Suryaa.co.in

Editorial

పోటెత్తిన ఓటు

– ఏపీలో వెల్లువెత్తిన ఓటు స్వామ్యం
– 84 శాతం పోలింగ్‌తో రికార్డు
– రాత్రి వరకూ కొనసాగిన పోలింగ్
– పెరిగిన ఓట్ల శాతంతో టీడీపీ ఖుషీ
– ఇది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతమన్న వ్యాఖ్యలు
– పక్క రాష్ట్రాల నుంచి పోటెత్తిన ఓటర్లు
– ఓటర్లపై వైసీపీ దౌర్జన్యాలు
– ఓటరును కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే
– పల్నాడులో మళ్లీ బాంబుల మోత
– కన్నాపై అంబటి అనుచరుల దాడికి యత్నం
– కాసు మహేష్, వంశీకి చుక్కెదురు
-ఎంపి లావు వాహనాలు ధ్వంసం
– నర్సరావుపేటలో ఎదురెదురు దాడులు
-గాలిలో కాల్పులు
– తాడిపత్రిలోనూ అవే దృశ్యాలు
– ఎస్పీ కారుపైనే వైసీపీ మూకల రాళ్లదాడి
– పల్నాడు కలెక్టర్ తీరుపై కూటమి అసంతృప్తి
– సరిపోని పోలీసు బలగాలు
– ఎస్పీ సమన్వయం భేష్
– స్వార్వత్రిక ఎన్నికలు పీస్ ‘ఫుల్’
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరగవేమోనన్న సీఎం జగన్ అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించింది. పల్నాడు జిల్లా, అనంతపురంలో మినహా ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు. అయితే చాలా జిల్లాల్లో స్థానిక సీఐ, ఎస్‌ఐలు అధికార పార్టీకి కొమ్ముకాశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్వయంగా ఓటరుపై దాడి చేయడం, దర్శిలో టీడీపీ అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మిపై హత్యాయత్నం, సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి అనుచరుల దాడి యత్నం, మాచర్లలో టీడీపీ అభ్యర్ధి కారు దహనం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

ప్రధానంగా రాత్రి కడపటి వార్తలు అందే సమయానికి 84 శాతం వరకూ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. పోలింగ్ కోసం ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 10 లక్షల మంది ఏపీకి తరలివెళ్లారు. బెంగళూరు, చెన్నైతోపాటు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో, తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవటం, ఈసారి ఎన్నికల్లో విశేషం. పెరిగిన ఓటింగ్ శాతంపై టీడీపీ ఖుషీతో కనిపిస్తోంది.

ఆ మేరకు కూటమికి 125 నుంచి 135 సీట్ల వరకూ రావచ్చని పార్టీ వర్గాల అంచనా. ప్రధనాంగా కొత్త ఓటర్లు, మహిళలు, యువకుల సంఖ్య పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువగా కనిపించడమే దానికి కారణం. ఇప్పటికే 5 లక్షలమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా, తమ ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ పులివెందులలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ అమరావతిలో, జనసేనాధిపతి పవన్ మంగళగిరిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పోలింగ్‌బూత్‌లో ఓటరుపై చేయి చేసుకున్న ఘటన, కీలకమైన పోలింగ్ సమయంలో వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఆ ఘటన సోషల్‌మీడియా ద్వారా రాష్ట్రమంతటికీ తెలిసిపోవడంతో, ఓటర్లు వైసీపీపై భగ్గుమన్నారు. ఫలితంగా ఈసీ ఆదేశాలతో ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేశారు. దర్శిలో టీడీపీ అభ్యర్ధి లక్ష్మిపై వైసీపీ కార్యకర్తలు హత్యాప్రయత్నం చేసిన వైనం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయా కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమె ధర్నా చేశారు.

సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నాపై, మంత్రి అంబటి అనుచరులు దాడికి యత్నించిన వైనం ఉద్రిక్తతకు దారితీసింది. స్కూలు లోపలి నుంచి కన్నా వాహనంపై రాళ్లు వేశారు. ఇక మాచర్లలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారును వైసీపీ మూకలు తగులబెట్టారు. మహిళలని కూడా చూడకుండా దాడులు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరులు పట్టణంలో స్వైరవిహారం చేయడంతో, పోలీసులు వారిని గృహనిర్బంధంలో ఉంచారు.

అటు నరసరావుపేటలో కూడా ఘర్షణలు చెలరేగాయి. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆసుపత్రిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేయగా, టీడీపీ అభ్యర్ధి డాక్టర్ అరవిందబాబు కారుపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దానితో గోపిరెడ్డిని గృహనిర్బంధం చేశారు. ఎంపి అభ్యర్ధి లావు కృష్ణదేవరాయలు వాహనాలనూ ధ్వంసం చేశారు.

కాగా గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై, స్థానికంగా టీడీపీ కార్యకర్తలు తిరగబడిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతపురం జిల్లా తాడి పత్రిలోకూడా ఘర్షణలు చెలరేగాయి. టీడీపీ-వైసీపీ అభ్యర్ధులిద్దరు ఎదురెదురుగా నిలబడటం, వారి వెనుక అనుచరులు భారీ సంఖ్యలో చేరటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి హటాత్తుగా ఎదురైన రాళ్ల దాడికి ఎస్పీ వాహనం కూడా దెబ్బతింది.

పల్నాడు కలెక్టర్‌పై కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనలో తమకు ఎలాంటి సహకారం కనిపించలేదని విమర్శించారు. ఎక్కువ బలగాలు కావలసి ఉన్నా, ఆ మేరకు రప్పించలేకపోయారని టీడీపీ నేతలు చెప్పారు. అయితే ఎస్పీ మాత్రం సమన్వయంతో వ్యవహరించి, తమ ఫిర్యాదుకు స్పందించారని చెబుతున్నారు. నిజానికి ఉన్న బలగాలను మాచర్లకు పంపించారు. దానితో నరసరావుపేటలో ఘర్షణలు నివారించలేకపోయారు. ఫలితంగా పోలీసులు గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది.

LEAVE A RESPONSE