చెరకు రైతుల బాధలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు?

•చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించలేరా?
•రైతుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చే తీరు సరికాదు
* జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్
విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్.సి.ఎస్. చక్కెర కర్మాగారం దగ్గర బకాయిల కోసం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైంది. గత రెండేళ్ల నుంచి ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకాయిలను ఇప్పించేలా చూడాల్సిన పాలన యంత్రాంగం ఈ సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదు.
మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోంది. ఆందోళన చేస్తున్న రైతులు చివరకు రోడ్డెక్కి తమ బాధను అందరికీ తెలిసేలా నిరసన చేపట్టారు. ఇలాంటి తరుణంలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించకుండా అరెస్టులకు దిగి రైతుల్లో ఆగ్రహాన్ని పెంచారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే… మరో వైపు రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు నలిగిపోతున్నారు.
రెండేళ్ల నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించాల్సిన ప్రభుత్వం జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామనడం రైతులను వంచించడమే. ఈ సమస్యపై రైతుల పక్షాన నిలబడాలని మా పార్టీ నాయకులకు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా చెరకు రైతులకు రూ.90 కోట్లకు పైగా బకాయిలు గత రెండు సీజన్ల నుంచి ఉన్నాయి. రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి బకాయిలు వచ్చేలా సమన్వయం చేయాల్సిన రాష్ట్ర సుగర్ కేన్ విభాగం ఏం చేస్తోంది?
ప్రిన్సిపల్ సెక్రెటరీ లాంటి సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి నేతృత్వంలో ఉండే ఈ విభాగం- చెరుకు తోలిన రైతులకు 15 రోజుల్లో కర్మాగారం నుంచి డబ్బులు వచ్చేలా చూడాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినా గత రెండు సీజన్ల నుంచి బకాయిలు ఉన్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే అవకాశం ఉన్నా ఆ చట్టాన్నివినియోగించకపోవడంపై సందేహాలు వస్తున్నాయి.
పాల‌కుల దాష్టీకం నుంచి కాపాడాల‌ని ఆదిశ‌క్తిని ప్రార్థిస్తున్నా
దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తు. అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ శుభాకాంక్ష‌లు. మ‌తి త‌ప్పిన పాల‌కుల దాష్టీకాల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల‌ని ఈ దివ్వెల పండుగ సంద‌ర్భంగా ఆ ఆదిశ‌క్తిని ప్రార్థిస్తున్నాన‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన నా ప‌క్షాన‌, జనసేన శ్రేణుల ప‌క్షాన దీపావ‌ళి శుభాకాంక్షలు’ అని ప‌వన్ అన్నారు.
పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందామ‌ని చెప్పారు. ఎక్కువ హానికరం కాని బాణ‌సంచాతో దీపావళి జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కంటికి హాని చేసే వాటికి దూరంగా ఉందామ‌ని పిలుపునిచ్చారు.