Suryaa.co.in

Features Political News

ఎవరీ కశ్మీరీ పండితులు?

కశ్మీర్ సమస్యకు కారణం అక్కడి ప్రజలు అత్యధికంగా ముస్లిములు అవటమే అని చాలా మంది తప్పుడు అభిప్రాయంతో ఉంటారు. మత సమస్యగానే కశ్మీర్ ను చూడటం పాక్షిక దృష్టి అవుతుంది. నరజాతి చరిత్ర అంతటిలో ప్రజలు పాలకులు, పాలితులుగా మారిన వర్గ విభజనలో మతం ఒక అంశం మాత్రమే.

అనేక ప్రాంతాలు, అనేక కాలాలు -రకరకాల మతాలను ఆలింగనం చేసుకొన్నట్లే కశ్మీర్ లో కూడా ప్రజలు మతాలు లేని ఆదిమ సమాజం నుండి వివిధ దశల్లో కొన్ని మతాలను ఆచరించారు. పురాణాల కథనం
kashmir-vallyప్రకారం కశ్మీర్ మూలవాసులు నాగాలు, పిశాచులు. ఈ పురాణాల చరిత్రను ఎంతవరకూ నమ్మచ్చో తెలియదు కానీ, ఈ ప్రాంత మూలవాసులు ఎవరో ఖచ్చితంగా ఉండి ఉంటారు. మతాలు లేని కాలంలో వాళ్లు జీవించి ఉంటారు.

చరిత్ర లిఖితమైన తరువాత షుమారు వెయ్యి సంవత్సరాలు బౌద్ధం కశ్మీర్ లో మనుగడలో ఉంది. తరువాత సాయుధ రూపంలో శైవం వచ్చి బౌద్ధాన్ని తొక్కివేసింది. 12వ శతాబ్దానికి ఈ శైవ అనుచరులలో ప్రబలిన అవినీతి కారణంగా ఇస్లామిక్ ప్రభావం ప్రజల్లో ఊపొందుకొన్నది.

అందరూ అనుకొన్నట్లుగా ముస్లిం రాజుల దండయాత్రల వలన కశ్మీర్ లో ఇస్లాం రాలేదు. మధ్య ఆసియా నుండి ఇస్లాం మత ప్రబోధకులు లోయలో అడుగు పెట్టారు. ఈ మత ప్రభోధకులు ప్రభావంతో కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున ఇస్లాంలోకి మారారు. పాలకులు మారటం వలన ప్రజలు కూడా చాలా వరకు ఇస్లాంను అనుసరించారు. అలా మారకుండా మిగిలిపోయిన వాళ్లే కశ్మీరీ పండితులు. వీళ్లు శైవులు. వీళ్లు హిందువులే కానీ ‘హిందుత్వ’ లో భాగం కాలేదు. మాంసం, చేపలు తినేవాళ్లు.

ఒక సూఫీ పకీరు కశ్మీర్ లో ఇస్లాం ప్రవేశానికి కారణం అని తెలుసుకొంటే ఆశ్చర్యం వేస్తుంది. బుల్ బుల్ షా అనే పకీరు ప్రభావానికిలోనై అప్పటి బౌద్ధ కశ్మీర్ రాజు రెంచన్ షా ఇస్లాం స్వీకరించాడు. నిజానికి అతను శైవుడిగా మారటానికి సిద్దం అయ్యాడు కానీ అతన్ని హిందూమతంలో అతి కింది కులంలో ఉంచుతామని శైవ ప్రతినిధులు చెప్పటంతో మనసు మార్చుకొని ఇస్లాం స్వీకరించి తన పేరును సుల్తాన్ సదృద్దీన్ గా మార్చుకొన్నాడు.

రాజును అనుసరించి అనేక మంది ప్రజలు ఇస్లాం స్వీకరించారు. హిందూమతంలో ఉన్న కుల వ్యవస్థ ఇస్లాంలో లేకపోవడం, పుట్టుకతో అందరూ సమానులే అనే ఇస్లాం భావన వారిని ఆ మతం వైపు మళ్లించింది. కొంతమంది హిందూ మతంలోనే కొనసాగినప్పటికీ సామరస్య సహజీవనం అనే సామాజిక తాత్విక చింతనను వారు ఒంట బట్టించుకొన్నారు. ఇస్లాం స్వీకరించిన కొత్తల్లో అక్కడ మసీదుల్లో ప్రార్థనలు, హిందూ భజనల మాదిరే ఉండేవి. ఉదయం అవ్రాద్ జరిగిన వెంటనే ముస్లిం ప్రార్థనలు జరిగేవని చరిత్ర కారులు చెబుతున్నారు.

అక్కడ ఇస్లాం ప్రవేశించాక; కశ్మీరీ ముస్లిములు, హిందువులు ఇరువురూ కశ్మీరీయత్ అని చెప్పే సాంస్కృతిక సమ్మేళనానికి రెండు మూల స్తంభాలుగా నిలిచారు. కాలం గడిచే కొద్దీ ఈ రెండు మతాల ప్రజల మధ్య వర్గ సంబంధాలు ప్రాతినిధ్యం వహించి వారి మధ్య అగాధాలు సృష్టించాయి కానీ, మతపరమైన విభేదాలు తక్కువనే చెప్పాలి. భారతదేశం అంతా మతకల్లోలాలతో ఎగసెగిసి పడిన కాలాల్లో కూడా కశ్మీర్ ప్రశాంతంగా ఉండింది. దానికి కారణం కశ్మీరీలు వివిధ కాలాల్లో రోమన్, గ్రీక్, పర్షియన్ సంస్కృతులతో సహవాసం చేసి; ఆయా సంస్కృతుల నమ్మకాలను, సిద్దాంతాల పట్ల సహనంగా ఉండటం అప్పటికే తెలుసుకొన్నారు. కశ్మీరీ సంస్కృతి ఎప్పుడూ వేరుబడి మొండిగా లేదు. అందరినీ కలుపుకొంటూ అది నమ్రతగా ఉంటుంది. దీనికి మహత్తర ఉదాహరణగా కశ్మీర్ అంతటా వున్న 150 దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

కశ్మీర్ లో హిందూ ముస్లిం ఐక్యతకు లాలేశ్వరీ, ఆమె శిష్యుడు షేక్ నూరిద్ధీన్ లను కారకులుగా అక్కడి ప్రజలు భావిస్తారు. లాలేశ్వరి ని వారు ప్రేమగా ‘లాల్ దెడ్’ అని పిలుచుకొంటారు. ఆమె పేరు మీద ఇప్పుడు శ్రీనగర్ లో ఒక పెద్ద ప్రభుత్వ మహిళల ప్రసూతి ఆసుపత్రి ఉంది. షేక్ నూరిద్దీన్ ను ‘నుండ్ ఋషీ’ అని పిలుచుకొంటారు. వారిద్దరినీ కశ్మీరీయత్ సంస్కృతికి కాగడాధారులుగా కశ్మీరీలు భావిస్తారు. లాలేశ్వరి చిరిగిన బట్టలతో పాటలు పాడుకొంటూ ప్రజల మీద ఆధారపడి బతుకుతూ తన తాత్వికతను ప్రచారం చేసేది. శైవాన్నీ, ఇస్లాంనూ రెండిటినీ ఆమె నమ్మింది. ఆమె ప్రచారం చేసిన హిందూ ముస్లిం సమైక్యతా భావం కశ్మీర్ అంతా ప్రతిధ్వనించేది. నుండ్ ఋషి ఆమె అనుచరుడుగా కొనసాగాడు.

15వ శతాబ్ధంలో బుడ్ షా (జైన్ ఉల్ అబిడిన్) అనే పేరు కలిగిన రాజు పాలనలో కశ్మీర్ పాలన సాగిన విధానం గమనిస్తే కశ్మీర్ లో మత సామరస్యం ఎలా కొనసాగేదో అర్ధం చేసుకోవచ్చు. ఆయనకు దూరదృష్టి, ఉదారవాద స్వభావం, న్యాయదృష్టీ ఉండేవి. ఆ కాలంలో కశ్మీరీ పండితుల వలసలు కొన్ని జరిగాయి. అంతకుముందు పరిపాలించిన రాజు సుల్తాన్ సికిందర్ అరాచకాలకు భయపడి కశ్మీర్ పండితులు ఢిల్లీ, లక్నో, బనారస్, అలహాబాద్, హైదరాబాద్ లకు వలసలు వెళ్లారు. బుడ్ షా ఈ విషయం మీద దృష్టి పెట్టి వారు మళ్లీ తిరిగి రావటానికి కావాల్సినదంతా చేశాడు. వారి ఆస్తులను వారికి క్షేమంగా అప్పగించాడు. వారు మిగతా ప్రజలతో శాంతియుత సహజీవనం చేయటానికి చేయవల్సినదంతా చేశాడు.

రాజు ప్రజలందరినీ సమానంగా చూడాలనీ, వారి మతపరమైన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వాలనే విధివిధానానికి ఆయన ఊపిరి పోసాడు. కశ్మీర్ పండితులను అప్పటి పాలక భాష అయిన పర్షియన్ నేర్చుకోమని ప్రోత్సహించాడు. వారికి పాలనా వ్యవస్థలో ఉన్నత స్థానాలు కల్పించాడు. హిందువులకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాడు. వారికి పన్నులు రద్దు చేశాడు. ప్రభుత్వంలో స్థానం పొందని పండితులకు శ్రీనగర్ లోని జోగి లంకర్ లో నివాసం ఏర్పాటు చేసి వారిని ప్రభుత్వ ఖర్చులతో పోషించాడు. వారి పిల్లలకు చదువులు నేర్పించాడు. ఈ విషయంలో బుడ్ షా మీద విమర్శలు ఉన్నా కూడా లెక్క చేయలేదు. శర్దా దేవాలయాన్ని దర్శించి అది సరిగా నడుస్తుందో లేదో అని పర్యవేక్షించాడు. అమరనాథ్ దర్గాను కూడా సందర్శించాడు.

కశ్మీర్ లో స్వతంత్ర ముస్లిం రాజులు పాలన అంతం అయ్యి, విదేశీయులు ప్రవేశించేనాటికి ముస్లిముల పరిస్థితి దయనీయం అయిపోయింది. మొఘలులు, ఆఫ్ఘనులు, సిక్కులు, డోగ్రాలు కశ్మీరీ ముస్లిములను పీల్చి పిప్పి చేశారు. సిక్కుల పాలనలో వచ్చిన హుగేల్ అనే యాత్రికుడు రాసిన దాని ప్రకారం హిందూ ముస్లిం ఐక్యత బాగా ఉండేదనీ, హిందువులు ఒకరినొకరు ‘రామ్ రామ్’ అని పలకరించుకొనేవారనీ, హిందువులు ముస్లిములను ‘సాహిబ్ సలామత్’ అని పలకరించేవారనీ, ముస్లిం హిందువుని ‘దౌలత్ జాదా’ (భాగ్యవంతుడివి అవుగాక) అని పలకరించేవారనీ, దానికి సమాధానం ‘ఉమర్ దరాజ్’ (ఆయుస్సు పెరుగుగాక) అని వచ్చేదనీ చెప్పాడు.

రంజిత్ సింగ్ కాలంలో గవర్నర్ గా నియమించిన మోతీలాల్ ఆవు వధను నిషేధించి, దానిని అతిక్రమించిన వారికి మరణ శిక్ష విధించాడు. జామా మసీద్ ను మూసివేసి ముస్లిం ప్రార్థనలను నిషేధించాడు. మసీదులకూ, దర్గాలకూ మంజూరీ అయిన భూములను వెనక్కి తీసేసుకొన్నాడు. ముస్లిములు అజా జపించకుండా అడ్డుకొన్నాడు. షా హందాన్ అనే దర్గాను నేలమట్టం చేయమని ఆజ్ఞాపించాడు. 12 శతాబ్ధాల కిందట అది కాళీమాత దేవాలయం అని వారి వాదన.

అప్పటికి ఎన్నో శతాబ్ధాలుగా ఆచరణలో ఉన్న ఆవు వధ హఠాత్తుగా మరణ శిక్షగా మారటంతో, ఎందరో ముస్లిములను ఆ వంకతో ఉరి తీశారు. శ్రీనగర్ పట్టణంలో వారిని నేల మీద ఈడ్చుకొంటూ వెళ్లారు. కొందరిని సజీవ దహనం కూడా చేశారు. ఇలా అణచివేతకు గురి అయిన అనేక మంది ముస్లిములు కశ్మీర్ వదిలి వెళ్లారు. వారిలో చాలా మంది పంజాబ్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొన్నారు.

ప్రముఖ పరిశోధకుడు ఆర్.కే పర్మూ తన పుస్తకం ‘A History of Sikh Rule in Kashmir’ లో కశ్మీరీలు సిక్కుల పాలనలో అన్ని రకాల రాజకీయ అణచివేతకూ గురి అయ్యారని రాశాడు. ఆ అణచివేత కాకుండా తరచుగా వచ్చే కరువులు కూడా వారిని హింస పెట్టాయని అన్నాడు. అయితే అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కశ్మీరీలు వారి సామాజిక సంబంధాలలో లౌకికవాద గుణాలను వదులుకోలేదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో చాలా తక్కువ ఉన్నాయని తన పుస్తకంలో రాసుకొన్నాడు.

ముసల్మానులు ఎక్కువగా బాధ పడటానికి కారణం వారు శాలువల నేతగాళ్లుగా, చేతి కళల ఉత్పత్తిదారులుగా ఉండటమేనని. కశ్మీర్ లో తమ సంస్కృతిని వ్యాపింపచేయటానికి దాదాపు అందరు సిక్కు గవర్నర్లు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారనీ చెప్పారు. జామియా మసీదు లాంటి ఎన్నో మసీదులు మూతపడి, ముస్లిం ప్రార్థనలు నిషేధానికి గురి అయిన తరువాత కూడా ముస్లిములు తమ సహనాన్ని కోల్పోలేదు. సిక్కులు అనేక గురుద్వారాలు నిర్మించుకొని, పెద్ద సంఖ్యలో సిక్కు మత బోధకులు కశ్మీర్ లో ప్రవేశించిన తరువాత కూడా కశ్మీరీలు ఆ విషయానికి పెద్ద ఇబ్బంది పడలేదనీ, దానికి కారణం వారు మత సహనం కలిగిన వర్గానికి చెందినవారవటమే.

నిత్యం వచ్చే కరువులు, ఆకలి చావులు, అధికార యంత్రాంగ వేధింపులు- ఇవన్నీ చాలా మంది రైతులనూ, శాలువా నేతగాళ్లనూ, కూలీలనూ, మేధావులనూ కశ్మీర్ నుండి పారిపోయి వారు భరించగలిగిన స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకొనేటట్లు చేసింది. అలా వలసలు వారిని ఎన్నో బాధలకు గురి చేశాయి. కశ్మీరీ కాలనీలు చుట్టుపక్కల పర్వత ప్రాంతాలైన భధర్వ, కిస్తావర్, జమ్మూ, రేయసి, పుంచ్, రజౌరి, మిర్పూర్ లలోనూ; ఇంకా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, బిలాస్ పూర్ , చంబా, మండి, రాంపుర్, నూర్ పూర్ లలోనూ; ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్, సియాల్కోట్, హోషియార్ పూర్, గుజ్రన్వాలాలలోనూ ఏర్పడ్డాయని రాశాడు.

కశ్మీర్ పండితుల వలసల గురించి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నవారు ఆ నాడు సిక్కులు, ఆ తరువాత డోగ్రాల పరిపాలనలలో ఎంతమందో కశ్మీరులు, అందులో ఎక్కువగా ముస్లిములు పొట్ట చేత బట్టుకొని కశ్మీర్ నుండి వలసలు వెళ్లిన విషయం గురించి మాట్లాడరు.

కశ్మీరీ బ్రాహ్మలు – పాలక వర్గంలో భాగం
తరువాత వచ్చిన హిందూ రాజులు తమ మత ఆచరణ కోసం హిందువులలోని బ్రాహ్మణ వర్గం మీద ఆధారపడ్డారు. తమను దేవాంశ సంభూతుడుగా ప్రచారం చేసుకోవటానికి పూజారుల అవసరం వారికి ఉంటుంది. అలా కశ్మీరీ పండితులు తమతో అధికారాన్ని పంచుకోవటంలో వారికి అభ్యంతరం కనబడలేదు.ఒకప్పుడు జమ్మూలో కశ్మీరీ బ్రాహ్మల పట్ల ఉండే భక్తి ప్రవృత్తులు, వారు కశ్మీర్ లో అనుభవించిన పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి గురించి గణేశ్ దాస్ బడెహ్రా అనే ఆయన రాశాడు.

అక్కడ బ్రాహ్మణ పల్లెలను పతోలి అని అంటారు. ఆ పతోలీలలో ఏ తిరుగుబాటుదారుడికైనా ఆశ్రయం ఇవ్వవచ్చు. ప్రభుత్వానికి కూడా ఆ పల్లెలోకి ప్రవేశించే ధైర్యం ఉండదు. ఫరా అనే ఇంకో రకమైన ఆచారం కశ్మీరీ బ్రాహ్మణుల్లో ఉండేది. ఎవరైనా ఈ బ్రాహ్మణుల కోర్కెలకు ఒప్పుకోక పోయినా, వారిని గౌరవించకపోయినా వారి ఇళ్ల ముందు వీళ్లు నిరాహారదీక్ష మొదలు పెడతారు. ఒకవేళ వాళ్లు లొంగి రాకపోతే వారి నిరసన తీవ్ర రూపం దాల్చి అక్కడికక్కడే తమని తాము కాల్చుకొంటారు. కత్తులతో పొట్టలోకి పొడుచుకొని పేగులు బయటకు లాగి రక్తస్రావంతో ఆత్మహత్య చేసుకొంటారు. ఈ తీవ్రమైన బ్లాక్ మెయిలుకు రాజులు కూడా అతీతం కాదు. తర్వాతి కాలంలో ఇది చాలా తగ్గినప్పటికీ బ్రాహ్మల పట్ల భక్తీ, భయం తగ్గలేదు. వారి ఆచారాల కొనసాగింపు అలాగే జరిగిపోయింది.

డోగ్రా రాజులు అనేక దేవాలయాలకు దానధర్మాలు ఉదారంగా చేసేవారు. కశ్మీరంతా దేవాలయ నిర్మాణాలు చేశారు. విగ్రహాలు చెక్కించారు. పూజారులను పోషించారు. కశ్మీర్ లోనే కాకుండా పంజాబ్ ప్రాంతంలో కూడా వారి ప్రతిష్టను పెంచుకోవటానికి దేవాలయాలకు ధర్మకర్తలుగా వ్యవహరించారు. కశ్మీర్ బయట దానధర్మాలకు కూడా కశ్మీర్ ధర్మావత్ నుండే డబ్బు సరఫరా అయ్యేది. అంటే మెజారిటీ ముస్లిములను పీడించి వసూలు చేసిన పన్నులతో హిందూ దేవాలయాలు నడిపారు. రణ్ బీర్ సింగ్ అయితే ఈ హిందూ మత కార్యక్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా పనిచేశాడు. అతని రాష్ట్రంలోని ప్రతి దేవాలయాన్ని తన ఆధీనంలోకి తీసుకొని వచ్చాడు. దేవాలయాల పునరుద్ధరణతో శ్రీరామ నవమి, దసరా పండుగలను పెద్ద ఎత్తున జరపేవాళ్లు.

డోగ్రాలు రాకపూర్వం ఈ పండుగలు ఎప్పుడూ కశ్మీర్ లో జరగలేదు. రాముడి ఆరాధన వ్యవస్థ కశ్మీరీ ప్రజల నమ్మకాల మీద పడింది. దాని కోసం డోగ్రాలు కశ్మీరీ పండితుల సహాయం తీసుకొన్నారు. ధర్మవత్ నిధి నుండి వారికి జీతాలు చెల్లించారు. రణ్ బీర్ సింగ్ కాలంలో మొదలయ్యి ప్రతాప్ సింగ్ కాలంలో ముగిసిన ఖీర్ భవాని దేవాలయంలో దేవత ‘రామరాజ్యాన్ని’ ప్రసాదిస్తుందని వర్ణించేవారు.

హిందూ రాజులుగా మారటానికి డోగ్రాలు రాజపుత్రులుగా తమకు తాము ప్రాతినిధ్యం వహించారు. డోగ్రా రాజులు కశ్మీరీ ముస్లిములను దూరం చేయటానికి గల కారణాలను అర్థం చేసుకోవటానికి ఈ కొత్త మతపర నిర్వచనాన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యానికి వచ్చిన ఈ ‘హిందూ’ స్వభావం కశ్మీరీ బ్రాహ్మణులను దానికి దగ్గర చేసింది. ముస్లిములను దూరం చేసింది. రాజుల పాలంలో కశ్మీర్ మెల్లిగా ‘సాంప్రదాయక భారతం’గా మిగిలి పోయింది. ఈ సాంప్రదాయ భారతం తరువాత కాలంలో ‘హిందూ భారతంగా’ కూడా మారిపోయింది

కశ్మీర్ ముస్లిం రైతుల, నేతపనివారల వీపుల మీద సంపద పోగు చేసుకొన్న డోగ్రా రాజుల పరిపాలన వారిని పాలనాపరమైన అధికారాల నుండీ, కశ్మీర్ వనరులను అనుభవించటం నుండీ దూరం చేసింది. ఎప్పుడైతే వారి స్వాతంత్ర్య కాంక్ష ప్రబలి, మాతృభూమిలో తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారో వారిని ముస్లిములు అన్న కారణంగా మత ఉద్దేశాలను అంటగట్టటం ప్రారంభం అయ్యింది. ఎక్కడైతే ప్రజల చర్యలు, వారి పనులు, ఉద్దేశ్యాలు -వారి వారి మత అస్తిత్వంతో నిర్ణయించబడతాయో అక్కడ ఆ ప్రజలు ఎక్కువ బాధ పడతారు. ముస్లిములు కశ్మీర్ లో చేసిన ప్రతి రాజకీయ తిరుగుబాటుకు అసలు కారణాలు వెతకకుండా వాటికి మత ప్రేరణ అంటగట్టారు. 20వ శతాబ్ధం మొదట్లో కశ్మీరీలలో రాజకీయ కదలిక ప్రారంభం అయ్యాక జరిగిన అన్ని పోరాటాలకు మతాన్ని కలిపి మాట్లాడటం కొంతమంది చరిత్రకారులు చేశారు.

‘కశ్మీరైత్’ అనే పదం కూడా ఈ కాలంలోనే కాయిన్ అయ్యింది. మత సంబంధమైన చిల్లర ద్వేషాలకు అతీతంగా, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా ఆ పదాన్ని వాడటం మొదలుపెట్టారు. ‘కశ్మీరీ అయి ఉండటానికి’ ఇచ్చిన అనేకానేక అర్థాల్లో ఈ కశ్మీరైత్ పదం ఒకటి. పురాతన కాలం నుండి భారత భూఖండంలో మనకు గొప్పగా సంక్రమించినట్లు చెబుతూ వస్తున్న మతాతీత స్వభావానికి ఈ పదాన్ని విశ్లేషణగా చెబుతారు. ‘కొన్ని రాజకీయ, చారిత్రక కాలాల్లో మాత్రమే ఈ కశ్మీరైత్ పదాన్ని వాడటం విశేషం’ అంటారు చరిత్రకారిణి మృదీ రాయ్. ఒక మత ప్రజల, అదీ కశ్మీర్ లో మెజారిటీ మత ప్రజల ప్రయోజనాలను పూర్తిగా అణగదొక్కి ఇలాంటి పద ప్రయోగాలు చేసి, దాని అర్థాన్ని మోయాల్సిన బాధ్యత పూర్తిగా ఆ అణగదొక్కబడిన ప్రజల మీదనే మోపటం ఒక విషాదం. కశ్మీర్ చరిత్రను చదువుతుంటే ఈ ‘కశ్మీరైత్’ పదం రాజకీయంగా ‘ఒట్టి’ మోసకారి పదంగా ఎలా మిగిలి పోయిందో అర్థం అవుతుంది.

ఆధునిక కశ్మీర్ లో కులీన ముస్లిముల మొదట డిమాండ్ రాష్ట్ర పరిపాలనలో ముస్లిముల శాతం పెంచమని. కశ్మీరీ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తట్టుకోవటానికి ఈ డిమాండ్ చేశారు. డిమాండ్ అని కూడా అనలేమేమో ఆ కాలంలో. కోరిక అనవచ్చు. రెండవది కశ్మీరీ ముస్లిములకు చదువు చెప్పించాలనేది. స్కూల్ ఇన్స్పెక్టర్లుగా, టీచర్లుగా ముస్లిముల సంఖ్య పెరిగితే వారు ముస్లిం విద్య పట్ల ఆసక్తి చూపిస్తారని వారి భావన.

ఇంకో వైపు స్థానిక కశ్మీరీ పండితులకూ, ప్రవాసం వెళ్లిన కశ్మీరీ పండితులకు మధ్య ఘర్షణ వచ్చింది. వివిధ కాలాల్లో కశ్మీర్ ఎదుర్కొన్న అణచివేత కారణంగా సిక్కుల కాలం ముందు నుండే ఎంతో మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. వారిలో కశ్మీరీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం కూడా అలా వెళ్లిపోయిందే.

ఇలా వెళ్లిన కశ్మీరీ బ్రాహ్మణులు, వాళ్ల బ్రాహ్మణుల హోదాను వదులుకోకుండా కొత్త సాంఘీక పరిస్థితులలో ఇమిడిపోయారు. నిజానికి అక్కడి స్థానిక బ్రాహ్మణుల కంటే తాము స్వచ్చమైన వారిమని చెప్పుకొనేవారు. ఇతర భారత భూభాగాలలో ఉన్న పోటీ వలన వీళ్లు తప్పనిసరిగా శాఖాహారులుగా మారాల్సి వచ్చింది. ముస్లిములు వండిన భోజనాన్ని తినకూడదనే నియమం కూడా వీరిలో వచ్చింది. నిజానికి పై రెండు ఆచరణలు కశ్మీరీ బ్రాహ్మణుల్లో లేవు. ఇలా మారిపోయిన ఇతర ప్రాంతాల కశ్మీరీ బ్రాహ్మణులు, తమ స్వస్థలంలో ఉన్న కశ్మీరీ బ్రాహ్మణులు ముస్లిములతో కలిసిపోయి చెడిపోయారనే అభిప్రాయంతో ఉండేవారు. వీళ్లను సంస్కరించాలని కూడా అనుకొనేవాళ్లు. ఇక్కడ కశ్మీర్ లో కశ్మీరీ బ్రాహ్మణులు వెళ్లిపోయిన వారికి చనిపోయినట్లు మతకాండలు ఎప్పుడో జరిపేశారు.

1872 ప్రాంతంలో ప్రవాస కశ్మీరీ బ్రాహ్మణుడు పండిత్ శేయోనరైన్ కశ్మీర్ లోయను చూడటానికి వచ్చాడు. కశ్మీర్ తో పునర్ సంబంధాలు కుదుర్చుకోవటం అతని ఉద్దేశ్యం. అప్పటి రాజు రణభీర్ సింగ్ తో భేటీ అయ్యాడు. అక్కడ ఉన్న కశ్మీరీ బ్రాహ్మణులను సంస్కరించాలని అభిలాషను వ్యక్తం చేశాడు. ఈ ప్రతిపాదన స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులలో చాలా కలకలం లేపింది. వారి స్థానికత్వం, మత సంబంధ ఆచారాల మీద దాడిగా దీన్ని వారు భావించారు.

స్థానిక కశ్మీరీ బ్రాహ్మణుల బాధ కేవలం వారి మత విధానం గురించి మాత్రమే కాదు. అప్పటికే పాలనారంగంలో తిష్ట వేసుకొని ఉన్న తమ ప్రాబల్యానికీ, తమ ఆర్థిక ఆధిపత్యానికి దెబ్బ తగులుతుందని కూడా. కశ్మీర్ లోయను కష్టకాలాల్లో కూడా వదలకుండా ఉన్న తమకు ప్రాధాన్యత ఉండాలని భావించారు. బయటకు వెళ్లిన బ్రాహ్మణులు కూడా పంజాబ్, అవధి ప్రాంతాల్లో పాలనరంగంలో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు. వ్యాపారాలు చేశారు.

అయితే స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులు భయపడినంతా అయ్యింది. 1889లో ఏర్పాటు అయిన రాష్ట్ర విధాన సభలో ఒక సీనియర్ పోస్ట్ ను ప్రవాస కశ్మీరీ బ్రాహణుడికి ఇచ్చారు. ఇది స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. కానీ 1931 నాటికి నెహ్రూ సిఫార్సుతో నేషనల్ కాంగ్రెస్స్ లో స్థానం సంపాదించుకొని లోయలో స్థిరపడటం మొదలుపెట్టారు.

చరిత్ర పరిశీలనను ఇప్పటి కళ్లద్దాలతో చూడడం చాలా పొరపాటు. ఈ పొరపాటు ఒక్కోసారి కొన్ని సమూహాలకు అనుకూలంగా చరిత్రకారులు చేస్తారు. కశ్మీరీ బ్రాహ్మణులు గతంలో లోయ వదిలిపెట్టి వెళ్లటానికి కారణాలు ఆయా కాలాల్లో పాలకుల అణచివేత విధానాలే. నిజానికి కశ్మీరీ బ్రాహ్మణుల కంటే ఎక్కువగా ముస్లిములు లోయను వదిలిపోయారు. కానీ మళ్లీ వలస వెళ్లిన కశ్మీరీ బ్రాహ్మణులు తిరిగి లోయకు రావాలనుకొన్నపుడు, తాము వెళ్లిపోవానికి కారణాలు కశ్మీరీ ముస్లిములపై వేశారు. ముస్లిముల మతోన్మాదం వలనే వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పారు. కొంతమంది చరిత్రకారులు కూడా అలా రాశారు. ఇది పచ్చి అబద్ధం. 1930ల నాటికి కశ్మీరీ ముస్లిములు వలస వెళ్లిన కశ్మీరీ బ్రాహ్మణులు తిరిగి రావటాన్ని స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులతో కలిసి వ్యతిరేకించిన మాట వాస్తవమే. అరకొర ఉపాధి అవకాశాలు, ప్రజల ఆధీనంలో ఉన్న పరిమిత వనరుల పంపకం దగ్గర గొడవలు ఉన్నాయి కానీ, మతపరమైన విబేధాలతో మాత్రం కాదు. ఈ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోకపోతే కశ్మీరీ బ్రాహ్మణుల సమస్యను అర్థం చేసుకోలేము.

కశ్మీర్ ఆధునికరణలో భాగంగా, బ్రిటిష్ పాలకుల పట్టుదలతో, డోగ్రా రాజులు అధికార భాషను పర్షియన్ నుండి ఉర్దూకు మార్చారు. ఈ చర్య వలన స్థానిక కశ్మీరీ బ్రాహ్మణుల మీద చలికి కప్పిన చద్దరు తొలిగినట్లుగా అయ్యింది. 1890 ప్రాంతం నుండి పెద్ద ఎత్తున పంజాబ్ నుండి హిందువులు తిరిగి రావటం మొదలు పెట్టారు. పాలనారంగంలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లోకి వెళ్లారు. శతాబ్ధాలుగా తమ జ్నానాన్ని పర్షియన్ భాషలో పెంపొందించుకొని తాము తప్ప డోగ్రా రాజులకు గతి లేదు అని భావించిన స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులకు ఇది తీవ్రమైన కుదుపు.

ఉర్దూను అధికార భాషగా మార్చటం ముస్లిములకు కూడా ఎక్కువ ఉపయోగపడదు. ఎందుకంటే ముస్లిములలో నిరక్షరాస్యులే ఎక్కువ. స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులకు ఉర్దూలో ప్రావీణ్యం లేదు. బ్రిటిష్ వాళ్లు పెట్టిన సివిల్ సర్వీసుల్లో కూడా ఆధునీకరణ చెందని స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులు నెగ్గుకొని రాలేకపోయారు. పంజాబ్ కశ్మీరీ బ్రాహ్మణులు ఈ పాలనా రంగాలలోకి చొచ్చుకొని పోవటమే కాదు, తమ బంధువుల్ని కూడా పంజాబ్ నుండి పిలిపించుకొని తమ ప్రాబల్యంతో వారికి ఉద్యోగాలు ఇప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలు వారి సామాజిక ఆర్థిక మనుగడకు గారెంటీగా భావించి భరోసాగా ఉన్న స్థానిక కశ్మీరీ బ్రాహ్మణులు తల్లడిల్లిపోయారు. గొప్ప గొప్ప ముస్లిం రాజుల పరిపాలనలోనే వారు కడుపు కదలకుండా ఉన్నారు. ఇప్పుడు ఒక హిందూ రాజు అధికారంలో వారి కాళ్ల కింద భూమి కదిలిపోతోంది.

పంజాబీ హిందువులు ఉద్యోగాలు సంపాదించటమే కాదు, వారి సమూహాల సంక్షేమం కోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొన్నారు. వాటికి కూడా మహారాజావారి నుండి దాతృత్వం అందేది. అలాంటిదే 1906లో ఏర్పడినదే హిందూ సహాయక సభ. 1917 నాటికి ఈ హిందూ సహాయక ‘అమరనాథ్ గుడి’ కి నిధులు సమకూర్చుకొన్నది. పెద్ద ఎత్తున యాత్రికులు అమరనాథ్ యాత్రకు వెళ్లేవాళ్లు. వారిలో ఎక్కువ మంది పంజాబీలే. ఈ గుడికి శ్రీనగర్ లో శాశ్వత ఆఫీసు నిర్మాణానికి స్థలం కూడా డోగ్రా రాజుల నుండి దానంగా అందింది. ఆ స్థలం పక్కనే నివశిస్తున్న కశ్మీరీ బ్రాహ్మణులు అభ్యంతరం పెట్టినప్పటికీ ఈ కేటాయింపు జరిగింది.

కశ్మీరీ పండితులకు స్థానిక ముస్లిములకంటే రెండు వర్గాలు శత్రువులుగా కనిపించసాగాయి. ఒక వర్గం పంజాబీ కశ్మీరీ బ్రాహ్మణులు. రెండో వర్గం ఆర్య సమాజ్ వారు. రెండో వర్గాన్నే ఎక్కువ ప్రమాదకరంగా వారు భావించారు. ఎందుకంటే వారే ఎక్కువ పాలనరంగంలో ఉండమొకటైతే, రెండోది మతపరమైన అసమ్మతి. డోగ్రాల లాగానే కశ్మీరీ బ్రాహ్మణులు సనాతన ధర్మాలను నమ్మేవారు. వేదాలను తప్ప వేరే ఏ మతశాస్త్రాలను నమ్మరు. ఆర్య సమాజ్ వాళ్లు సంస్కరించటం కంటే తమను తాము సంస్కరించుకోవటం మంచిదని భావించి 1910లో అందులోనే కొంత మంది ఆర్య కుమార్ సభను ప్రారంభించారు. బాల్య వివాహాల రద్దు, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించటం, మతారాధనలకు తక్కువ ఖర్చు చేయటంలాంటి సంస్కరణలు పాటించినా వారు ఎక్కువ సనాతన ధర్మాల మీదనే నిలబడిపోయారు. ఈ సంస్థ పెద్దగా కశ్మీరీల్లో పేరు సంపాదించుకోలేదు. ఒక్క వితంతు వివాహం కూడా కశ్మీరీ పండితుల సమాజంలో చేయించలేక పోయారు. అయితే ఇందులో ఒక యువ విభాగం ‘యువక్ సభ’ పేరుతో ప్రేమనాథ్ బజాజ్ నాయకత్వంలో తరువాత కాలంలో క్రియాశీలకంగా పని చేసింది.

ఇది 1921 నాటి పరిస్థితి. అప్పుడే ‘వశపారంపర్య రాజ్య పాలితులు’ అనే ప్రశ్న ముందుకు వచ్చింది. చేయలేదు. ముల్కీ హోదాను నిర్ణయించే ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. తరువాత సంవత్సరాలలో బయటవారికి వ్యతిరేకంగా జరిగే గొడవలు పెరిగాయే కానీ, ప్రయోజనం లేకపోయింది. 1912 లో భూమి యాజమాన్యం ఉన్న వారికి ముల్కీ హక్కులు అనే అర్థం లేని ఆదేశాలు వచ్చాయి. అందులో 20 సంవత్సరాల నుండి కశ్మీర్ లో ఉన్న వారిని ముల్కీలుగా గుర్తించవచ్చు అనే క్లాజ్ కూడా ఉండింది. 10 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి కూడా ముల్కీ హోదా ఉంటుంది. అప్పటికే 20 సంవత్సరాల పైనుండే ఉంటున్న పంజాబీ హిందువులకు కూడా ఈ ముల్కీ హోదా లభ్యం కావటంతో కశ్మీరీ స్థానికులు ఎదురు తిరిగారు. 20 సంవత్సరాలు ఒక దగ్గర బతికిన వాళ్లు భూములు సంపాదించకుండా ఉంటారా! అర్థ శతాబ్ధం కింద కశ్మీర్ వదిలి వెళ్లిన వారికి కూడా అక్కడ భూములు ఉన్నాయి.

1927లో ఇంకో ఆదేశం చేశారు. గులాబ్ సింగ్ పగ్గాలు చేపట్టినానాటికి ముందు నుండి ఉన్న వారికి స్థానికత అని. అయితే ఉద్యోగాలు చేస్తున్నవారు స్థానికులు కాకపోయినా ఉండవచ్చు అనీ, అక్కడ భూములు కొనవచ్చు అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడితో స్థానిక కశ్మీరీ పండితులకు ఇబ్బంది పోయింది.

ఇప్పుడు వారి శత్రువు బయట వారు కాదు. స్థానిక ముస్లిములే. ముస్లిములు అప్పటికే సమీకృతం అవుతున్నారు. బయటవారికి వ్యతిరేకంగా ముస్లిములతో కలిసి పోరాడిన కశ్మీరీ పండితులకు ఇప్పుడు శక్తిమంతమైన ముస్లిములు శత్రువులుగా కనిపించటం మొదలు పెట్టారు. 95 శాతం ముస్లిం జనాభాతో పోలిస్తే కేవలం 5 శాతం మాత్రమే ఉన్న కశ్మీరీ పండితులు కొద్దిగా బెదరసాగారు.

కశ్మీరీ పండితులు పంజాబ్ నుండి వచ్చిన కశ్మీరీ బ్రాహ్మణులతో తగాదా పడుతున్నపుడూ, స్థానికంగా అప్పటికి ముందుకొచ్చిన డిమాండ్స్ విషయంలోనూ తెలివిగా ముస్లిములను కలుపుకొన్నారు. అయితే కశ్మీర్ దేశ ప్రజలుగా కశ్మీరీ పండితులకు ఎంత హక్కు ఉంటుందో, అంత హక్కు కశ్మీరీ ముస్లిములకు కూడా ఉంటుందని మాత్రం అంగీకరించలేకపోయారు. 20వ శతాబ్ధపు ప్రారంభం నుండి, ముస్లిములలో రాజకీయ కదలిక ప్రారంభం అయ్యి, వారి విద్యా వెనుకబాటుతనాన్ని అధిగమించటం, ప్రభుత్వ సేవల్లో వారి పాత్రను పెంచుకోవటానికి ప్రయత్నించటం మొదలు అయ్యింది. 95 శాతంగా ఉన్న ముస్లిముల మధ్య, ఐదు శాతంగా ఉన్న బ్రాహ్మణులు ఎంత లేదన్నా అభద్రతాభావానికి గురి అయ్యారు. ఈ అభద్రతాభావం ముస్లిములలో రాజకీయ చైతన్యం పెరిగిన తరువాత ఎక్కువ అయ్యింది.

ముస్లిములు మొదటిగా తమ మతసంస్థల ద్వారా కదలికలోకి వచ్చారు. మసీదులు, దర్గాల లాంటి మతకూడిక ప్రదేశాల్లో వాళ్ల కదలిక ప్రారంభం అయ్యింది. మసీదుల నుండి కార్యాచరణ జరగటం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. బ్రిటీష్ వత్తిడి వలన, డోగ్రాలు ఇచ్చిన చిరు అవకాశాలని అందిపుచ్చుకొని కూడా ముస్లిములు కొంత చైతన్యం పొందారు.

అయితే వారిలో ఉన్న నిరక్షరాశ్యత, వారు ముందుకు పోవటానికి అడ్డుకట్ట వేస్తుందనే విషయం వారు గ్రహించారు. దేశ రాజకీయాలలో పాల్గోవాలనే ఆలోచనకు ముందుగా, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని సరిదిద్దుకోవాలనుకొన్నారు. 1907లో మొదటిసారి ముస్లిం సమూహం వారి జనాభా గురించి మాట్లాడింది. ప్రభుత్వ పరిపాలనలో వారి ఉనికి లేకపోవటం గురించి ప్రశ్నించారు. ముస్లిముల వెనుకబాటుతనానికి వారికి విద్యలేకపోవటం ఒక కారణం అయితే, అందుకు హిందువులే కారణమని కూడా వారు ఆరోపించారు. హిందూ అధికారులు ముస్లిములను నిరక్షరాస్యులుగానే ఉంచాలని కోరుకొంటున్నారనీ, దాన్ని నివారించటానికి ముస్లిములను ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర పరిపాలనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజానికి కశ్మీర్ ముస్లిముల హక్కుల కోసం, భారత భూఖండంలో ఉన్న ఇతర ముస్లిములే మొదట్లో ఎక్కువగా కృషీ చేశారు.

1909లో రంగూన్ లో జరిగిన ‘ఆల్ ఇండియా మహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్’ కశ్మీర్ రాజుకు ఒక విజ్నప్తి చేసింది. కశ్మీర్ లో ముస్లిం టీచర్లనూ, స్కూలు ఇన్స్పెక్టర్లనూ పెంచాలనీ, ముస్లిం విద్యార్ధులకు అదనపు విద్యా వేతనం ఇవ్వాలనీ కోరింది. 1912లో జరిగిన మహాసభలో ఈ సంస్థ- ఒక వేళ కశ్మీర్ లో చదువుకొన్న ముస్లిములు తగినంతగా లేకపోతే, పంజాబ్ ముస్లిములనయినా ఉద్యోగాలలోకి తీసుకోవాలని కోరింది. ఆ రకంగానైనా ముస్లిములు పరిపాలనలో భాగస్వామ్యం తీసుకొని తమ మతస్తులకు మేలు చేస్తారని ఆశించారు. కానీ మహారాజు ఆ సంవత్సరమే- రాజ్యపౌరులకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం, పౌరులకు ఇచ్చిన హక్కుల ప్రకారం -ఇతర ప్రాంత ముస్లిములను ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనలో భాగం చేయలేమని చెప్పాడు. ఒక పక్క పంజాబీ బ్రాహ్మణులకు ఉద్యోగాలు ఇస్తూ, ముస్లిముల విషయంలో విరుద్ధంగా మాట్లాడటం స్పష్టమైన వివక్ష చూపినట్లే. ముస్లిముల వెనుకబాటుతనానికి వారినే బాధ్యులను చేస్తూ, వారికి చదువు కంటే వారి వృత్తుల పట్లనే ఎక్కువ మక్కువ అని మహారాజా ప్రతాప్ సింగ్ తీర్మానించాడు.

డోగ్రా రాజుల ఈ నిర్ణయానికి కశ్మీరీ ముస్లిములలో మేధావివర్గం చాలా గాయపడ్డారు. 1924లో లార్డ్ రీడింగ్ అనే వైస్రాయ్ కశ్మీర్ కు వచ్చినపుడు ఆయనకు ఇచ్చిన మెమోరాండంలో ముస్లిములకు ప్రభుత్వ ఉద్యోగాలు, మెరుగైన విద్యాసదుపాయాలు, రైతులకు యాజమాన్య హక్కులు, బేగార్ పద్దతి (ఇది ఒకలాంటి వెట్టి చాకిరీ) రద్దు, అన్ని మసీదులను దర్బార్ కంట్రోల్ లో ఉంచటం లాంటి డిమాండ్స్ పెట్టారు. ఈ మెమొరాండం ముస్లిములలో పెరుగుతున్న చైతన్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.

అయితే అప్పటి డోగ్రా మహారాజు హరిసింగ్ ఈ మెమోరాండం ఇచ్చిన వారి మీద భారీ అణచివేత ప్రదర్శించాడు. 1927లో ‘దేశ పౌరుల వారసత్వం’ నిర్ణయం అయ్యాక, కశ్మీర్ దర్బార్ 12 విద్యా వేతనాలను మంజూరు చేసి, అందులో ఒకటి మాత్రమే ముస్లిములకు కేటాయించింది. ఈ చర్యకు జమ్మూ, కశ్మీర్ రెండు ప్రాంతాల్లో ముస్లిం ప్రజల్లో వచ్చిన నిరసనకు కొంత భయపడి; మహారాజు ముస్లిములకూ హిందువులకూ ఇద్దరికీ సమాన ప్రాతిపదికన స్కాలర్షిప్పులు ప్రకటించాడు. అంతేకాదు, శ్రీనగర్ మున్సిపాలిటీలో కొన్ని పోస్టులు కేవలం ముస్లిములకే కేటాయిస్తూ నోటీసు ఇచ్చాడు. కశ్మీరీ పండితులు, ఈ చిన్న అవకాశాన్ని కూడా ముస్లిములకు ఇవ్వటానికి అంగీకరించలేదు. ప్రభుత్వం మతతత్వానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ ఆరోపణను సాకుగా తీసుకొని డోగ్రా రాజులు ఆ నోటీసును వెనక్కి తీసుకొన్నారు.

1920 నాటికి కశ్మీరీ పండితులకు ఒక విషయం అర్థం అయ్యింది. ఇప్పుడు వారి పోటీ -తమ కంటే ఎక్కువ సంఖ్యలో, పెరుగుతున్న ఆత్మవిశ్వాసంతో ఉన్న ముస్లిములతో అని వారు తెలుసుకొన్నారు. ముస్లిములలో వచ్చిన రాజకీయ కదలిక వారి మతస్పృహతోనే రావటం వాస్తవం. ఆ ‘మత స్పృహ’ను ‘మతతత్వం’గా మార్చి నిస్సంకోచంగా మాట్లాడటానికి కశ్మీరీ పండితులకు ఎలాంటి అభ్యంతరాలు కలగలేదు. అప్పుడే భారత భూఖండంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ గంట కొట్టి మాట్లాడుతున్న జాతీయవాదంతో తమను తాము కలుపుకొంటూ, ముస్లిములను ‘మతతత్వవాదులు’ అనటానికి కశ్మీరీ పండితులు వెనుకాడలేదు.

‘వారసత్వ దేశ పౌరుల’కు వేరే అర్థం చెబుతూ ‘కశ్మీర్ కశ్మీర్లకే’ అనే పిలుపును కశ్మీరీ పండితులు అందుకొన్నారు. అప్పటిదాకా ప్రాంతీయతత్వాన్ని ఎగదోసి, పంజాబీ ముస్లిములకు వ్యతిరేకంగా కశ్మీరీ ముస్లిములను కలుపుకొని వచ్చి, దానికి జాతీయ పోరాటమనే పేరు పెట్టారు. ముస్లిములు కశ్మీర్ లో తమ వంతు భాగం కోసం ముందుకు వస్తున్న సమయంలో ఈ ప్రాంతీయభావం ఆవిరి అయిపోయి, తాము మత మైనారిటీలగా ఉన్నామనే భాషలో మాట్లాడటం మొదలుపెట్టారు.

ఇదే సమయంలో షేక్ అబ్ధుల్లా లాంటి విద్యావంతులైన యువకులు, భారత యూనివర్శిటీలలో చదివి వచ్చి, కశ్మీర్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనటం మొదలు పెట్టారు. కశ్మీర్ లో వారికి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వకపోవటంతో- వారు అనేక తరాలుగా విద్యను సొంతం చేసుకొన్న కశ్మీరీ బ్రాహ్మణులతో పోటీ పడలేక పోయారు. ఈ పరిణామాల ఫలితంగా 1930లో, ఈ ముస్లిం యువత కశ్మీర్ రాజులకూ కశ్మీరీ పండితులకూ వ్యతిరేకంగా క్రియాశీలక నిరసన మొదలుపెట్టింది.

1930లోనే కశ్మీరీ దర్బారు కొంత 1050 మంది చిన్న ఉద్యోగులనూ, 250మంది గుమాస్తా ఉద్యోగులనూ తగ్గించమని సిఫార్సు చేసింది. కశ్మీర్ దేశ పౌరులకు ఉద్యోగ విరమణ వయసు 53గాను, పౌరులు కానీ వారికి 50 సంవత్సరాలుగా తగ్గించి వేసింది. అప్పటికి దర్బారులో ఉద్యోగులుగా ఉన్న అనేక మంది తప్పుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో కశ్మీర్ దర్బారు ముస్లిములకు రెట్టింపు చేసిన స్కాలర్ షిప్పు పండితులకు ఆగ్రహం తెప్పించింది. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగాయి. డోగ్రాలు వాటిని తమకు అనుకూలంగా వాడుకొన్నారు.

కశ్మీరీ ముస్లిములలో రాజకీయ కార్యాచరణ పెరిగి తమ హక్కుల కోసం పోరాటం ఉధృతం అవుతున్న తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం కొంత భయపడి గ్లాన్సీ కమిషన్ ను వేసింది. 1931 అక్టోబర్ లో గ్లాన్సీ కమిషన్ ఏర్పాటు అయిన నాటికి లోయలో ఆర్ధిక మాంద్యం ఫలితంగా పీడిత వర్గం, మత సమూహం ఒకటిగా కలిసిపోయాయి. అలాగే పెట్టుబడీదారి వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక వర్గాలు కూడా కలిసిపోయాయి. ముస్లిములను దురదృష్టపు అంచుల్లో ఉంచి, పండితులు వనరులకు హక్కుదారులుగా ఉన్న ఆ హిందూ రాష్ట్రంలో -మతం, రాజకీయాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పేదలైన కశ్మీరీ ముస్లిముల హక్కుల కోసం కదిలించటం అంటే, అది రెండు వర్గాల ప్రజల మధ్య ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష గురించి మాట్లాడటమే.

ఈ కమిటీలో ఉన్న ఇద్దరు కశ్మీరీలలో ఒకరు గులాబ్ అహమద్ అషై. ప్రేమ్ నాథ్ బజాజ్ అనే కశ్మీరీ పండితుడు కూడా ఉన్నారు. గులాబ్ అహమద్ అషై గ్లాన్సీ కమిషన్ సభ్యుడు కాక మునుపు దాన్ని వ్యతిరేకించాడు. బ్యూరోక్రసిలో పండితులకు ఉన్న ప్రాబల్యంతో వాళ్లు కశ్మీరీ ముస్లిములను ఇబ్బందులు పెడతారని భావించాడు. కశ్మీరీ ముస్లిములు ముల్కీ ఉద్యమంలో ఉద్యోగాలు సంపాదించుకోవటం కంటే తాము పని చేస్తున్న ఫాక్టరీల్లో జీతాలు పెంపుదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

తరువాత కాలంలో గ్లాన్సీ కమిషన్ ఏర్పాటుకు ముస్లిములు కృతజ్నతలు తెలియచేసారు. కానీ హిందువులు సంతోషంగా లేరు. వారు ఎప్పుడూ సమస్యగా లేని ఆవు హత్యలను ముందుకు తీసుకొని వచ్చారు. కమిషన్ లో ఉన్న తమ హిందూ సభ్యులను రాజీనామా చేయమని వత్తిడి తీసుకొని వచ్చారు. ప్రేమ్ నాథ్ బజాజ్ చేయనని తీర్మానించాడు. తాము ఇచ్చిన 141 పేజీల మెమోరాండంను పట్టించుకోలేదని పండితులు కోపంగా ఉన్నారు. కశ్మీర్ లో కొత్తగా అనుమతి లభించిన పత్రికా స్వేచ్ఛ కారణంగా కశ్మీరీ పండితుల ఆధిపత్యత మీద ప్రచారం చేయగలిగాడు షేక్ అబ్దుల్లా.

గ్లాన్సీ కమిషన్ నివేదిక వచ్చాక కశ్మీరీ పండితుల సౌకర్యవంతమైన ఆధిపత్యానికి బీటలు పడ్డాయి. ఈ కమిషన్ చేసిన విచారణ, అది ఇచ్చిన తీర్పు -‘కశ్మీరీ ముస్లిములను పండితులు పీడించారు’ అనే వాదనకు బలం ఇచ్చినట్లు అయ్యింది. బ్రిటిష్ వాళ్లు పట్టుబట్టటం, పరిస్థితిని చక్కదిద్దటానికి మహారాజ ప్రభుత్వం వెంటనే పూనుకోవటం పండితులను అవమాన పరిచినట్లవటమే కాదు; అప్పటిదాకా వారు వారు అనుభవించిన అవకాశాలను దూరం చేసింది. కశ్మీర్ ప్రజలు రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకొంటున్న ఆధునిక కాలంలో ముస్లిములు దూసుకొని ముందుకు రావటాన్ని వాళ్లు జీర్ణం చేసుకోలేకపోయారు. 1932లో గ్లాన్సీ ప్రతిపాదనలు వచ్చిరాగానే, అవి ఇంకా ఆమోదం పొందక ముందే వీళ్లు ‘పోరాటం వర్ధిల్లాలి’ అనే నినాదాన్ని అందుకొన్నారు. ‘మనమంతా మన శక్తియుక్తులను చూపించాలి. మన తెలివితేటల ముందు స్వర్గం కూడా సాగిలపడుతుంది’ లాంటి నినాదాలు మొదలుపెట్టారు.

కశ్మీర్ లో మైనారిటీలు కశ్మీరీ పండితులు అయినప్పటికీ, హిందూరాజ్యం వారిపట్ల అవలంబించిన వైఖరిపరంగా చూస్తే కశ్మీరీ ముస్లిములే మైనారిటీలు. తేడా ఎక్కడ ఉందంటే ఆ మైనారిటీ స్థితి ఎదుర్కోవటానికి ఇరువర్గాలు ఏ ఏ పద్దతులను అవలంబించాయి అనే దగ్గర. జవహర్ లాల్ నెహ్రూ కశ్మీరీ పండితుడు కాబట్టి బ్రిటిష్ అతనంటే వణుకుతుంది అని పండితులు అనుకొంటారు. నెహ్రూను తమ వాడిగానే వారు భావించారు. కశ్మీర్ ప్రాంతంలో వారు మైనారిటీలు అయినా, మొత్తం భారతదేశంలో వారు మెజారిటీ సమూహానికి చెందినవాళ్లే అనే భరోసా వారికి ఉండేది. గ్లాన్సీ కమిషన్ నిర్ణయాలు ఆ ప్రాంతంలో హిందూయిజానికి గాయం చేసినట్లుగా వాళ్లు భావించి ప్రచారం చేశారు. బ్రిటిష్ వాళ్లను హిందూ వ్యతిరేకులుగా నింద వేశారు. అంతకు ముందు శత్రుత్వంతో ఉన్న పంజాబ్ పండితులను కూడా కలుపుకొన్నారు. వీరు ఎక్కువగా హిందుత్వ సంస్థ అయిన ‘హిందూ యువక్ సభ’ లో సభ్యులు. అందరూ కలిసి గ్లాన్సీ కమిషన్ కు వ్యతిరేకంగా రొట్టె ఉద్యమాన్ని (రోటి ఉద్యమం) మొదలు పెట్టారు.

వాళ్లు బ్రిటిష్ కు ఇచ్చిన మెమోరాండంలో ‘ఎంతో తెలివికలిగిన, విద్యావంతులమైన, చట్టానికి లోబడి ఉండే కశ్మీరీ పండిత సముదాయం మేము. మేము ఆంగ్ల భాషను నేర్చుకోవటంలోనూ, ఇంగ్లీష్ వారి సంస్కృతిలోను ఎప్పుడూ తలమునకలుగా వుంటాము. అలాంటి మా సముదాయం ఇప్పుడు అనాగరికులైన, అజ్నానులైన ముస్లిముల కింద నలిగిపోబోతుంది’ అని రాశారు. వందలాది కశ్మీరీ పండితులు గ్లాన్సీ కమిషన్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. గ్లాన్సీ కమిషన్ ముస్లిములకు ఇచ్చిన చిన్నపాటి రాయితీలను కూడా వాళ్లు సహించలేకపోయారు. అయితే దీన్ని ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు.

గ్లాన్సీ కమిషన్ చేసిన ఒక రికమండేషన్ ప్రజాపతినిధి సభను ఏర్పాటు చేయటం. ఆ ప్రతిపాదన 1934లో అమలులోకి వచ్చింది. ప్రజాసభగా పిలవబడిన ఈ సభలో 75 సభ్యులు ఉంటారు. అందులో 33 మంది ఎన్నికైనవారు. 12మంది అధికారికంగా నియమించబడ్డవారు. 30 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఆ 33 మంది ఎన్నిక అయ్యే సీట్లలో 21 ముస్లిములకు కేటాయించబడ్డాయి.10 హిందువులకు, 2 సిక్కులకు. అయితే ఈ సీట్లలో పోటీ చేయాలనుకొంటే వారు సంవత్సరానికి కనీసం 20 రూపాయలు పన్ను ప్రభుత్వానికి కట్టి ఉండాలి. అంటే ఆ మాత్రం ధనవంతులు మాత్రమే పోటీ చేయగలరు. ఈ షరతు ముస్లిం కాన్ఫరెన్స్ లో ఉన్న మెజారిటీ పేద ముస్లిములను పోటీ చేయకుండా చేసింది. అధికారికంగా నియామకం అయినవారు, నామినేట్ అయిన వారు ఎలాగూ ఎక్కువమంది హిందువులే ఉంటారు. ఈ మొత్తం లెక్కల్లో ముస్లిముల ప్రాతినిధ్యం ప్రజాసభలో పరిమితం అయిపోయింది.

ప్రజాసభలో మెజారిటీ సంపాదించుకోవటంలో ముస్లిములు విఫలం అయ్యారు. వారి విద్యాస్థాయి చాలా తక్కువగా ఉండింది. కటిక దారిద్యంలో ఉన్నారు. 1911 లెక్కల ప్రకారం కేవలం ఆరుగురు మాత్రమే ముస్లిం పట్టభద్రులు ఉన్నారు. రాష్ట్ర హై స్కూల్ అప్పుడు ఉన్న 1500 మంది విద్యార్థులలో కనీసం వందమంది కూడా ముస్లిం విద్యార్థులు లేరు. 300మంది విద్యార్థులు ఉన్న సిఎంఎస్ స్కూల్లో ఒక్క ముస్లిం విద్యార్థి కూడా లేడు.

షేక్ అబ్దుల్లా ప్రజాప్రతినిధి సభలో అధికారం పొందాలంటే కశ్మీరీ పండితుల మద్దతు అవసరం అయింది. అప్పటి వరకు కశ్మీరీల అన్ని రకాల హక్కుల గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూ వచ్చిన షేక్ అబ్ధుల్లా తగ్గిపోయాడు. డోగ్రా రాజుల నుండి ప్రయోజనాలు పొందుతూ, ముస్లిం ప్రజల కనీస హక్కుల సాధనకు కూడా అడ్డుపడుతున్న కశ్మీరీ పండితులతో మంచిగా ఉండటం ఆయనకు అవసరం అయ్యింది. అప్పుడే భారతీయ జాతీయ కాంగ్రెస్స్ వాడుతున్న ‘లౌకికవాద’ పదజాలం ముందుకు వచ్చింది. నెహ్రూ కశ్మీరీ పండితుడు అవటం (చాలా ఏళ్ల క్రితమే ఆ కుటుంబం కశ్మీర్ వదిలి వెళ్లినప్పటికి), షేక్ అబ్ధుల్లాకు నెహ్రూతో స్నేహం ఉండటం ఈ రెండు కూడా ఆయన తీసుకొన్న నిర్ణయానికి ప్రేరకాలు అయ్యాయి.

అయితే నెహ్రూకు, షేక్ అబ్దుల్లాకు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే షేక్ అబ్ధుల్లా మతానికీ, హక్కులకూ మధ్య వ్యత్యాసం ఉందంటే ఒప్పుకోలేదు. నెహ్రూవాదులంతా ఏ హక్కుల గురించి
shaik-abdullah మాట్లాడినా, వాటిని ఒప్పుకోవాలంటే వాటికి లౌకికవాద దృక్పథం తప్పక ఉండాలని భావించేవారు. కానీ కశ్మీర్ లో జరుగుతున్నదీ, అప్పటిదాకా జరిగిందీ (ఇప్పటికీ జరుగుతున్నది) ఏమిటంటే వారి భుజాలనెక్కి కూర్చోన్న వారు (డోగ్రాలు, కశ్మీరీ పండితులు) వారిని ఆర్ధికంగా, రాజకీయంగానే కాకుండా మతపరంగానే అణచివేశారు. ముస్లిముల మతపరమైన హక్కులను కూడా తిరస్కరించారు. అన్ని హక్కులతో బాటు మతపరమైన హక్కులు కూడా ఉండాలనీ, హక్కులకూ మతానికి ముడిపెట్టి మాట్లాడటం సరి కాదనీ, అసలు కశ్మీరీల హక్కుల తిరస్కరణకు వారి మతమే కారణమనే విషయంలో కశ్మీరీ ముస్లిములకు స్పష్టత వచ్చి; ఆ విషయం మాట్లాడటానికి వారికి దమ్మూ, ధైర్యం వచ్చేసరికి- కొత్తగా వచ్చిన లౌకికవాద వితరణ వారిని మతపరంగా మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది.

ఇప్పటికీ కశ్మీర్ లోనూ, భారతదేశ ఇతర భూభాగాల్లోనూ జరుగుతున్నది అదే. ఇక్కడ ముస్లిములకు కనీస మానహక్కుల తిరస్కరణ కూడా మత ప్రాతిపదికనే జరుగుతుంది. వారు ముస్లిములుగా ఉండటం వలన వారికి కనీస హక్కుల తిరస్కరణ జరుగుతూ ఉంటే, వారు సెక్యులరిష్టులుగా మారాలనే వింత వాదనను వింటుంటాం. మెజారిటీ మతస్తులు వారి మతాలను నిర్భయంగా ఆచరించుకొంటూ, వారి మతహక్కులకు రక్షణ పొందుతూ ముస్లిములు మాత్రం ఇక్కడ క్షేమంగా ఉండాలంటే (వాళ్ల మంచి కోసమే) లౌకికవాదులు అవ్వాలనే వాదనలోని ద్వంద్వ నీతి గురించి ఆలోచిస్తున్నట్లు అనిపించదు. మనుషులుగా ముస్లిములకు ఉండాల్సిన హక్కుల గురించి అయితే అసలు ఎవరికీ పూచీ ఉండదనుకొండి. అది వేరే విషయం.

గ్లాన్సీ కమిషన్ ప్రతిపాదనల సందర్భంగా కశ్మీరీ పండితులు చేసిన ఉద్యమం, వాళ్ల వ్యాఖ్యానాలు షేక్ అబ్దుల్లాను తన స్వప్రయోజనాల నుండి మరలించలేకపోయాయి. ఆయన ముస్లిం కాన్ఫరెన్స్ ను నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చిన రెండు నెలలలోనే కశ్మీరీ పండితులు ‘దేవాలయ ఉద్యమాన్ని’ ప్రారంభించారు. అప్పుడు హరిసింగ్ ప్రభుత్వ అదుపులో ఉన్న ధర్మర్త్ శాఖ శ్రీనగర్ లో ఉన్న దుర్గా నాగ్ దేవాలయాన్ని తన అదుపులోకి తీసుకొన్నది. ఆ దేవాలయ ట్రస్ట్ కు పండితులు తామే వారసులుగా అంతకు ముందే ప్రకటించి ఉన్నారు. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా కశ్మీరీ పండితులు ఆగ్రహంగా వీధులకెక్కారు. ప్రభుత్వ ఉద్యోగ విధులను బహిష్కరించారు. పండిత బడులు, కళాశాలల నుండి విద్యార్ధులు తరగతులు వదిలి నిరసనకు కూర్చోన్నారు. పోలీసుల మీద రాళ్లు రువ్వారు. (ఇప్పుడు అదే పండిత వారసులు రాళ్లు రువ్వటం దేశద్రోహం అంటున్నారు) పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. అరెస్టులు చేశారు. దాదాపు 3000మంది పండితులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

raghunath-vishnu-panditరఘునాథ్ వైష్ణవి అనే లిబరల్ పండిత్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కశ్మీర్ లో పండిత ముస్లిం ఐక్యత అవసరం గురించి, పౌర హక్కుల గురించి ఆయన మాట్లాడాడు. ‘కశ్మీర్ కశ్మీరీలదే’ అనే నినాదం కూడా ఆ సందర్భంలో చేశారు. ఆ నినాదం కారణంగానే రఘునాథ్ వైష్ణవిని అరెస్టు చేశారు.

ఈ ఉద్యమానికి షేక్ అబ్దుల్లా తన మద్దతు ప్రకటించాడు. ‘ఈ ఉద్యమం మతపరమైనదీ కాదు, రాజకీయమైనదీ కాదు. రెండు వర్గాల హిందువుల మధ్య జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి పండితులకు న్యాయం చేయాలని’ ఆయన అన్నాడు. ఈ సందర్భంగా ఈ సమస్య పరిష్కారం అయితే తాము నేషనల్ కాన్ఫరెన్స్ లో చేరతామని పండిత నాయకులు ప్రకటించారు. కానీ పండితుల్లో కార్యదీక్ష లేక 10 రోజుల్లోనే ఈ ఉద్యమం నీరు కారిపోయింది. పండితులు తమ మీద పెట్టిన కేసులను తొలగించుకోవటానికి కిందా మీదా పడాల్సి వచ్చింది. అయితే తర్వాత కాలంలో హై కోర్టు తీర్పు పండితులకు అనుకూలంగా వచ్చింది. హరిసింగ్ ఈ తీర్పును గౌరవించి దుర్గా నాగ్ ట్రస్ట్ ను పండితులకు అప్పగించించాడు. అయితే కశ్మీర్ లో ఉన్న ఇతర దేవాలయాలను రక్షించుకోవటానికి ఇదే తరహా ఉద్యమాలను పండితులు చేయలేదు.

అయితే ఈ సందర్భంగా కశ్మీర్ మూలవాసులు కశ్మీరీ పండితులు, కశ్మీరీ ముస్లిములే అన్న విషయం ప్రముఖంగా బహిర్గతం అయ్యింది. ఈ రెండు వర్గాల ప్రయోజనాల మధ్య తగాదాలు ఉన్నా -బయట హిందువులు అయిన డోగ్రాల నుండీ, ఇతరుల నుండి ఆధిపత్యాన్ని ఎదుర్కొనేటపుడు -ఈ రెండు సమూహాలు ఒకటి అవ్వాల్సిన ఆవశ్యకత ముందుకు వచ్చింది. కశ్మీరీ పండితులు, డోగ్రాలు ఒకటి కాదు అనే సంగతి తేటతెల్లం అయ్యింది.

1947 తరువాత షేక్ అబ్దుల్లా పరిపాలనలలోనూ, ఇతర ముఖ్యమంత్రుల పాలనలోనూ కశ్మీరీ పండితులు క్షేమంగా ఉన్నారు. 5 శాతంగా ఉన్నా తమ ప్రయోజనాల విషయంలో ముస్లిం పాలకులతో బేరసారాలాడి సాధించుకొన్నారు.

( నా కశ్మీర్ ఫయిల్స్ సినిమా రివ్యూ ని చాలా మంది దేశభక్తులు ట్రోల్ చేసారు. తిట్టారు. కొందరు రా కొట్టారు. ఇంకొందరు నోరు పారేసుకున్నారు. వాళ్ళందరికీ రమాసుందరి గారి ఈ వ్యాసం సమాధానం చెపుతుందనిపించి ఆవిడ వాల్ మించి ఎత్తుకొచ్చాను)
– సాయి శాతవాహన

LEAVE A RESPONSE