Suryaa.co.in

Political News

లోక్ సభ ఎన్నికలపై ‘5 రాష్ట్రాల’ ప్రభావమెంత ?

(ఎస్.కె.జకీర్)

ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్నవి.అయితే ఏ మేరకు ప్రభావం ఉంటుందన్న అంశంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతున్నది.కాంగ్రెస్‌ను చావు దెబ్బతీయడం ద్వారానే బిజెపి 2014,2019 లలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి దెబ్బతింటుందని ఆశించిన ప్రతిపక్షనాయకులు భంగపడ్డారు.
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఓడించడానికి కూడా ప్రతిపక్షాలు అత్యుత్సాహంతో చర్చలు జరిపాయి.కానీ తాజా ఫలితాలతో మోడీకి ‘ప్రత్యామ్నాయ’ కూటమిని నిర్మించే విషయంలో పలువురు ప్రాంతీయ పార్టీల నాయకులు డైలామాలో పడ్డారు.

యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలు వ్యూహరచన ప్రారంభించాయి.సమాజ్‌వాది పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పాటు చిన్నా చితక పార్టీలతో చేతులు కలిపినా,అగ్రవర్ణాల ఓట్లను చీల్చేందుకు ప్రియాంకాగాంధీ ఉధృత ప్రచారం చేసినా,బిఎస్‌పి ఒంటరిగా పోటీ చేసినా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి రాకుండా నిలువరించలేకపోయినవి.

తనకు ప్రధాన ప్రత్యర్థి అయినా జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను చావు దెబ్బతీసిన తర్వాత బిజెపి ప్రాంతీయ పార్టీలపై దృష్టి పెట్టింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీకి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. బిజెపి దెబ్బకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ తట్టుకోలేకపోయాయి. ఒడిషాలో నవీన్ పట్నాయక్ రాజ్యంలోనూ బిజెపి బాగా చొచ్చుకుపోయింది. తెలంగాణలో పాగా వేయడానికి అవసరమైన చర్యలన్నింటినీ బిజెపి మొదలుపెట్టింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెలరేగిపోతున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ పదే,పదే ‘సైకలాజికల్ వార్’సాగిస్తున్నారు.

ఎంపీ సంజయ్ టీబీజేపీ అధ్యక్షునిగా రెండేండ్లు పూర్తి చేసుకున్నారు.వలసలపై ఆయన బృందం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.దీనికి సంబంధించిన ‘కార్యాచరణ ప్రణాళిక’ను అమలు చేయడానికి గాను ‘చేరికల కమిటీ’ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు,క్రియాశీల కార్యకర్తలు,నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉన్న నాయకులలో ‘అసమ్మతి’తో ఉన్న వారిని గుర్తించడం,వారితో రాయబారం నడపడం,మంతనాలు జరిపి ఆకర్షించడం,వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తామే అధికారంలోకి వస్తున్నట్టు విశ్వాసం కల్గించడం వంటి కార్యాచరణ నడుస్తున్నది.

యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు తెలంగాణ బీజేపీకి ‘అద్భుతమైన’టానిక్ లా లభించాయి.ఇదే ఊపుతో దూకుడుగా తెలంగాణలో స్వైరవిహారం చేయాలని బీజేపీ అనుకుంటున్నది. ఏప్రిల్ లో అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు.2023 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేయనున్నారు.పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై అమిత్ షా ‘దిశా నిర్దేశం’ చేయనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

బిజెపి వల్ల తమ ఉనికికే ముప్పు ఏర్పడుతుందని ప్రాంతీయపార్టీలు అభిప్రాయపడుతున్నాయి.నాన్ బీజేపీ పార్టీల పాలిత రాష్ట్రాలలో దాదాపు ‘సమాంతర పాలన’ సాగించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం,రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను హరించడం లేదా కత్తెర వేయడం వంటి ఘటనలతో ప్రాంతీయ పార్టీలలో అలజడి ఉన్నది.కేసీఆర్,మమతా బెనర్జీ,స్టాలిన్,ఉద్ధవ్ థాక్రే తదితర ముఖ్యమంత్రులు బీజేపీపై సీరియస్ గా ఉన్నారు.

జాతీయస్థాయిలో ఏకమయ్యేందుకు పూనుకున్నాయి. అయితే ఇంటగెలిచిన తర్వాతే రచ్చగెలవవలసి ఉన్నది. ప్రాంతీయపార్టీలు తమ రాష్ట్రంలో భంగపడి, జాతీయ రాజకీయాల్లో ‘కనుమరుగైన’ ఉదంతాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తమ రాష్ట్రాల్లో అన్నిపార్లమెంటు సీట్లూ గెలవడం అసాధ్యం. ప్రతిసారీ 200 సీట్ల వరకు గెలుచుకోవడం ప్రాంతీయ పార్టీలకు సులభం కాదు. ఒకవేళ గెలిచినా వైరుధ్యాల మూలంగా జాతీయస్థాయిలో అవి ఏకంకాలేవన్న అభిప్రాయం ఉన్నది.తెలంగాణాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీలతో టిఆర్ఎస్ తలపడబోతున్నది. తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకే, ఏపీలో టీడీపి, వైసీపీలాగా ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు పరస్పరం తలపడుతున్నవి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘అగ్నిపరీక్ష’ నుంచి గట్టెక్కారు. సాగుచట్టాలను ఉపసంహరించుకోవడం ఎన్నికల వ్యూహమేనాని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు చెబుతున్నవి.తన నాయకత్వానికి, వ్యూహరచనా పటిమకు సవాలుగా మారిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడం మోడీకే సాధ్యపడింది.మరెవరికీ ఇలాంటి ఫలితాలు తీసుకురాగల శక్తి,సామర్ధ్యాలు లేవు.మోడీకి తోడుగా అమిత్ షా,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వలన ఈ ఫలితాలు వచ్చాయి.

దేశంలో బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పడినప్పుడే రాజకీయాల్లో గుణాత్మక మార్పువస్తుందని 2018 మార్చిలోనే కేసీఆర్ పశ్చిమబెంగాల్ వెళ్లి ప్రకటించారు.కానీ 2019 ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలు దాదాపు 190 సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిపోవడంతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి.

మోడీకి ‘ప్రత్యామ్నాయం రూపొందించడానికి జరుగుతున్న సన్నాహాలకు యూపీ ఫలితాలతో ‘బ్రేకు’ పడినట్లే భావించాలి. ప్రతిపక్షాల శిబిరంలో కదలికలు కొంతకాలం నిలిచిపోవచ్చును.5 రాష్ట్రాల ఫలితాల నుంచి ఆ శిబిరం తేరుకోవలసి ఉన్నది.2018లో కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా బిజెపిని కాంగ్రెస్ ఓడించింది. తాము పుంజుకుంటున్నట్టు కాంగ్రెస్‌ భావించింది.

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పొత్తుల గురించి ప్రయత్నించని కారణంగా పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో మిత్రపక్షాలను తయారుచేసుకోలేదు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి–అప్నాదళ్ కూటమికి వ్యతిరేకంగా సమాజ్‌వాది పార్టీ, బహుజనసమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ మహాఘట్ బంధన్ పేరుతో పోటీ చేస్తే కాంగ్రెస్ ఏకాకిగా మిగిలిపోయింది.

2019 లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి కూటమి మొత్తం 80 లోక్ సభ స్థానాలలో 62 సీట్లు గెలుచుకున్నది.కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా వచ్చిన సీట్లు 52 మాత్రమే.అంటే ఒక్క యూపీ నుంచి బీజేపీ సాధించిన స్థానాల కన్నా ఇంకా పది స్థానాలను తక్కువగా కాంగ్రెస్ గెలుచుకోగలిగిందీ ఆంటే ఆ పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్‌లో బిజెపి 17 సీట్లు సాధించింది.

గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలలో దాదాపు అన్ని సీట్లు గెలుచుకోవడంతో పాటు మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకు 28 సీట్లను కొల్లగొట్టింది. 437 సీట్లకు పోటీ చేసిన బీజేపీ 303 సీట్లు కైవసం చేసుకోవడం ఒక అద్భుతమైన ఘట్టంతర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో ప్రజల తీర్పును బిజెపి తారుమారు చేసిపారేసింది. ఆ ప్రభుత్వాలను పడగొట్టి కాంగ్రెస్‌ను మరింత బలహీనపరిచింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లోని 140 లోక్ సభ స్థానాలలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరాటం ఉంటుంది. పంజాబ్, అస్సాం, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్యరాష్ట్రాలు తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ కనీసం 50 నుంచి 60 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు ఒక అంచనా ఉండేది.

ఈ 5 రాష్ట్రాల ఫలితాల మూలంగా కాంగ్రెస్ ‘ఐసీయు’లోకి వెళ్ళిపోయింది.కొత్త రాష్ట్రాల సంగతి పక్కనపెడితే తాము అధికారంలో ఉన్న పంజాబ్ ను సైతం కోల్పోవడం విషాదం.ఈ 200 సీట్లలో కాంగ్రెస్ కనీసం వంద సీట్లు గెలుచుకోగలిగితే బీజేపీ వ్యతిరేక ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ కీలక పాత్ర పోషించవచ్చునని కొందరు ఆశావహులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ దగ్గర అలాంటి పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్టు మనకు కనిపించడం లేదు.

గతంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటులో ‘కింగ్ మేకర్’గా వ్యవహరించిన లెఫ్ట్ పార్టీలు తమ ఉనికి చాటుకోవడానికే తంటాలు పడుతున్నవి.భారత రాజకీయాల్లో ఇదొక విషాదం.2019లో మొదటిసారి ప్రాంతీయ పార్టీల ఓట్ల శాతం 44కు పడిపోయింది. బిజెపి సాధించిన 37.5 శాతం కంటే ప్రాంతీయ పార్టీల ఓట్ల శాతం ఎక్కువే. కాంగ్రెస్ మాత్రం 2014,2019 ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లతో కుంగిపోతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు పశ్చిమబెంగాల్‌లో ఘోరంగా దెబ్బతిన్నాయి. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో అవి కలిసి పోటీ చేశాయి. అందువల్ల అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది.

జాతీయస్థాయిలో తాను కూడా కీలకమని పంజాబ్ ఫలితంతో ఆప్ కేజ్రీవాల్ భావించడంలో తప్పు లేదు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొట్టడం ఎలా? అన్నది అన్ని ప్రాంతీయ పార్టీలకూ పెద్ద ఛాలెంజ్ !!

LEAVE A RESPONSE