ లేకుండా పోయింది. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చాం. ప్రజలు మమ్మల్ని నమ్మి 93 శాతం స్ట్రైక్ రేట్, 53 శాతం ఓట్లు వేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం. గత ఐదేళ్లు ఎటు చూసినా అంధకారం…విధ్వసమే కనబడింది. ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. మొన్ననే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రధాని మోదీ రూ.2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, పెట్టుబడులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాండ్ ఏపీ ఇమేజ్‌తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి.

వ్యవసాయం, పర్యాటకం ఊపందుకోవాలి
‘రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, పర్యాటకం ఊపందుకోవాలి, సంపద పెరగాలి.. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడ్డాయి. గత ఐదేళ్లు ఇసుక లభించక భవన నిర్మాణ రంగం కార్మికులకు సరైన ఉపాధి ఉండేది కాదు. మా ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఇసుక కొరత లేకుండా చేశాం. ఎవరైనా ఇసుక లభ్యం కాకపోతే.. గట్టిగా అడిగే హక్కు ఈ ప్రభుత్వం ఇచ్చింది. నరెడ్కో సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. రియలెస్టేట్ రంగం వాటా జీడీపీలో 7.3 శాతం ఉంది. 2047కు 20 శాతం పెరిగి, 5.8 ట్రిలియన్ డ్రాలర్లు ఆర్జిస్తుంది. అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.

నాగరిక సమాజంలో నిర్మాణం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే ఈ ప్రాంతం మరింత నిలదొక్కుకుని ఉండేది. కానీ ఐదేళ్లు నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణాన్ని నిలదొక్కకోకుండా చేశారు. కూల్చివేతలతో భయబ్రాంతులకు గురి చేయడంతో నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతింది. నిర్మాణ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేసి భూకబ్జాలకు పాల్పడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఇష్టానుసారంగా చేయాలని చూశారు. అందుకే అధికారంలోకి వచ్చాక రద్దు చేసి, యాంటీ ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం.

టీడీఆర్ బాండ్ల దోషుల్ని వదిలిపెట్టం
‘టీడీఆర్ బాండ్లలో డబ్బులు తీసుకుంది ఒకరు… నష్టపోయింది ఇంకొకరు. దీన్ని కూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారు. అవినీతికి పాల్పడ్డవారిని వదలిపెట్టం… అమాయకుల్ని కాపాడతాం. 7 నెలల్లో రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పనులు ప్రారంభిస్తున్నాం. తద్వారా 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

అమరావతి పనులను రూ.50 వేల కోట్లతో ప్రారంభిస్తాం. ఇది స్వయం ఆధారిత ప్రాజెక్టు. రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కన్నా పెద్దగా అమరావతి చుట్టూ 183 కి.మీ మేర రింగ్‌ రోడ్డుకు ప్లాన్ సిద్ధం చేశాం. అది పూర్తయితే గుంటూరు-అమరావతి పట్టణాలు కలిసిపోతాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చుతాం.

అవకాశాలన్ని అందుకోవడంలో ‘గుంటూరు’ ముందు
‘ఐటీని అందిపుచ్చుకుని విదేశాలకు వెళ్లిన వారిలో గుంటూరు వాసులు ఎక్కువ. అందరికంటే ముందుండే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇతర దేశాల్లో మాదిరి రాష్ట్రంలోనూ స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టిస్తాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను గతంలో గుంటూరులో ఏర్పాటు చేశాం. అది బ్రహ్మాండంగా పని చేస్తోంది. ఇక ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, సుపరిపాలన ప్రభుత్వం చేస్తుంది… వాటిని మీరు ముందుకు తీసుకెళ్లాలి. నిర్మాణ రంగంలో మన రాష్ట్రాన్ని మించిన పాలసీ ఉండదు. వీలైనన్ని నిబంధనలు సరళతరం చేశాం.

రాబోయే రెండు నెల్లలో డ్యాష్ బోర్డు తెస్తాం. మీరు తెచ్చిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తాం. నిర్ణీత సమయానికే అనుమతులు ఇస్తాం… ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడకుండా ఉండాలి. ఇప్పటిదాకా నిదానించిన నిర్మాణరంగాన్ని నిలబెడుతున్నాం.. ఇంకా మీరే నడవాలి… పరుగెత్తాలి. గతాన్ని మర్చిపోండి. నిర్మాణ రంగంలోనూ నూతన ఆవిష్కరణలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకుంటే రూ.500 సంపాదించేవాళ్లు రూ.1,500 సంపాదించవచ్చు.

దేశంలో అమరావతి లాంటి కొత్తనగరం రాదు
‘దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదు. కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తాం. ఒక్క అమరావతినే కాదు విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలను అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో పట్టణాభివృద్ధి జరిగి మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాలి. అనధికారిక నిర్మాణాలు చేపట్టవద్దు. ఇసుకను ఉచితంగా ఇస్తాం. ఎక్కడా ఇసుక అక్రమ రవాణాను అనుమతించం. దీనిపై ఇప్పటికే కలెక్టర్ల, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాం. అధికారులు తప్పు చేసినా క్షమించను.’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

LEAVE A RESPONSE