Suryaa.co.in

Andhra Pradesh

పాలకుడికి ఉండాల్సింది విద్వేషం కాదు…విజన్

– రాజకీయం వేరు….అభివృద్ది వేరు
-పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం
– విభజన కంటే ఎక్కువ నష్టం జగన్ వల్ల జరిగింది
– మీడియాతో చంద్రబాబు చిట్ చాట్

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నేటికి 27 ఏళ్లు. తొలి సారి ముఖ్యమంత్రిగా 27 ఏళ్ల క్రితం మొదలైన ప్రయాణంపై మీడియాతో చంద్రబాబు చిట్ చాట్.మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు ఏమన్నారంటే..

తెలుగు వారు సమర్థులు, తెలివైన వారు…అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారు.27 ఏళ్ల క్రితం మొదలైన మార్పు…ఇప్పుడు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. పాలకులు చేసిన పనులు చరిత్రలో ఉన్నాయి. అదే నాకు అన్నింటికంటే సంతృప్తి. నేను చేసిన ప్రతి పని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకోను…ఆ ఫలితం వారికి చేరితే అదే నాకు అదే సంతోషం.

పాలసీల వల్ల లబ్ది పొందిన వారు ఎదురైనప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది.నా పాలనలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వెల్త్ క్రియేట్ చేశాము. నాలెడ్జ్ ఎకానమీ సృష్టించాము. హైటెక్ సిటీ, సైబరాబాద్ నిర్మాణంతో పెను మార్పులు వచ్చాయి. ప్రముఖ కంపెనీలు అన్నీ కొలువుదీరాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.తరువాత కాలంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో తెలుగు వారు స్థిరపడ్డారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకతో తెలుగు యువత ఉపాధి, ఆదాయం భారీగా పెరిగింది.

ఇప్పుడు అమెరికాలో ఉన్న అమెరికన్స్ కంటే కూడా తెలుగు వారే ఎక్కువ సంపాదిస్తుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగులుగా విదేశాలకు వెళ్లిన తెలుగు వారు….సంస్థలు, పరిశ్రమలను స్థాపించారు.ఐటితో పాటు ఫార్మా, క్రీడా రంగాలను ప్రత్యేకంగా ప్రోత్సహించాము. నేషనల్ గేమ్స్ అద్భుతంగా నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించాము. స్థానిక అభివృద్దితో ఎకరా 50 వేలు ఉండే కోకాపేట భూములు 40 -50 కోట్లకు వెళ్లాయి.

ఇండస్ట్రీ తెచ్చిన ప్రతి చోటా భూమి విలువ పెరిగింది. కియా పరిశ్రమ వద్ద కూడా ఆ ఫలితం మనం చూశాం. అమరావతి మరింత ప్రణాళికతో అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేశాం. పాలకుడికి ఉండాల్సింది విద్వేషం కాదు…విజన్ అని గుర్తించాలి.అమరావతికి వచ్చిన సంస్థలను, పనులను కొనసాగించినా ఉత్తమ ఫలితాలు వచ్చేవి. జగన్ సిఎం అయిన తరువాత అమరావతి మాత్రమే కాదు…రాష్ట్రంలో అన్ని రంగాలను, వ్యవస్థలను నాశనం చేశాడు.తిరుపతిను హార్డ్ వేర్ హబ్ చేశాం….అలాంటి ప్రాంతంలో అమర్ రాజా పై వైసిపి ప్రభుత్వం దాడి చేసింది. విశాఖలో సంస్థలను తరిమేశారు.

రాజకీయం వేరు….అభివృద్ది వేరు. నేను అదే ఫాలో అయ్యాను. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం.పార్టీపై కూడా దృష్టిపెట్టి ఉండే రాజకీయంగా నష్టం జరిగేది కాదు. కానీ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే తపనే నన్ను అటువైపు నడిపించింది. విభజన కంటే ఎక్కువ నష్టం జగన్ వల్ల జరిగింది. ఇది ముమ్మాటికీ నిజం. టిడిపి అధికారంలో ఉండి ఉంటే 2029కి దేశంలో ఎపి మొదటి స్థానంలో ఉండేది. రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్లీ పునర్ నిర్మాణం చేయాల్సి ఉంది.

నేతల కోసం సీట్లు అట్టే పెట్టం… పార్టీ కోసం పోరాడితే ఉంటారు లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తాం. పొలిటికల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్ కూడా చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. టిడిపి వస్తే పథకాలు పోతాయి అని వైసిపి అసత్య ప్రచారం మొదలుపెట్టింది. సంక్షేమం గురించి వైసిపి మాకు చెప్పాల్సిన పనిలేదు. సంక్షేమం మొదలు పెట్టిందే టిడిపి. సొసైటీ పట్ల మినిమం కమిట్మెంట్ లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇప్పుడు అంతా చూస్తున్నాం. అన్యాయంగా జైలుకు వెళ్లిన వారికి పరాక్రమం వస్తుంది…ఉక్రోషం, ఆవేశం వస్తుంది. ఇప్పుడు టిడిపి కార్యకర్తల్లో అది కనిపిస్తుంది.
తప్పులు చేసి జైలుకు వెళ్లినా జగన్ కు పరివర్తన రాలేదు.

LEAVE A RESPONSE