Suryaa.co.in

Andhra Pradesh

ఇంకెప్పుడు పెడతారు ఒంటిపూట బడులు?

-ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఒక్క బడినైనా పూర్తిస్థాయిలో సందర్శించారా?
-పిల్లల ఇబ్బందులు తెలుసుకున్నారా?
-సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ బహిరంగలేఖ

30.03.2023
బహిరంగ లేఖ
*శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌
అమరావతి
విషయం : మార్చి నెలాఖరు వచ్చినా ఏపీలో మొదలుకాని ఒంటిపూట బడులు, దశాబ్ధాలుగా స్కూళ్లకు ఒంటిపూట బడుల నిర్వహణ, ఎండ తీవ్రత వల్ల పిల్లలు రోజంతా బడిలో ఉంటే అస్వస్థతకు గురయ్యే ప్రమాదం, హాఫ్ డే స్కూల్స్ నిర్వహణపై ప్రశ్నించిన టీచర్లపై మంత్రి బొత్స అవహేళన వ్యాఖ్యల గురించి….

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే పెద్దవాళ్లే భయపడుతున్నారు. అలాంటిది చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూల్లో ఎలా ఉండగలరు? మార్చి నెల ముగుస్తున్నా రాష్ట్రంలో ఒంటిపూట బడులు పెట్టకపోవడం ఏమాత్రం సమంజసం కాదనే విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోంది. కానీ మార్చి నెలాఖరు దాటిపోతున్నా ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమవుతోంది. ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులకు ఎగనామం పెట్టారని స్పష్టంగా అర్ధమవుతోంది. విద్యార్థులపై కోపాన్ని అభం శుభం తెలియని చిన్నారులపై చూపిస్తారా?

ఎండలకు పిల్లలు అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉందనే కారణంగా హాఫ్ డే స్కూల్స్ పెడుతున్నారు. దాన్ని మీరు ఎలా ఆపేస్తారు? ఏప్రిల్ నెల రానే వస్తోంది. ఇంకెప్పుడు పెడతారు ఒంటిపూట బడులు? పైగా దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటు. ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ టీచర్లను మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలినచర్య. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయి?

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఒక్క బడినైనా పూర్తిస్థాయిలో సందర్శించారా? పిల్లల ఇబ్బందులు తెలుసుకున్నారా? పట్టుమని పదిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమంటే అన్ని రోజులు మా వల్ల కాదని వైసీపీ నేతలు కళ్లు తేలేస్తారు. చిన్నపిల్లలు మాత్రం మండే ఎండల్లో రోజంతా స్కూళ్లలో ఉండాలా? ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి పక్కనపెట్టాలి. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలి.

-SD
అనగాని సత్యప్రసాద్
టీడీపీ శాసనసభ్యులు

LEAVE A RESPONSE