Suryaa.co.in

Editorial

పిన్నమ్మ పులివెందుల.. చెల్లెమ్మ కడప..

– జగన్‌పై ‘ఫ్యామిలీ’ ఫైట్
– పులివెందుల కాంగ్రెస్ అభ్యర్ధిగా వివేకా భార్య సౌభాగ్యమ్మ?
– జగన్‌పై పిన్నమ్మను బరిలోకి దించుతున్న కాంగ్రెస్
– కడప ఎంపీగా బరిలో దిగనున్న షర్మిలారెడ్డి?
– అక్క-తమ్ముళ్ల సవాల్
– షర్మిలను ఒప్పించిన కాంగ్రెస్ నాయకత్వం
– ఎంపీ పోటీపై సందిగ్థంలో షర్మిల?
– కడప ప్రచారానికే పరిమితం కావలసి వస్తుందన్న షర్మిల
– రాష్ట్రమంతా తిరిగి జగన్ అన్నను ఓడించాలన్నదే షర్మిల ధ్యేయం
– కడపలో కొంతమేరకే ప్రచారం చేయాలని కాంగ్రెస్ సూచన
– తర్వాత చెబుతానన్న షర్మిల?
– కడప గడపలో వైఎస్ వర్సెస్ వైఎస్
( మార్తి సుబ్రహ్మణ్యం)

కడప జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబంతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత-సీఎం జగన్‌పై ఫ్యామిలీ అస్త్రం ప్రయోగించడం ద్వారా, తొలుత కడప జిల్లాలో తన బలం పెంచుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా అర్ధమవుతోంది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పులివెందుల వైసీపీ అభ్యర్ధి-ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై, ఆయన పిన్నమ్మ కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల ముందు దారుణ హత్యకు గురైన… మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, కొడుకు వరసయ్యే జగన్‌పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు నిర్ణయం కూడా జరిగిపోయిందంటున్నారు.

నిజానికి సౌభాగ్యమ్మను కడప ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టాలని ఆమె కుటుంబం భావించిందట. ఏ వివేకానందరెడ్డి హత్య సానుభూతిని అడ్డుపెట్టుకుని, గత ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి గెలిచారో.. విచారణ తర్వాత తన కుటుంబానికి పెరిగిన సానుభూతితో, అవినాష్‌రెడ్డిని ఓడించాలన్నది వివేకా కుటుంబ లక్ష్యమంటున్నారు. వివేకా హత్యతో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎలాంటి సంబంధం లేదన్న విషయం సీబీఐ విచారణతో తేలిపోయింది. పైగా తన ఇంటిమనుషులే తండ్రిని హత్య చేశారని కుమార్తె డాక్టర్ సునీత, తమ పక్కనే హంతకులు ఉంటారని ఊహించలేదని సౌభాగ్యమ్మ వెల్లడించారు.

అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా తన అన్న జగన్ రక్షిస్తున్నారని, హత్యలు చేసే వైసీపీకి ఓటు వేయవద్దని డాక్టర్ సునీత, కడపలో నిర్వహించిన వివేకానందరెడ్డి వర్ధంతి సభలో పిలుపునిచ్చారు. అప్పటి నుంచి వివేకా హత్య అంశం-ఆయన భార్య-కూతురు ఆరోపణలు, జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

అదే సభలో తన రాజకీయ అరంగేట్రం కాలమే నిర్ణయిస్తుందని, వివేకా భార్య సౌభాగ్యమ్మ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిపెంచాయి. అంతకుముందే ఆమెను కడప ఎంపీగా పోటీ చేయించాలని, షర్మిల సహా వివేకా కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈలోగా కాంగ్రెస్ నాయకత్వం షర్మిలను, కడప ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో సమీకరణలు మారాయి. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి తగిన సమయం ఉండదని ఆమె నాయకత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగితే పార్టీకి సంబంధం లేకుండా, వైఎస్ అభిమానులు-బంధుగణాలు గంపగుత్తగా షర్మిలకే ఓటు వేస్తారన్నది కాంగ్రెస్ నాయకత్వ వ్యూహంలా కనిపిస్తోంది.

నిజానికి కడపలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ, షర్మిల-సౌభాగ్యమ్మ బరిలో దిగితే వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారంతా వారికే ఓటు వేస్తారన్నది కాంగ్రెస్ నాయకత్వ అంచనాగా కనిపిస్తోంది. పైగా వైఎస్ చివరి వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్నందున.. అదే పార్టీకి ఆయన కూతురు షర్మిల నాయకత్వం వహిస్తున్నందున, జిల్లా-వైఎస్ ప్రతిష్ఠ నిలిపేందుకయినా జిల్లా ప్రజలు అమ్మ-కూతురికి ఓటు వేస్తారని కడప జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.

కాగా తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తేనే, గతంలో పోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును, సగమైనా సాధించే అవకాశం ఉంటుందని షర్మిలారెడ్డి నాయకత్వానికి విశ్లేషించారట. అయితే ఆమె వాదనతో ఏకీవించిన నాయకత్వం.. కడపలో తక్కువ సమయం కేటాయించి, రాష్ట్రంపై ఎక్కువ దృష్టి సారించాలని షర్మిలకు సూచించినట్లు సమాచారం. అయితే ఆమె దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివేకా కుటుంబ సన్నిహితులొకరు చెప్పారు. కుటుంబసభ్యులతోచర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారట.

ఇదిలాఉండగా, సౌభాగ్యమ్మను జగన్‌పై పోటీకి దింపేందుకు మాత్రం వివేకా కుటుంబసభ్యులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ‘ఆమెకు అన్యాయం జరిగింది. మరి న్యాయం జరగాలి కదా? బాధితురాలయిన ఆ కుటుంబంపై హత్యానేరం మోపేందుకు సైతం జగన్ కుటుంబం సిద్ధపడింది. ఆయన సొంత మీడియాలో వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచే కథనాలు రాసింది. ఇంత చేసిన వారికి శిక్ష పడాల్సిందే కదా? లేకపోతే ఇక న్యాయం-ధర్మం ఏముంటుంది? దేవుడు సౌభాగమ్మ ద్వారా జగన్‌ను శిక్షిస్తాడు. ఇక్కడ గెలుపు-ఓటమి కాదు ముఖ్యం. దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాలి. అంతే’’ అని వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు.

‘‘గెలుపు-ఓటమి దేవుడు చూసుకుంటాడు. వైఎస్ రాజకీయాల్లో బిజీగా ఉంటే, పులివెందులలో వైఎస్-పార్టీ మంచి చెడ్డలన్నీ వివేకానందే పులివెందులలో ఉండి చూసుకునే వారు. దానితో వివేకా కుటుంబానికి పులివుందుల మండలాలలో అంతా పరిచయమే. వారు గుర్తుపట్టని కుటుంబాలు ఉండవు. దానికితోడు వివేకాను దారుణంగా హత్య చేసిన ఆగ్రహం పులివెందుల ప్రజల్లో బలంగా ఉంది. వివేకా అసలు హంతకులెవరో, బయట వారికంటే పులివెందుల ప్రజలకే బాగా తెలుసు. పులివెందులలో ఏ గోడనడిగా, ఏ చెట్టునడిగినా చెబుతుంది. ఇప్పుడు మా పోరాటం గెలుపు-ఓటమిపై కాదు. నిజం గెలవాలి. అంతే’’ అని ఆయన విశ్లేషించారు. దీనితో పులివెందుల అసెంబ్లీ-కడప ఎంపీ సీట్లలో.. వైఎస్ కుటుంబం-వర్సెస్ వైఎస్ కుటుంబం పోటీ ఆసక్తికరంగా మారనుంది.

LEAVE A RESPONSE