Suryaa.co.in

Andhra Pradesh

క్రూయిజ్‌ టూరిజం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?

– లోక్‌సభలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి
– సమాధానమిచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఢిల్లీ: దేశంలోని ఐల్యాండ్స్‌, తీరప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా క్రూయిజ్ టూరిజాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వివరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. సోమవారం నుంచి ప్రారంభం అయిన పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఆయన పలు పలు ప్రశ్నలను కేంద్రం ముందుంచారు. అందులో భాగంగా క్రూయిజ్‌ టూరిజంపై ప్రశ్నలు వేశారు.

క్రూయిజ్‌ టూరిజంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని ప్రమోషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు/కార్యక్రమాలను వివరించాలని కోరారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయాలన్నారు. అలాగే క్రూయిజ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు/కార్యక్రమాల వివరాలు, 2024-25 బడ్జెట్లో క్రూయిజ్ టూరిజంకు సంబంధించి ప్రభుత్వం సరళమైన పన్ను విధానాన్ని ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర పర్యాటక శాక మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. క్రూయిజ్ టూరిజంతో సహా పర్యాటక ప్రాంతాలు, ఉత్పత్తుల అభివృద్ధి మరియు ప్రచారం ప్రధానంగా సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత అని అన్నారు.

దానితో పాటు పర్యాటక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా, వెబ్సైట్లతో సహా వివిధ మాధ్యమాల ద్వారా పర్యాటకాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో క్రూయిస్ టూరిజం అభివృద్ధికి వీలు కల్పించే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి, సమన్వయం కోసం అన్ని ప్రధాన ఓడరేవుల ప్రతినిధులు, వాటాదారులతో పర్యాటక మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా క్రూయిస్ టూరిజంపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.

పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ఏజెన్సీలకు సహాయం’ పథకం కింద క్రూయిజ్ టూరిజం, నదుల వెంబడి పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయాన్ని అందిస్తుందన్నారు. అదనంగా, పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకం కింద కోస్టల్ సర్క్యూట్‌ ను పదిహేను మేజర్‌ సర్క్యూట్లలో ఒకటిగా గుర్తించిందన్నారు. క్రూయిజ్ భారత్ మిషన్ 2024 సెప్టెంబర్లో ప్రారంభించబడిందన్నారు.

అలాగే పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలో డిమాండ్ ఆధారిత శిక్షణా కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ 2024-25 లో దేశీయ క్రూయిజ్ షిప్ కార్యకలాపాల కోసం ప్రత్యేక పన్నుల విధానాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. దేశంలో అలాంటి నౌకలను నిర్వహించే సంబంధిత కంపెనీ నుండి స్వీకరించబడిన క్రూయిజ్ షిప్ల యాజమాన్యాలకు మినహాయింపు ఉంటుందన్నారు.

LEAVE A RESPONSE