Suryaa.co.in

Telangana

సోమేష్ కుమార్ భార్యపై ఎందుకు కేస్ ఫైల్ చెయ్యడంలేదు?

-సోమేష్ కుమార్ భార్య పేరుమీద 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా.. ఎందుకు కేస్ ఫైల్ చెయ్యడంలేదు?
-ధరణి పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదు?
-రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్సీలుగా, ప్రత్యేక సలహాదారులుగా ఎలా నియమించబడతారు?
-సిరిసిల్లలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది.. ఆ విషయం కేటీఆర్ కి అర్ధమవడంలేదు
-కేటీఆర్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే శంకరగిరి మాన్యాలకు పంపుతాం
-మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతోంది.చాలా తప్పిదాలు ప్రభుత్వం ముందు సాక్షాత్కిరిస్తున్నట్లు కనిపిస్తున్నా.. చర్యలు తీసుకోవడానికి అడుగులు తడబడుతూనే ఉన్నాయి.

గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరుమీద 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా.. ఎందుకు కేస్ ఫైల్ చెయ్యడంలేదు?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి.. సర్వీస్ లో లబ్ధిపొందారని, తమ కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కనిపిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు..?ధరణి పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదు?

ధరణి స్థానంలో భూమాతను తీసుకొచ్చి పేద రైతులకు అండగా ఉంటామని, తప్పుచేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఏమైంది..? హెటిరో సంస్థలకు ఇచ్చిన భూములపై పున:సమీక్షించమని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు జీవోలతో దోచుకున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తడబడుతోంది?

హెటిరో సంస్థకు ఇచ్చిన వేలకోట్ల విలువైన భూములు.. అక్రమమని తెలిసినా అవకతవకలపై ఎందుకు విచారణ జరపడం లేదు? రాష్ట్రంలో ఐఏఎస్ ల గురించి చెప్పాలంటే రజత్ కుమార్ ,సోమేష్ కుమార్,అరవింద్ కుమార్ వెంకట్ రామిరెడ్డి అని ఇలా చాలా మందిపై ఆరోపణలున్నాయని, అధికారంలోకి రాగానే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నట్లు?

రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్సీలుగా, ప్రత్యేక సలహాదారులుగా ఎలా నియమించబడుతారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై CBI విచారణ జరిపించాలంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం లోకి రాగానే ఆ ఊసే మరిచిపోయింది.

2014 నుండి మీరు cm అయ్యేవరకు ధరణి భూముల విషయంపై విచారణ చేయగలరా? Mr ప్రాపర్టీస్ లలో పెద్ద పెద్ద బంగళాలు కడుతున్నారు దానిపై చర్యలేవి? పార్లమెంట్ ఎన్నికల లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది తప్పితే అక్రమార్కులపై చర్యలు మాత్రం లేవు. ప్రజాధనానికి, ప్రభుత్వ ధనానికి విశ్వాసంగా ఉండాల్సిన ప్రభుత్వం.. చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకు ఎందుకు విచారణ జరిపించలేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మిన భూములు, కేటాయించిన భూములు, ధరణిలో గాయబ్ చేసిన భూములు, రిటైర్డ్ ఐఏఎస్ లు, ప్రస్తుత ప్రభుత్వంలోని ఐఏఎస్ లకు అప్పనంగా కట్టబెట్టినవి ఎంతనేదానిపై విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నట్లు, తెలంగాణ రైతుల భూములు ఎంఆర్ ప్రాపర్టీస్ లో కలుపుకున్నట్లు, వక్ఫ్ భూములు, ల్యాంకో హిల్స్ అక్రమాలపై విచారణ జరిపే దమ్ముందా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

గత ప్రభుత్వం పెద్దల చేతుల్లోకి అప్పనంగా పోయిన భూముల విషయంలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి జైలుకు పంపించాలి.బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎప్పుడైనా కలిసి పోటీ చేశాయా..?

కేటీఆర్ ఎన్ని అబాండాలు వేసినా, అసత్య ప్రచారాలు చేసినా కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు పార్టీలేనని ప్రజలకు తెలుసు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది.. ఆ విషయం కేటీఆర్ కి అర్ధమవడంలేదు.

మతి భ్రమించినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు.. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఢిల్లీలో ఎన్నడూ ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు చేసిన అన్యాయానికి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి.

మలిదశ తెలంగాణ ఉద్యమం నడిపిన శ్రీకాంత చారి తల్లికి ఫిబ్రవరిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ చిత్తశుద్ధిని చాటుకోవాలి. కేటీఆర్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే శంకరగిరి మాన్యాలకు పంపుతాం.

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సునీత రెడ్డి ,బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి , బిజెపి నాయకులు లింగం పాల్గొన్నారు.

LEAVE A RESPONSE