నాటి సోవియట్ యూనియన్ లో జాతుల సమస్య పరిష్కారమయ్యిందని భావించాం. కానీ, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఏం చెబుతున్నది!
నేను 1972లో కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షించబడ్డాను. 1917 నాటి అక్టోబర్ మహావిప్లవం ప్రపంచ పరిణామక్రమాన్ని మూలమలుపు తిప్పింది. నేను కమ్యూనిస్టుగా అయ్యే నాటికి అంటే అక్టోబర్ మహావిప్లవం తర్వాత 55 సం.ల కాలంలో సోషలిస్టు వ్యవస్థ సాధించిన ప్రగతి, ప్రపంచంపై మార్క్సిజం – లెనినిజం ప్రభావం, అత్యంత ప్రభావశీలంగా వృద్ధి చెందుతున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, వివిధ దేశాల విప్లవోద్యమాల చరిత్ర, మానవాళి అభివృద్ధిని వేగిరపరచిన పరిణామ క్రమం, సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఆ చరిత్రను మా హెడ్మాస్టర్ యం.సి.ఆంజనేయులు గారు పూసగుచ్చినట్లు ఉత్తేజకరంగా వివరించారు. అవి నా మెదడులో బలంగా వెళ్ళూనుకొన్నాయి.
యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యు.ఎస్.ఎస్.ఆర్.)లో జాతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమైపోయిందని నాడు మా హెడ్ మాస్టర్ తెలియజేశారు. తర్వాత నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్.), సీపీఐలో వివిధ స్థాయిల్లో పని చేసినప్పుడు ఆ భావన బలపడింది. సోవియట్ యూనియన్ కు వెళ్ళాను. ముఖ్యంగా మాస్కోకు రెండు మూడు సార్లు వెళ్ళాను. అలాగే, నాటి సోషలిస్టు దేశాల్లో యు.ఎస్.ఎస్.ఆర్.తో పాటు చైనా, క్యూబా, జి.డి.ఆర్., చెకోస్లోవేకియా, పోలెండ్, బల్గేరియా, హంగారీ, ఉత్తర కొరియా, మంగోలియా, ఆప్ఘనిస్తాన్ మరియు సైప్రస్, థాయిలాండ్, పాకిస్తాన్, తదితర దాదాపు పదిహేను దేశాలకు వెళ్ళి, విద్యార్థి – యువజన సభలు, మహాసభలు, ఉత్సవాలలో పాల్గొన్నాను. సోషలిస్టు వ్యవస్థ సాధించిన ప్రగతిని కళ్ళారా చూసే సదవకాశం నాకు లభించింది.
జాతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యిందన్న భావన ఒక భ్రమ మాత్రమేనని నేడు రూఢీ అయ్యింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. జాతుల సమస్య పరిష్కరించబడలేదు కదా, కనీసం జాతుల మధ్య సుహృద్భావ సంబంధాలు కూడా స్థిరపడలేదని 1991 తర్వాత పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా రష్యా – ఉక్రేయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ఆజ్యం పోసిన అంశాలలో జాతుల ఆధిపత్య పోరు కూడా అత్యంత కీలకమైన అంశమని బోధపడుతున్నది. దీన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే. అయినా, చరిత్ర నుండి సరియైన పాఠాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కదా!
చివరిలో నాకు కమ్యూనిస్టు భావజాలాన్ని బోధించిన అమరజీవి యం.సి.ఆంజనేయులు గారిని గురించి ఒక్క మాట. ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేస్తూ, కమ్యూనిస్టు కార్యకలాపాలలో పాల్గొని, ఉద్యోగం కోల్పోయి, వృత్తి విప్లవకారుడుగా మారి, అజ్ఞాతలోకి వెళ్ళి ఉద్యమ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన తర్వాత రాజంపేట గ్రామ మేజర్ పంచాయితీకి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అటుపై బి.ఇడి. చదివి, సైన్స్ టీచర్ ఉద్యోగంలో చేరి, కొంత కాలం తర్వాత హెడ్ మాస్టర్ గా పదోన్నతి పొంది మా హైస్కూల్ కు వచ్చారు. కడప జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.
టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు