-మిస్ ఇంగ్లాండ్ అవమానానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
– ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మెగీ అవమానకర పరిస్థితుల మధ్య వేదిక నుండి వైదొలగడం రాష్ట్రానికి మచ్చలా మారిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ ప్రజల గౌరవాన్ని తూచలో తాకే ఘటనగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు. గౌరవించని చోట ఏ కార్యాలు ఫలించవు.
ఈ సంఘటన భారతీయ సంప్రదాయాలను తక్కువ చేయడమే కాకుండా, విదేశీ అతిథులను అవమానపరచిన ఘటనగా దారితీసిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన విదేశాల్లో జరిగి ఉంటే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదై ఉండేదని, కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మౌనాన్ని పాటించిందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదాస్పద సంఘటనపై ఇప్పటికీ స్పందించకపోవడాన్ని విమర్శించారు. ఆయన కుటుంబ వ్యవహారంలా ఈ పోటీలను వ్యవహరించారని, ఇది వ్యక్తిగత కార్యక్రమం కాదని, అధికారికంగా జరిగిన విషయమని తెలిపారు.
మిస్ ఇంగ్లాండ్ రాష్ట్రానికి వచ్చిన అతిథి మాత్రమే కాక, దేశ గౌరవానికి ప్రతినిధిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రమే కాక దేశానికి కూడా సీఎం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రులే అందాల పోటీలు జరిగాయని అంగీకరిస్తున్న నేపథ్యంలో, దీనిపై హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ వుమెన్ కమిషన్‌లు సుమోటోగా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకపోవడం ప్రభుత్వ వ్యూహాత్మక మౌనానికే నిదర్శనమన్నారు.
కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కూడా స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. బీజేపీ-కాంగ్రెస్ మధ్య అవగాహనతోనే ఆయన మౌనం వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ పోటీలను రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసం వాడుకున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు.
ముఖ్యమైన మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లు, ప్రముఖ నటీమణులు ఈ పోటీల్లో పాల్గొనకపోవడాన్ని ఉల్లేఖిస్తూ, ఇది అంతర్జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు పొందలేదని, పెట్టుబడుల పేరిట జరిగిన డబ్బు ఆటగా మిగిలిపోయిందన్నారు.
మిస్ ఇంగ్లాండ్ వ్యవహారంపై మంత్రి జూపల్లి ఇచ్చిన వ్యాఖ్యలకు సమాధానంగా — ఎలాంటి విచారణ జరిగింది? ఎవరితో కమిటీ వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు విడుదల చేయడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక గద్వాల్ జిల్లా ధన్వాడలో రైతులపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి తన స్వంత జిల్లాలోనే రైతులను అణగదొక్కుతున్నారని విమర్శించారు. భూములు బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ రెండు అంశాలపై పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే వరకు బీఆర్ఎస్ విశ్రాంతి తీసుకోదని స్పష్టం చేశారు. మిస్ ఇంగ్లాండ్ వ్యవహారంపై ఇప్పటికే ఆర్‌టీఐ దరఖాస్తు చేశామని తెలిపారు.
కాంగ్రెస్ అధినేత్రులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ , మహిళా నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.ఈ పత్రిక సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.