పారిశ్రామిక ప్రమాదాలకు కారణమెవరు? బాధితులకు న్యాయం జరిగేనా ?

– డా యం. సురేష్ బాబు, అధ్యక్షులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్

సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలోని రూబీ మోటార్స్ మరియు రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ భవనంలో సోమవారం మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది ఊపిరాడక మరణించారు మరియు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రూబీ మోటార్స్ షోరూమ్‌లోని ఎలక్ట్రికల్ స్కూటర్ లేదా జనరేటర్‌లో పేలుడు కారణంగా మంటలు సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హోటల్ భవనం యొక్క మొదటి ఐదు అంతస్తులలో 28 గదులు ఉన్నాయి. రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో 25 మంది అతిథులు ఉన్నారని అధికారులు తెలిపారు.

పొగ బ్యాట‌రీల నుంచి 5వ అంత‌స్థుకు వ్యాపించింద‌ని, పొగ వ‌ల్ల లాడ్జి రూంల్లో 8 మంది మృతి చెంద‌గా, 9 మంది అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యార‌ని పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా, రూబీ మోటార్స్ యజమానులు పేలుడు సంభవించిన భవనం సెల్లార్ నుండి అక్రమంగా ఈ-బైక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో పోరస్‌ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు బీహారీలు చనిపోయారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేశారు.

తమ గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతుంది, దుర్వాసన భరించలేక పోతున్నాము, వెంటనే ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని గత కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు ప్రభుత్వం. హైదరాబాద్ భోయిగూడ గుజిరీ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన పదుకొండు మంది మృత్యువాత పడ్డారు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురాకుండా, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద వహించక పోవడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

మృతుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ , ఎక్స్గ్రేషియా , కాంపెన్సేషన్ దొరకడం లేదు. పరిశ్రమల భద్రత కోసం అలాగే పది మంది కంటే ఎక్కువ కార్మికులు పనిచేసే చోట బలమైన రెగ్యూలేటరీ వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకూ పనికి రాకుండా పోయింది . నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలి, ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్‌ పార్టీ తనిఖీలు ఉండడంలేదు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా చూడాలి అలాగే జనావాసాలలో పరిశ్రమలు, గోదాములు, రద్దీ ప్రదేశాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పారిశ్రామిక ప్రమాదాలు, గోదాములు, గుజరీ, తుక్కు వ్యాపార సముదాయాలల్లో నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించక ఏండ్లు గడుస్తుంది. ప్రమాదాలు జరిగిన తరువాత పనికి మాలిన సెక్షన్లు విధించి యజమానులు బయటకు వేస్తున్నారు తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రతి నెల పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించి నివారణోపాయాలు వెదకాలి. కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకువచ్చి, పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ పటిష్టం చేయాలి.

దాదాపు డెబ్భై శాతం వాణిజ్య సముదాయాలు, షాపులు, గోదాములలో ఫైర్ ఎక్సటెంగ్విషర్లు ఉండడం లేదు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను హై రిస్క్ జోన్లను గుర్తించాలి. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలు ఇండస్ట్రియల్ అట్లాసులో పొందుపరచాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు కూడా కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలుండాలి. పరిశ్రమలు కాంప్లియన్స్‌ (సమ్మతి) నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలి.స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని ఇండస్ట్రియల్, గోదాముల సేఫ్టీ సంఘంలో బాధ్యులుగా చేర్చాలి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న అంశాన్ని సంబంధిత కంపెనీ బోర్డులపై ప్రదర్శించాలి.

థర్డ్‌ పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి. ఏలూరు, భోయగూడ దుర్ఘటనలో నిరోధకాలు ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు. దేశంలోని పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌(ప్రత్యేక తనిఖీ) నిర్వహించి, ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్, బాయిలర్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఆర్వో, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారి సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని రూపొందించాలి.

బాయిలర్స్ విభాగంలో, పరిశ్రమల శాఖ లో, అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. పరిశ్రమల్లో వంద రోజుల కొకసారి స్పెషల్‌ డ్రైవ్‌ను పూర్తి చేసి, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మరియు ప్రజల కొరకు పోర్టల్ లో ఉండాలి. విష, ప్రమాదకర రసాయనాలు తయారీ పరిశ్రమలు , ప్రమాదకర విష పదార్థాలు నిల్వ చేసే పరిశ్రమలు. .పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు నిల్వ చేసి, వాటిని తయారు చేసే పరిశ్రమలు విభాగాలుగా వర్గీకరించి పరిశ్రమల్లో, పని చేసే చోటు లో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టేలా జిల్లా స్థాయి కమిటీలు రూపొందించుకొని విధిగా తనిఖీ చేయాలి.