Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల ఆస్తిపై జగన్‌ పెత్తనం ఏంటి?

-జగన్‌ పాలనపై ఉద్యోగుల్లో పెద్దఎత్తున వ్యతిరేకత
-పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పొడిగించాలి
-మోదీ రాష్ట్ర పర్యటనకు విశేష స్పందన
-బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం

జగన్‌ పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 13న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో బీజేపీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్లలో దేశం కోసం మోదీ ఏమి చేశారో ఈ సాంగ్‌ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. అనకా పల్లి, రాజమండ్రి మోదీ పర్యటన అనంతరం ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.

జగన్‌కు భయం పట్టుకుందన్నారు. ఉద్యోగులు కూడా ఈ అవినీతి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారని, ఎన్నడూ లేనంత గా పోస్టల్‌ బ్యాలెట్‌కు ముందుకు వచ్చి పెద్దఎత్తున వినియోగించుకుంటున్నారని వివరించారు. వారు కూటమికి మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఇచ్చారని, ఇంకా పొడిగించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాల్లో జరిగిన అవకతవక లకు రాష్ట్ర ఎన్నికల అధికారులు బాధ్యత వహించాలని కోరారు.

ప్రజల ఆస్తిపై జగన్‌ పెత్తనం ఏంటి…
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అనేది జగన్‌ సొంతానికి వినియోగించుకుంటున్నారు. ఆయన ఫొటో పెట్టుకున్నారు. అసలు ఒకరికి సంబంధించిన ఆస్తి పట్టాలపై జగన్‌ పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. రైతులు లోన్స్‌ తీసుకోవాలంటే జగన్‌ పర్మిషన్‌ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో సంబంధం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాకమన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు ఇవ్వకుండా జగన్‌ పక్కదారి పట్టించి మోసం చేశాడని ఆరోపించారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు చెప్పారు. బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ కేశవ్‌ కాంత్‌ మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా మోదీ అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తరువాత విజయవాడలో తొలిసారిగా పర్యటించనున్నారని, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జన ప్రభంజనంతో భాగస్వాములు కానున్నారని తెలిపారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ సాంగ్‌ను విడుదల చేయటం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో సోషల్‌ మీడియా కో కన్వీనర్లు అభిలాష్‌, సతీష్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE