-
ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిపై పోటీ
-
రేసులో గల్లా జయదేవ్, రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి, కనకమేడల రవీందర్
-
రఘురామరాజు-సుజనాకే ఢిల్లీ పరిచయాలెక్కువ
-
ఎమ్మెల్యేలుగా ఉన్న రఘురామ,సుజనా
-
ఇద్దరికీ దక్కని మంత్రి పదవులు
-
జాతీయ స్థాయి ఇమేజీతో ఇద్దరికీ ఇబ్బందులు
-
దానితో ఎమ్మెల్యేలుగా సర్దుకుపోలేకపోతున్న వైనం
-
గత ఐదేళ్లలో ఢిల్లీలో పార్టీ కోసం పనిచేసిన కనకమేడల
-
కొత్తగా తెరపైకి గల్లా జయదేవ్, సుజనా పేరు
-
మరి ఢిల్లీకి వెళ్లేదెవరో?
( అన్వేష్)
ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్రమంత్రి, కేంద్రమంత్రి, స్పీకర్ తర్వాత కీలకమైన ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి. నిజానికి ఆ పదవికి పెద్ద ప్రాధాన్యమేమీ ఉండదు. సీఎంలు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఆయనను వెన్నంటి ఉండవచ్చు. కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్ల వ్యవహారం చూడవచ్చు. అదే విపక్షంలో ఉంటే ప్రాంతీయ పార్టీ అధినేతలతో లైజనింగ్ చేయవచ్చు. ఢిల్లీలో కేంద్రమంత్రులు, కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలతో లైజనింగ్ వల్ల ఆ ప్రతినిధికి ప్రాధాన్యం ఉంటుందంతే. అయితే తెలివైన వాళ్లయితే.. ఈ హోదాను బాగా వినియోగించుకోవచ్చు. అంటే.. వాడుకున్నంత వాళ్లకు వాడుకున్నంత మాట!
ఇప్పుడు ఆ పదవి కోసం టీడీపీలో పోటీ పెరిగింది. పాత- కొత్త నేతలు ఆ పదవిని ఆశిస్తున్నారు. ఆ ప్రకారంగా కేంద్రమాజీ మంత్రి-తాజా విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి, మాజీ ఎంపీ-తాజా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, గుంటూరు మాజీ ఎంపి గల్లా జయదేవ్, టీడీపీ మాజీ ఎంపి కనకమేడల రవీందర్ పేర్లు ఆ పదవికి ప్రచారంలో ఉన్నాయి. వీరిలో సుజనా చౌదరి తప్ప, మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందిన వారే.
వీరిలో కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనాచౌదరి, ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణంరాజుకు ఎన్డీయే పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఎన్డీయే సర్కారులో మంత్రిగా పనిచేసిన సుజనాకు వివాదరహితుడు, హుందాగా ఉంటారన్న పేరుంది. ప్రధాని మోదీ సహా అమిత్‌షా, నద్దా వంటి అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. పైగా ఆయన బీజేపీలో ఉండటం కలసివచ్చే అంశం. ఆ మేరకు రాష్ట్రానికి కావలసిన వ్యవహారాలు చక్కబెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ నేతకు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి ఇస్తారా అన్నదే సందేహం.
ఇక ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు.. ఎంపీ కాకముందే పారిశ్రామికవేత్తగా ఢిల్లీలో వ్యక్తిగతంగా విస్తృత సంబంధాలున్నాయి. జాతీయ-ప్రాంతీయ పార్టీ నేతతో ఆయనకు సంబంధాలున్న విషయం బహిరంగమే. ఉత్తరాది-ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు, ఆయా పార్టీల అధినేతలతో రాజు వ్యక్తిగత సత్సంబంధాలు నిర్వహిస్తుంటారు. వైసీపీ తిరుగుబాటు ఎంపీగా ఉన్న సమయంలో.. పార్టీ అధినేత జగన్ అనుమతితో సంబంధం లేకుండానే, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి సాధించారంటే, ఆయనకున్న పలుకుబడి- పరిచయాల స్థాయిని ఊహించుకోవచ్చు. పారిశ్రామికవేత్త కావడం ఆయనకు అదనపు బలంగా కనిపిస్తోంది. ఆయన పేరు కూడా ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి ప్రధానంగా వినిపిస్తోంది. పైగా ఏడుగురు క్షత్రియ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఆ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం కూడా రఘురామరాజుకు కలసివచ్చే అంశంగా కనిపిస్తోంది.
ఇక మాజీ ఎంపి కనకమేడల రవీందర్ పేరు కూడా ఆ పదవికి వినిపిస్తోంది. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఉన్న కనకమేడలకు, జాతీయ-ప్రాంతీయ పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇటీవలి ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల కమిషన్-పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన విశ్వసనీయుడన్న పేరుంది.
ఈ పదవిని గతంలో నిర్వహించిన మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన కాలంలో.. ప్రధాని మోదీ సహా, ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాలు నెరిపారు. అప్పట్లో కంభంపాటి ఢిల్లీలో జాతీయ-ప్రాంతీయ పార్టీ నేతలకు తలలో నాలుకలా ఉండేవారు. ఈనాడు అధినేత రామోజీరావు, కోడెల వంటి పెద్దల ఆశీస్సులు కూడా అప్పట్లో ఆయనకు ఉండటం లాభించింది.
అయితే కంభంపాటి ఇప్పటివరకూ తెలంగాణ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకే పరిమితమయ్యారని, ఏపీ రాజకీయాలు -పార్టీలో ఆయన పాత్ర నామమాత్రమేనన్న భావన పార్టీ వర్గాల్లో లేకపోలేదు. పైగా గతంలో ఆయన నిర్వహించిన పాత్రను, డిల్లీలో కనకమేడల రవీందర్ గత ఐదేళ్లలో పోషించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికీ కంభంపాటి తెలంగాణ టీడీపీ ఇన్చార్జిగానే పనిచే స్తున్న విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కంభంపాటి స్వతహాగా కృష్ణాజిల్లాకు చెందిన నేత అయినప్పటికీ, ఆయన రాజకీయ కార్యకలాపాలన్నీ తెలంగాణకే పరిమతమయినందున, ఆయనకు అవకాశం రావడం అనుమానమేనంటున్నారు. దానివల్ల వేరే సంకతాలు వెళతాయంటున్నారు. ఇప్పటికే ఏపీ కేంద్రంగా పనిచేస్తున్న వారి మధ్యనే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఏపీ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని కంభంపాటికి, ఆ పదవి ఇవ్వకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కొత్తగా గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, కొద్దికాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన జయదేవ్ పేరు, హటాత్తుగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా ఉన్న సమయంలో గల్లా మంచి ప్రతిభ కనబరిచినప్పటికీ, రాజకీయంగా ఆయనకు ఢిల్లీ స్ధాయిలో ఇతర పార్టీలతో సత్సంబంధాలు తక్కువేనంటున్నారు.
ఇప్పటివరకూ రేసులో ఉన్న ప్రముఖులలో జాతీయ స్థాయిలో సత్సంబంధాలున్న వారిలో రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి మాత్రమే కనిపిస్తున్నారు. పైగా ఈ పదవికి వినిపిస్తున్న వారంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. రఘురామకృష్ణంరాజు ఒక్కరే క్షత్రియ వర్గానికి చెందిన నేత. పైగా రఘురామకృష్ణంరాజు-సుజనాచౌదరి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారే. ఇద్దరికీ మంత్రి పదవులు రాలేదన్న నిరాశ లేకపోలేదు. అందులో సుజనాచౌదరి బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో, ఢిల్లీలో కీలకమైన పదవి బీజేపీకి ఇస్తారా అన్నది మరో సందేహం.
నిజానికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో పనిచేసిన తాము అనివార్య పరిస్థితిలో నియోజకవర్గానికి పరిమితమవాల్సి వచ్చిందన్న అసంతృప్తి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ హయాంలో ప్రధాని మోదీతో పనిచేసిన అనుభవం సుజనా చౌదరిదయితే.. ఎంపీగా మోదీ-అమిత్‌షా -నద్దా వంటి ప్రముఖులతో ఎప్పుడంటే అప్పుడు కలిసే స్వేచ్ఛ రఘురామరాజుకు ఉండేది. జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, నేరుగా పోరాడిన ఇమేజ్‌తో రఘురామరాజు.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి దగ్గరయ్యారు. ఇద్దరూ గత ఎన్నికల్లో ఎంపీకి అవకాశం లేక, ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఇద్దరి పేర్లూ ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధికి వినిపిస్తున్నాయి. ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి!