అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష?

-తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు మనవడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలా?
-గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రులు, సినీ నటులు చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదా?
-5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దళితుడు సాయన్న విషయంలోనే ఎందుకీ వివక్ష ?
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభ్యుడిగా 5 సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దళిత నేత జి.సాయన్న మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయం.

తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం సుధీర్ఘ కాలం ప్రజలకు సేవలందిస్తూ శాసనసభ్యుడిగా కొనసాగుతూ మరణించిన సాయన్నకు మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయం.

గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరణించిన నోముల నర్సింహయ్యతోపాటు మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎం.సత్యనారాయణరావు సినీనటులు హరిక్రిష్ణ వంటి వారి పార్థివ దేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం… దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయం.

ఈ ఘటన మరవక ముందే ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణిస్తే సీఎం కేసీఆర్ స్పందించకపోవడాన్ని బాధాకరం. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలి.

సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలు కన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తూ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీనవర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరం. దళిత జాతికే అవమానం. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది

Leave a Reply