Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్‌ను ఎందుకు కాపాడుతున్నారు?

-రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి బానిసలయ్యారు
-విభజన హామీలు నెరవేర్చకుండా మోసగించారు
-మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ అది
-మైనార్టీలకు సమాధానం చెప్పాలి
-పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి

రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని బానిసలయ్యారో ముస్లీంలకు సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి సీఎం జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు. శనివారం న్యాయయాత్రలో భాగంగా కడపలో ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకి అని, మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీకి జగన్‌ బానిసగా మారాడని విమర్శించారు. బీజేపీకి బానిస అయిన జగన్‌ వైఎస్సార్‌ వారసుడు ఎలా అవుతాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

గోద్రాలో దాడులు జరిగితే జగన్‌ నోరు విప్పలేదు.. ముస్లీంలకు ఎన్నో వాగ్ధానాలు చేశాడు.. ఇమామ్‌లకు రూ.15 వేలు వేతనం, ముస్లీం బ్యాంక్‌, చనిపోతే 5 లక్షల బీమా అని హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. ముస్లీంల పక్షాన నిలబడేది కాంగ్రెస్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏం చేసిందని బాబు, జగన్‌ బానిసలు అయ్యారని విమర్శించారు. విభజన హామీలు ఒక్కటి సైతం నెరవేర్చకుండా ప్రత్యేక హోదా అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. వైఎస్సార్‌ బ్రతికి ఉంటే కడప స్టీల్‌ ప్లాంట్‌ ఎప్పుడో పూర్తి అయ్యేదని, కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్‌ కింద మార్చారని విమర్శించారు. మూడు సార్లు శంకుస్థాపన చేశారు…ఎంపీలు నిద్రపోతున్నారా…స్థానిక ఎంపీ అవినాష్‌ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్‌ మీద మాట్లాడలేదు. కడప – బెంగళూరు రైల్వే లైన్‌ వైఎస్సార్‌ ఆశయమని చెప్పారు. కడప లైన్‌ ను జగన్‌ ఎందుకు వద్దన్నారో చెప్పాలని కోరారు.

అవినాష్‌ను ఎందుకు కాపాడుతున్నారు?
సీబీఐ నిందితుడుగా అవినాష్‌రెడ్డి మీద ముద్ర వేసింది…ఆయనకు మళ్లీ ఎలా టిక్కెట్‌ ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. బాబాయ్‌ హత్య విషయంలో జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారు? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారు? మీరు నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు? నిందితులను ఎందుకు కాపాడుతు న్నారు? జగన్‌ మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. నిందితుడు అని చెబుతున్న అవినాష్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడం వల్లే నేను పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE