Suryaa.co.in

Andhra Pradesh

జ‌గ‌న్ రాడ‌ని చెప్పడానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రు?

– జనసేనను పవన్ అద్దెకిచ్చే టెంట్‌హౌస్‌లా మార్చేశాడు
– వైయస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు
– కూటమి నేతల ఉన్మాదంతో రాష్ట్రం రక్తమోడుతోంది
– మన్నవ సర్పంచ్ నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు పై దాడి దీనికి నిదర్శనం
– కృష్ణా జిల్లా వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి పేర్ని వెంక ట్రామయ్య (నాని) ఆగ్ర‌హం

తాడేపల్లి: పార్టీ పెట్టి, సొంతంగా పోటీ చేసి భారీగా ప్ర‌జామోదంతో అధికారంలోకి వ‌చ్చి తన పాల‌నలో ఒక మార్క్ క్రియేట్ చేసిన నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌. అలాంటి జ‌గ‌న్‌ని మ‌ళ్లీ అధికారంలోకి రానివ్వ‌ను అనడానికి ప‌వన్ క‌ళ్యాణ్ ఎవ‌రు? వైయస్ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు. చంద్ర‌బాబుకి న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు త‌ప్ప ఎప్పుడైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కొచ్చాడా? జ‌గ‌న్ మ‌ళ్లీ రావాలా వ‌ద్దా అనేది నిర్ణ‌యాల్సింది ప్ర‌జ‌లే తప్ప ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు కాదు.

మ‌ళ్లీ ఈవీఎంల‌ను మేనేజ్ చేసి గెల‌వ‌చ్చ‌నే ధైర్యంతోనే జ‌గ‌న్‌ని అధికారంలోకి రానివ్వ‌న‌ని చెబుతున్నాడ‌ని బ‌య‌ట మాట్లాడుకుంటున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే మొన్నటి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈవీలంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాల‌తో స‌హా వివ‌రించడం జ‌రిగింది. అందుకే బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని మా పార్టీ డిమాండ్ చేస్తోంది.

జ‌న‌సేన పార్టీ టెంట్ హౌస్‌లాగా అద్దెకిచ్చే పార్టీ అని నేను మాట్లాడితే తిట్టారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది అదే క‌దా. సొంతంగా గెల‌వ‌లేక అంద‌రూ ఒక్క‌టై ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నారు. అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంగా ఎక్క‌డున్నాడు.

రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌ల అండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతోందని, అరాచకం సృష్టిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాజాగా గుంటూరుజిల్లా మన్నవ గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వర రావు పై పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కిపడిందని అన్నారు.

ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఆదేశాల‌తో ఆయ‌న అనుచ‌రులు గుంటూరు జిల్లా మ‌న్నవ‌ గ్రామంలో చెరువు మ‌ట్టిని అక్ర‌మంగా త‌ర‌లిస్తుంటే క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేసి నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు అడ్డుకున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల అవినీతి, అరాచ‌కాల‌ను ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నాడు. దీంతో ఎమ్మెల్యే అండ‌తో ఆయ‌న అనుచ‌రులు నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు పై ప‌ట్ట‌ప‌గ‌లు అతి కిరాత‌కంగా రాడ్డులు, క‌ర్ర‌ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. ఎమ్మెల్యే అంతా వెనకుండి న‌డిపించి, ఇప్పుడు నీతులు చెప్ప‌డం సిగ్గుచేటు.

టీడీపీ ఎమ్మెల్యేల‌కే సుప‌రిపాల‌న

వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి క‌ష్ట‌ప‌డి చ‌దివి డాక్ట‌ర్ పాసైన విద్యార్థుల‌కు కూడా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా ఈ ప్ర‌భుత్వం వేధిస్తోంది. ఉద్యోగుల‌కు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఐపీయ‌స్‌లు సైతం భ‌య‌ప‌డి రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. వేల‌కు వేలు క‌రెంట్ బిల్లులు ఎందుకొస్తున్నాయ‌ని ఎమ్మెల్యేల‌ను ప్ర‌శ్నిస్తుంటే స‌మాధానం చెప్పుకోలే ఎల్లో ప‌త్రిక‌ల్లో గ‌త ప్ర‌భుత్వమే కార‌ణ‌మ‌ని అస‌త్య క‌థ‌నాలు రాయిస్తున్నారు.

కారుంటే అమ్మ ఒడి ఎందుకివ్వ‌రు? మా పాల‌న‌లో అడ్డ‌గోలు నిబంధ‌న‌లు అంటూ ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టారు. అవే ఇప్పుడెందుకు అమ‌లు చేస్తున్న‌ట్టు? ఇది టీడీపీ ఎమ్మెల్యేల‌కే సుప‌రిపాల‌న త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌కు కాదు. విషాహారం తిని విద్యార్థినులు అనారోగ్యం పాలై అల్లాడి పోతుంటే మంత్రి వచ్చేదాకా అంబులెన్స్ లో త‌ర‌లించ‌కూదంటూ అడ్డుకున్నారు.

 

 

LEAVE A RESPONSE