– నీళ్లు నమిలిన కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులు
విజయవాడ: నగరంలో పేపర్ బ్లాక్స్ పేరుతో జరుగుతున్న అవినీతి దందా పై పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టి సారించారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వెలుగు చూడటంతో 39వ డివిజన్ లో ఏర్పాటు చేసిన శంకు స్థాపన కార్యక్రమంలో అధికారుల్ని సుజనా ప్రశ్నించారు.
పేపర్ బ్లాక్స్ పేరుతో నిధులు దుర్వినియోగం జరుగుతున్నట్టు తెలియడంతో, శంకు స్థాపనకు ముందే వాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు గురించి సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ సివిల్ డిపార్ట్మెంట్ నిపుణులతో సుజనా చర్చించారు.
శంకు స్థాపన జరిగే ప్రాంగణంలో పనులు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. 48లక్షలతో పేపర్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అంచనాలు తయారు చేసింది ఎవరని ప్రశ్నించడంతో నగరంలో గతంలో చేసిన పనులకు అనుగుణంగా కాంట్రాక్టర్ టెండర్ వేస్తే పనులు కేటాయించినట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు.
పేపర్ బ్లాక్స్ వేస్తున్న పరిణామానికి, ఖర్చుకు పొంతన లేకపోవడంతో అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ను ఎంత అదనంగా టెండర్ వేశారని నిలదీశారు. వాస్తవ ఖర్చుకు రెట్టింపు కంటే ఎక్కువ అంచనాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో చేపడుతున్న పనులు, అంచనాలపై థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయిస్తాను అని హెచ్చరించారు. అవసరమే లేని పనులకు 48 లక్షల ఖర్చు చేయడం, అది కూడా రెట్టింపు ధరతో చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా వృదా ఖర్చును అడ్డుకుని, అన్ని డివిజన్లలో గ్రామ, వార్డు సచివాలయాలకు శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికీ చాలా వార్డుల్లో అద్దె కార్యాలయాల్లో సచివాలయాలు నడుస్తున్నాయి.