-బండి సంజయ్ కు గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొర
-ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరుతూ వినతి
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొంటూ గాంధీ ఆసుపత్రి 4వ తరగతి ఔట్ సోర్సింగ్ సిబ్బంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి మొర పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పలువురు సిబ్బంది ఈ మేరకు బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు.
కోవిడ్ సమయంలో ఏ ఒక్కరూ గాంధీ ఆసుపత్రిలో సేవలందించేందుకు సిద్ధంగా లేని సమయంలో తాము ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరు నుండి తమను ఉద్యోగాల నుండి తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు.