Home » ఇంగ్లండ్‌లో వదిలేసిన విద్యా విధానం మనకేల సారూ?

ఇంగ్లండ్‌లో వదిలేసిన విద్యా విధానం మనకేల సారూ?

-మనది అమెరికా, ఆస్ట్రేలియా కాదు మాస్టారూ?
-ముందు స్కూళ్ల చక్కదనం సరిదిద్దండి
-ప్రవీణ్ ప్రకాష్‌కు ఉపాధ్యాయుల బహిరంగలేఖ

ఇప్పడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరు చెబితే చాలు. టీచర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. ఏం చేస్తారో ఆయనే తెలియదు. ఏం మాట్లాడతారో అంతకంటే తెలియదు. ఎంతమందికి మెమోలిస్తారో అస్సలు తెలియదు. అలాంటి అధికారి ఇటీవలి కాలంలో చెబుతున్న.. ఎప్పుడో ఎత్తిపోయిన ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా విద్యావిధానం గురించి ఉపన్యాసాలివ్వడం నగుబాటు పాలు చేస్తోంది. దానిపై ఉపాధ్యాయులు ఆయనకు ఒక బహిరంగ లేఖ సంధించారు. ‘టీచర్లకే టీచరనుకుంటున్న’ ప్రవీణ్ ప్రకాష్‌కు ఓ ఉపాధ్యాయుడు సంధించిన లేఖాస్త్రం ఇది.

ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారికి బహిరంగ లేఖ :

అయ్యా !

ఈ రోజు ది 21/ 05/2024 న తమరు ఇచ్చిన ఉపన్యాసం ‘ ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాల విద్యావ్యవస్థ ‘ పతనానికి మూలకారణమయిన ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించకుండా ముగించారు.

సుమారు 28 నిమిషాలు సాగిన మీ ఉపన్యాసంలో రెండు అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు.

1. పదవ తరగతి ఫలితాలు , ఇందులో ప్రభుత్వ – ప్రైవేట్ పాఠశాలల మధ్య ఉన్న సగటు మార్కుల వ్యత్యాసం .

2. సంవత్సరానికి రెండు సార్లు ‘ టీచర్స్ ‘ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులతో సంభాషించడం .

మీరు మీ ఉపన్యాసం లో ప్రభుత్వ బడుల పనితీరు గురించి ఆత్మ విమర్శ ( introspection ) చేసుకోవడానికి పది పబ్లిక్ పరీక్షల మార్కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాను అని చెప్పారు.

పబ్లిక్ పరీక్షల మార్కులను మాత్రమే ఆధారంగా తీసుకొని ‘ పాఠశాలల పనితీరును నిర్ణయించడం ‘ అనే విధానాన్ని ఇంగ్లాండ్ లో 1880 లలోనే వదిలేశారు.
దానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి ఆ విధానం వలన పరీక్షలలో విశృంఖలమైన కాపీయింగ్ కు దారితీయడం, మరియు విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధిని పరిశీలించడానికి పబ్లిక్ పరీక్షలలో మార్కులు ఒక్కటే కొలమానం కాదని నిర్ణయించారు.

1880 లలో ఇంగ్లాండ్ లో వదిలేసిన విధానాన్ని, సుమారు 140 సం రాల తర్వాత కూడా ( అనగా 2024 లో ) మన ప్రభుత్వం దానినే శిరోధార్యంగా భావిస్తుంది.

ఆంధ్ర లో పబ్లిక్ పరీక్షలలో అవకతవకలు :
మన రాష్ట్రంలో పది పబ్లిక్ పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలు, విద్యార్థుల యొక్క అభ్యసనా స్థాయిలను ( Learning standards ) పరీక్షించేవిగా కాకుండా , అవి అత్యంత నాసిరకంగా 6 – 7 వ తరగతుల స్థాయిలలో కూడా లేవు.

పరీక్షల నిర్వహణ అయితే అత్యంత హాస్యాస్పదం . పరీక్షా గదులలో ఉపాధ్యాయులు … విద్యార్థులు చేత సమిష్టిగా పరీక్షలు రాయించడం సిగ్గు చేటు!

జవాబు పత్రాల మూల్యాంకనం ఒక ప్రహసనం . చేతులకు ఎముకలేదన్నట్లుగా మార్కులు వేశారు, మరియు ‘ ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ‘ లు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఎన్ని స్పెల్లింగ్ తప్పులు పోయినా మార్కులు ( కనీసం తప్పుకి 1/8 వ మార్కు కూడా ) తగ్గించడానికి వీలులేదు . అటువంటి నాసిరకమైన నిబంధనలు పెట్టి … విద్యాశాఖ సమాజాన్ని , తల్లిదండ్రులను మోసం చేస్తుంది !!

ఇంతటి అవకతవకలు ఉన్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల మార్కులను ఆధారంగా చేసుకొని బడుల పనితీరు , విద్యార్థుల చదువులలో నాణ్యతను పరీక్షించడం ‘ అన్యాయమైన అసంబద్ధమైన అనాలోచితచర్య ‘ .

2. సంవత్సరానికి రెండు సార్లు ‘ టీచర్స్ ‘ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడటం :
మీరు చెప్పిన అమెరికా , ఆస్ట్రేలియా దేశాలలో ప్రభుత్వ బడులలో జవాబుదారీతనం ఉంది. ప్రతీ నెలా బడిలో స్కూల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. తరగతి గదిలో పాఠాలు ఎలా చెప్తున్నారో స్కూల్ ఇన్స్పెక్టర్ తరగతి గదిలో ఒక పీరియడ్ అంతా కూర్చొని పాఠాలు విని … ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వ్రాస్తారు. అక్కడ పరీక్షలలో కాపీయింగ్ ఉండదు. అధిక మార్కులు వేయడం జరగదు ( వ్రాసినా వ్రాయకపోయినా మార్కులు వేయడం ఉండదు ) …. Inflation of marks కూడా అత్యంత అరుదు.

కావున తల్లిదండ్రులకు , సమాజానికి విద్యార్థుల యొక్క విద్యాసామర్థ్య వాస్తవాలు తెలుసు. అటువంటి స్థితిలో విద్యార్థులు , వారి కుటుంబ సామాజిక , ఆర్థిక , సాంస్కృతిక పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి, ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లడం ( హోమ్ విజిట్స్ ) కొంత మేర సహాయపడుతుంది.

కానీ మనదగ్గర బడులలో evaluation ఎన్నో లోపాలతో కూడుకున్నది. మరియు స్కూల్ అకడమిక్ ఇన్స్పెక్షన్ లు అనేవి లేవు.
ఉదాహరణకి రాష్ట్రంలో ఎన్నో సార్లు స్కూల్స్ పర్యటించిన మీరు … ఒక్క క్లాస్ లో కూడా ఆసాంతం కూర్చొని ఉపాధ్యాయుడు పాఠాలు ఎలా చెప్తున్నారు అని పరిశీలించలేదు.

టీచర్లు హోమ్ విజిట్స్ చేయడం అనేది కొత్త విధానం కాదు. పది పరీక్షలకు 2 నెలల ముందు ఉపాధ్యాయులు రాత్రి సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు చదువుతున్నారో లేదో అని పరిశీలించి , వారికి సందేహాలు ఉంటే తీర్చడం అనే విధానం చాలా జిల్లాలలో గడచిన 10 సంవత్సరాలలో వివిధ DEO లు అమలు జరిపారు. అయినా అది పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు … కారణం ‘ evaluation పారదర్శకంగా లేని విద్యావ్యవస్థ బాగుపడినట్లు చరిత్రలో లేదు … ఇకముందు జరగదు కూడా !! ‘

చివరిగా ఒక విషయం మీరు ప్రైవేట్ బడులలో ఫలితాలు బాగున్నాయి అని చెప్పారు. అలా తీసుకున్నా కూడా …. అక్కడ టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి హోమ్ విజిట్స్ చేయడం వలన మెరుగైన ఫలితాలు రావడం లేదు. ప్రైవేట్ బడులలో ఉపాధ్యాయులు పిల్లల ఇళ్లకు వెళ్ళే ‘ హోమ్ విజిట్స్ ‘ అనే విధానమే లేదు. అయినా ఫలితాలు ఎలా వచ్చాయి?

మన రాష్ట్రంలో ప్రైవేట్ బడుల పై తల్లిదండ్రులకు నమ్మకం ఉండటానికి , అమెరికా లో ప్రభుత్వ బడులను తల్లిదండ్రులు నమ్మడానికి అత్యంత ప్రధాన కారణం ‘ జవాబుదారీతనం ‘ . అటువంటి కీలకమైన సంస్కరణల గురించి మాట్లాడకుండా … హోమ్ విజిట్స్ చేస్తే పిల్లల చదువు లో మార్పు వస్తుంది అని చెప్పడం … తల్లిదండ్రులను , పౌర సమాజాన్ని , రాజకీయ పార్టీలను తప్పు దోవ పట్టించడమే .

ఇట్లు ,
డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్

Leave a Reply