– బీఆర్‌ఎస్‌పై ఏపీలో ‘తెలంగాణ ముద్ర’ ఉండదా?
– బీఆర్‌ఎస్‌లో చేరేదెవరు?
– టీడీపీ నేతలు బీఆర్‌ఎస్ వైపు వెళతారా?
– కొప్పుల వెలమపైనే కేసీఆర్ ఆశలు
– ఇప్పటికే వైసీపీ-టీడీపీలో కొప్పుల వెలమలు
– హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిపై గురి పెడతారా?
– కేసీఆర్ ‘గత ఎన్నికల ప్రయోగం’ ఫలిస్తుందా?
– వైసీపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందా?
– బీఆర్‌ఎస్‌పై జగన్ వైఖరేమిటి?
– బీజేపీని కాదని కేసీఆర్ పార్టీతో చెలిమి చేస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేసీఆర్ ‘నేషనల్ పొలిటికల్ గేమ్’ ప్రారంభమయింది. జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు రంగం సిద్ధం చేస్తున్న కేసీఆర్.. ఆ మేరకు ఆంధ్రాలో కూడా తన పార్టీకి ప్రాణం పోయడం, ఇప్పుడు సాంకేతిక అనివార్యమయింది. అందులో భాగంగా ఇప్పటినుంచే ఆయన, తనకు పరిచయం ఉన్న నేతలతో టచ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారన్నది దాని సారాంశం.
ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని ఎన్నికల సమయంలో, ‘ఆంధ్రాపార్టీ’ అని టీఆర్‌ఎస్ ఏవిధంగా ముద్ర వేసిందో.. రేపు ఆంధ్రాలో బీఆర్‌ఎస్ పెడితే ‘అది తెలంగాణ పార్టీగా’ ముద్ర పడదా? అన్న సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో ఆంధ్రాలో, తెలంగాణ మాదిరి భావోద్వేగం ఉంటుందా? ఉండదా? అసలు బీఆర్‌ఎస్‌లో చేరేది ఎవరు? ఏ స్థాయి నేతలు చేరతారు? అంతకుమించి..కేసీఆర్ జాతీయ పార్టీపై, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వైఖరి ఏమిటి? దానిని ఆయన మిత్రపక్షంగా చూస్తారా? శత్రుపక్షంగా చూస్తారా? ఇప్పటివరకూ సన్నిహితంగా ఉన్న జగన్.. రేపు కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కూడా, అదే వైఖరితో ఉంటే కేంద్రంలోని బీజేపీతో నష్టమా ? కాదా? అసలు ఆంధ్రాపై కేసీఆర్ ధీమా ఏమిటి? ఇవీ.. కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటతో తెరపైకి వచ్చిన చర్చ.
తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. ఆ మేరకు తన పార్టీ యంత్రాగాన్ని సమాయత్తపరిచి, పార్టీ పేరు ప్రకటనకు ముహుర్తం ఎంచుకున్నారు. అయితే కేసీఆర్ ఊపిరిపోయనున్న జాతీయ పార్టీ గుర్తింపునకు, మిగిలిన రాష్ట్రాల్లో సాంకేతికంగా ఓట్లు అవసరం. కనీసం రెండు, మూడు రాష్ట్రాల్లో జాతీయ పార్టీకి ఈసీ నిబంధనల ప్రకారం, ఎన్నికల్లో ఆ నిష్పత్తిలో ఓట్లు దక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు పేరుకు తెలుగుదేశం-వైసీపీ పార్టీ కూడా జాతీయ పార్టీ అయినా, ఇటీవల వాటి జాతీయ పార్టీ హోదాను ఈసీ తొలగించింది. చివరకు కమ్యూనిస్టు పార్టీలదీ అదే పరిస్థితి.
ఆ ప్రకారంగా చూస్తే కేసీఆర్ జాతీయ పార్టీకి కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లో ఓట్ల అవసరం ఉంటుంది. రెండు రాష్ట్రాలూ తెలంగాణకు సరిహద్దులోనే ఉన్నాయి. ఇక ఆంధ్రాకు చెందిన కొన్ని లక్షల మంది హైదరాబాద్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాల నుంచే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అందువల్లనే టీడీపీ.. ఇటీవలి ఎన్నికల వరకూ మనుగడ సాధించగలిగింది. ఆంధ్రామూలాలున్న వైసీపీ కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలిచింది.
గత మూడున్నరేళ్లలో ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు, మళ్లీ వలసలు విపరీతంగా పెరిగాయి. కానీ, ఆంధ్రాలో తెలంగాణ నుంచి వెళ్లిన వారు బహు తక్కువ. వివాహాలకు సంబంధించి ఇచ్చి పుచ్చుకోవడాలు తప్ప, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావారి సంఖ్యతో పోలిస్తే.. ఏపీలో ఉన్న తెలంగాణ వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. ఇదీ ఆంధ్రా-తెలంగాణ లెక్క.
కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించనున్న నేపథ్యంలో.. ఆంధ్రాలో ఆ పార్టీకి ఆదరణ ఉంటుందా? లేదా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత ఆంధ్రా దోపిడిదారులపై ఉద్యమించింది. గత ఎన్నికల్లో ఆంధ్రా పార్టీ అయిన టీడీపీ ఇక్కడ అవసరమా అని ప్రశ్నించింది. కాంగ్రెస్ గెలిస్తే ప్రతిదానికీ అమరావతికి వెళ్లాలా అన్న ప్రచారాన్ని బ్రహ్మాస్త్రంగా సంధించి.. సెంటిమెంట్ పేరుతో రెండోసారి అధికారంలోకి వచ్చింది.అప్పటికి టీడీపీ ఇంకా అధికారికంగా జాతీయ పార్టీ హోదాలోనే ఉండటం ప్రస్తావనార్హం. అయితే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా, ఇప్పటివరకకూ ఒక్క ఆంధ్రావాడిపైనా దాడి జరగకపోవడం ప్రస్తావనార్హం.
మరి కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ఏపీలో ప్రారంభిస్తే, అక్కడ కూడా ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి భావోద్వేగమే ఎదురుకావా? అన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన చర్చ. టీఆర్‌ఎస్ మాదిరిగానే.. ఏపీలో కూడా ‘‘తెలంగాణ పార్టీ పెత్తనం ఇక్కడెందుకు?ఆ పార్టీ గెలిస్తే ప్రతిదానికీ హైదరాబాద్ వెళ్లాలా? అసలు కేసీఆర్‌కు ఆంధ్రాలో ఏం పని’’ అంటూ.. గతంలో టీఆర్‌ఎస్ వేసిన ప్రశ్నలనే, ఆంధ్రా పార్టీలు ఎదురు సంధిస్తే పరిస్థితి ఏమిటన్నది అందరి సందేహం.
అసలు బీఆర్‌ఎస్‌లో చేరే ఆంధ్రా నేతలు ఎవరు? ఏ స్థాయి నేతలు? అందులో టీడీపీ నేతలు ఎంతమంది? మిగిలిన పార్టీల వారూ అందులో చేరతారా? అన్నది మరో సందేహం. అయితే సీఎం కేసీఆర్, ఇప్పటికే తనకు పరిచయం ఉన్న పాత నేతలతో టచ్‌లో ఉన్నారంటూ, గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మరి అది నిజమా? లేక టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్‌లో భాగమా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి.
కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి నేతలలో, ఏపీలో చాలామంది టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయన మిత్రుడయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రస్తుతం జీవించి లేరు. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడు టీడీపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కెఇ కృష్ణమూర్తి, యనమల, కళావెంకట్రావు, సోమిరెడ్డి, ఫరూఖ్, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్లంతా టీడీపీలోనే ఉన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న కొప్పుల వెలమల్లో.. ధర్మాన, వెలమ వర్గానికి చెందిన ఎంపీ శ్రీధర్ లాంటి వాళ్లు వైసీపీలో ఉన్నారు. కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్న దాడి వీరభద్రరావు వంటి సీనియర్లు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఈవిధంగా కొప్పుల వెలమలు వైసీపీ-టీడీపీలోనే ఉన్నందున, వారిలో ఎంతమంది కేసీఆర్ బీఆర్‌ఎస్‌లో చేరతారో చూడాలి.
ఏపీలో రెడ్లు- క్రైస్తవులు- మాలలు- కొప్పుల వెలమ- కళింగ సామాజికవర్గం అధికారంలో ఉన్న వైసీపీలో ఉంది. కమ్మతోపాటు మరికొన్ని బీసీ వర్గాలు టీడీపీ వైపు ఉన్నాయి. టీడీపీతో మొదటి నుంచీ ఉన్న రెడ్డివర్గం ఇంకా అదే పార్టీతో నడుస్తోంది. కమ్మనేతలు వైసీపీలో చేరారు తప్ప, రెడ్డి నేతలు వెళ్లిన సందర్భాలు తక్కువ. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి మాత్రమే వచ్చే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. ఆ మేరకు కొన్నేళ్ల నుంచి అవి జనక్షేత్రంలో పాతుకుపోయాయి. జనంలో ఇమేజ్, సినీ గ్లామర్ ఉన్న పవన్ కల్యాణ్ కూడా తన జనసేనను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లలేకపోయారు.
ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే కేసీఆర్ బీఆర్‌ఎస్‌కు, స్థానం ఎక్కడ అన్న చర్చ ఆసక్తి కలిగిస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, కంపెనీలున్న పారిశ్రామికవేత్తలో, లేక హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉండి.. టీడీపీ-వైసీపీలో గుర్తింపు లేని-టికెట్లు దక్కని నాయకులు మాత్రమే, బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.
గత ఎన్నికల ముందు.. హైదరాబాద్‌లో వ్యాపారాలు- భూములు- ఆస్తులున్న టీడీపీకి చెందిన అనేక మంది నేతలను టీఆర్‌ఎస్ నాయకత్వం బెదిరించి, వారిని వైసీపీలో చేర్పించిన వైనం సంచలనం సృష్టించింది. చాలామంది అదే భయంతో ఎన్నికలకు పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్ నాయకత్వం..ఏపీలో తన బీఆర్‌ఎస్ మనుగడ కోసం, అదే ఫార్ములాను ప్రయోగిస్తుందా? లేదా అన్నది చూడాలి.
లేదా జాతీయ పార్టీగా మనుగడ సాగించాలంటే.. బీఆర్‌ఎస్-వైసీపీ కలసి పోటీ చేయాలి. రెండు పార్టీలకు ఇప్పుడు ‘అన్ని విషయాల్లో’ సమన్వయం ఉంది కాబట్టి, అది పెద్ద కష్టం కాకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే.. బీఆర్‌ఎస్ ఏపీలో అడుగుపెట్టే అంశం, జగన్‌కు ఇరకాటమేనన్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
నిజానికి వైసీపీ-బీజేపీ బంధం తెరవెనుక బలంగానే ఉంది. కేంద్రంలోని బీజేపీ శక్తి ఏమిటన్నది, జగన్‌కు తెలియదనుకుంటే అమాయకత్వమే.పైగా జగన్ కేసులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. ఇటీవలే మినహాయింపు తెచ్చుకున్నారు. అందువల్ల అన్నీ తెలిసి బీఆర్‌ఎస్‌తో బంధం ఏర్పరచుకుంటారా? ఎన్నికల్లో కలసి పోటీ చేయడం ద్వారా, ఈసీ వద్ద ఉన్న బీఆర్‌ఎస్ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సహకరిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.
అయితే.. బీఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేసి, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుందా? ఆ మేరకు వైసీపీని గట్టెక్కిస్తుందా అనుకుంటే.. కొత్తగా పెట్టే కేసీఆర్ బీఆర్‌ఎస్‌కు ఆంధ్రాలో, అంత స్థాయి ఉండదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. తెలంగాణలో మాదిరిగా ఏపీలో త్రిముఖ పోటీ ఉండదని, వైసీపీ-టీడీపీ మధ్యనే పోటీ ఉంటుందన్నది వారి అంచనా. క్షేత్రస్థాయిలో వాస్తవం కూడా అదే.