కోడ్ వచ్చినా జగన్ కటౌట్లు తీయరా?

-అధికారులు ఏం చేస్తున్నారు?
-జొన్నాడ వంతెనపై జగన్ భారీ కటౌట్
-స్వయంగా వెళ్లి పరిశీలించిన ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్
-జగన్ కటౌట్‌తో ట్వీట్
-ప్రవర్తనా నియమావళి అమలును మొక్కుబడి తంతుగా చేయవద్దు!
-సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి!

అది తూర్పు గోదావరి జిల్లా అంబే ద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి. అక్కడ 60 అడుగుల సీఎం జగన్ భారీ కటౌట్ దర్శనమిస్తోంది. నిన్నటివరకూ అంటే ఓకే. ఆకాశమంత కటౌట్లు పెట్టినా ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. సీఎం ఫొటోలు ఎక్కడా కనిపించకూడదని ఈసీ ఆదేశాలిచ్చింది.

వలంటీర్లు పార్టీ ప్రచారంలో పాల్గొంటే ఆ పొటోలు తీసి పంపమని కోరింది. అయినా సరే అంత భారీ కటౌట్‌ను తొలగించేందుకు, జిల్లా అధికారులు భయపడుతున్నారు. ఈ విషయం అటుగా వెళ్లిన ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గమనించి, అక్కడకు వెళ్లారు. సెల్ఫీ దిగి.. ఏపీలో అమలవుతున్న ఎన్నికల నిబంధలను చెప్పకనే చెప్పారు. అటుగా వచ్చే వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్న అధికారులు.. గోడలపై రాతలు కూడా చెరిపేస్తున్న అధికారులు.. ఇంతపెద్ద కటౌట్‌ను మాత్రం ఎందుకు తొలగించలేదోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ఒక ప్రకటన విడదల చేశారు.

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మొక్కుబడి తంతుగా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధానాధికారి డా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్తున్న తనకు
కోనసీమ అంబేడ్కర్ జిల్లా జొన్నాడ వంతెన వద్ద గోదావరి నది ఒడ్డున అధికార పార్టీకి చెందిన అరవై అడుగుల కటౌట్ కనిపించిందని , జాతీయ రహదారిపై ఆ దారిన ప్రయాణించే వారందరి దృష్టిని ఆకర్షించే రీతిలో దానిని భారీగా ఏర్పాటు చేశారని డా.రమేష్ కుమార్ ఆ ప్రకటనలో వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో అత్యంత కీలకప్రదేశమైన జొన్నాడ వంతెన కూడలిలో ఎన్నికల సంచార బృందం అన్ని వాహనాలను తనిఖీ చేస్తూ కనిపించారనీ,వారు తన వాహనాన్ని కూడా తనిఖీ చేశారని , ఈ విషయంలో సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమేనని ఆయన పేర్కొన్నారు.

అయితే వాహనాలు తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కేవలం వందగజాల దూరంలో ఉన్న అధికారపార్టీ భారీ కటౌట్ వారి దృష్టికి రాకపోవడం విస్మయం కలిగించిందని , సిబ్బంది అంత పెద్ద కటౌట్ ను పట్టించుకోకుండా వదిలేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు మొక్కుబడి తంతుగా ఉందనడానికి కటౌట్ ఉదంతమే ఒక రుజువని , ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవాల్సిన అవసరం ఉందని డా.రమేష్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

దేశం అంతటా అమల్లో ఉన్న ప్రవర్తనా నియమావళి మన రాష్ట్రంలో అమలు కాకుండా ఉండటానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పౌరపంపిణీ వాహనాలపైనా , ఈసేవా కేంద్రాల్లో జారీచేస్తున్న ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలన్నిటిపైనా ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలు కనిపిస్తున్న అంశంపై విమర్శలు చెలరేగు తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వఖర్చుతో వ్యక్తిపూజను ప్రోత్సహించే ధోరణి కొనసాగితే ప్రవర్తనా నియమావళి అమలు ప్రశ్నార్థకం అవుతుందని డా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

ప్రవర్తనా నియమావళి అమలులో తాను గమనించిన వైఫల్యాన్ని ఈ విజిల్ యాప్ లో చిత్రీకరించి పోస్ట్ చేశానని, అదే విధంగా పౌరులంతా ఈ విజిల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని స్థానికంగా నియమావళి ఉల్లంఘనలను నమోదు చేయాలన్నారు.

పౌరులంతా ఈ విజిల్ ఫిర్యాదులు చేయడం మొదలుపెడితే మన రాష్ట్రం ఉల్లంఘనలలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలుస్తుందని డా రమేష్ కుమార్ ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల నిర్వహణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రతి పౌరుడు ముందుకు రావాలని , తనకు వీలయిన రీతిలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున విజ్ఞప్తి చేశారు.

Leave a Reply